Share News

‘డయాబెటిక్‌ ఫుట్‌’ సమస్యకు.. కొత్త ‘సొల్యూషన్‌’

ABN , Publish Date - May 06 , 2026 | 04:58 AM

డయాబెటిక్‌ ఫుట్‌ సమస్యతో బాధపడేవారికి, అత్యంత సంక్లిష్టమైన ఎముక ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపయోగపడే ‘సెరామెంట్‌ జి’ అనే అత్యాధునిక ఎముక పునరుత్పత్తి విధానాన్ని అపోలో ఆస్పత్రి దేశంలో తొలిసారి అందుబాటులోకి తెచ్చింది

‘డయాబెటిక్‌ ఫుట్‌’ సమస్యకు..  కొత్త ‘సొల్యూషన్‌’

  • కాళ్లకు, వేళ్లకు ఇన్ఫెక్షన్లు సోకినా.. వాటిని తొలగించాల్సిన పనిలేకుండా చేసే ఔషధం

  • ఎముకల ఇన్ఫెక్షన్లను తగ్గించడంతో పాటు వాటిని పునర్నిర్మించే సెరామెంట్‌ జి

  • అభివృద్ధి చేసిన స్వీడన్‌ కంపెనీ ‘బోన్‌ సపోర్ట్‌’

  • భారత్‌లో అందుబాటులోకి తెచ్చిన అపోలో ఆస్పత్రి

హైదరాబాద్‌ సిటీ, మే 5(ఆంధ్రజ్యోతి): డయాబెటిక్‌ ఫుట్‌ సమస్యతో బాధపడేవారికి, అత్యంత సంక్లిష్టమైన ఎముక ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపయోగపడే ‘సెరామెంట్‌ జి’ అనే అత్యాధునిక ఎముక పునరుత్పత్తి విధానాన్ని అపోలో ఆస్పత్రి దేశంలో తొలిసారి అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో ఈ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. సెరామెంట్‌ జి అనేది.. ఒకరకమైన సిరామిక్‌ సొల్యూషన్‌. స్వీడన్‌కు చెందిన బోన్‌ సపోర్ట్‌ అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఎముక దెబ్బ తిన్నప్పుడు, తొలగించినప్పుడు.. ఆ ప్రదేశంలో ఈ సొల్యూషన్‌ను ఇంజెక్ట్‌ చేస్తే కొత్త ఎముక పెరగడానికి ఇది దోహదం చేస్తుంది. అలాగే, ఇందులో ఉండే యాంటీబయాటిక్‌ ఔషధం (జెంటామైసిన్‌.. ‘సెరామెంట్‌ జి’లో జి అంటే జెంటామైసినే. అదే సెరామెంట్‌ వి అని ఉంటే.. అందులో వ్యాంకోమైసిన్‌ అనే యాంటీబయాటిక్‌ ఉంటుంది).. నేరుగా ప్రభావిత ప్రాంతంలోనే పనిచేసి, ఇన్ఫెక్షన్‌ను వేగంగా తగ్గిస్తుంది. మధుమేహ బాధితుల్లో ఎక్కువగా కనిపించే సమస్య డయాబెటిక్‌ ఫుట్‌. అంటే దీర్ఘకాలంపాటు రక్తంలో చక్కెరస్థాయులు అధికంగా ఉండడం వల్ల పాదాల్లోని రక్తనాళాలు, నరాలు దెబ్బతింటాయి. దీనివల్ల స్పర్శ తగ్గుతుంది. పాదాలకు దెబ్బతగిలినా, ముల్లు గుచ్చుకున్నా నొప్పి అంతగా తెలియదు. అదే సమయంలో.. రక్తనాళాలు, నరాలు దెబ్బతింటం వల్ల పాదాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా ఏదైనా గాయం అయితే అది ఒక పట్టాన మానదు. యాంటీబయాటిక్‌ మందులు వేసుకున్నా అది రక్తం ద్వారా.. కాలికిగాయం అయిన ప్రదేశం దాకా సరిగ్గా వెళ్లదు. ఫలితంగా, ఇన్ఫెక్షన్‌ పెరిగి, అది ఎముక వరకూ సోకి.. ఆ భాగం వరకూ తొలగించాల్సిన (యాంప్యుటేట్‌ చేయాల్సిన) పరిస్థితి వస్తుంది.


అలాంటి సందర్భాల్లోనే సెరామెంట్‌ జి పనికొస్తుంది. అలా తొలగించిన ఎముక భాగంలో ఈ సొల్యూషన్‌ను ఇంజెక్ట్‌ చేస్తే.. యాంటీ బయాటిక్‌ మందు ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. సెరామిక్‌ పదార్థం మళ్లీ కొత్త ఎముక పెరిగేలా చేస్తుంది. గ్యాంగ్రీన్‌ వల్ల కుళ్లిన కణజాలాన్ని తొలగించి, ఆ భాగంలో దీన్ని ఇంజెక్ట్‌ చేస్తే.. ఇన్ఫెక్షన్‌ ఎముక దాకా వెళ్లకుండా నివారిస్తుంది. మధుమేహ బాధితులకు, ఎముక ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి ఎంతగానో ఉపయోగపడే ఈ సొల్యూషన్‌కు సంబంధించి మంగళవారం జూబ్లీహిల్స్‌ అపోలోలో వైద్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ హాస్పిటల్‌కు చెందిన ఆర్థోపెడిక్‌ శస్త్రచికిత్స నిపుణుడు ప్రొఫెసర్‌ వేణు కవర్తపు నేతృత్వంలో కెడవరిక్‌ వర్క్‌ షాప్‌, లైవ్‌ సర్జరీలు, అకడమిక్‌ సెషన్లు నిర్వహించారు. డయాబెటిస్‌కు సంబంధించిన ఎముక ఇన్ఫెక్షన్లు చాలా క్లిష్టమైనవని.. కాళ్లకు ఏవైనా గాయాలైనా, చాలా మంది బాధితులు ఆలస్యంగా తమ వద్దకు వస్తారని.. ఈ కొత్త చికిత్స ద్వారా వారికి త్వరగా చికిత్స అందించి, వారి కాళ్లను రక్షించవచ్చని అపోలో ఆస్పత్రుల జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీత రెడ్డి వివరించారు. బహుళ దశల శస్త్రచికిత్సలకు బదులుగా ఈ విధానంలో ఒకే దశలో చికిత్స అందించవచ్చని ప్రొఫెసర్‌ డాక్టర్‌ వేణు కవర్తపు తెలిపారు. ఇన్ఫెక్షన్‌ను నియంత్రించడంతోపాటు.. ఎముక పునర్నిర్మాణం చేయగలగడం ఈ విధానం ప్రత్యేకత అని, దీంతో మళ్లీ మళ్లీ శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం తగ్గుతుందని వెల్లడించారు. విదేశాల్లో ఇప్పటికే విస్తృతంగా వినియోగంలో ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ కొత్త చికిత్స ద్వారా యాంప్యుటేషన్ల సంఖ్య తగ్గుతుందని, బాధితులు ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం ఉండదని వివరించారు.

Updated Date - May 06 , 2026 | 04:59 AM