4 నోటిఫికేషన్లు.. 7,437 ఉద్యోగాలు
ABN , Publish Date - Jul 30 , 2026 | 07:14 AM
రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్), అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో 7,437 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీజీపీఆర్‌బీ) బుధవారం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్), అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో 7,437 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీజీపీఆర్‌బీ) బుధవారం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసింది. పోలీస్ శాఖలో 5,000, అగ్నిమాపక శాఖలో 790, జైళ్ల శాఖలో 223, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 1,424 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ తేదీలను త్వరలోనే పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేస్తామని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.
నోటిఫికేషన్లలో పేర్కొన్న అర్హతలను పరిశీలించిన తర్వాతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శారీరక, వైద్య ప్రమాణాలకు సంబంధించి ముందుగానే సివిల్ సర్జన్ ద్వారా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు తాజా కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ (2026 ఏప్రిల్ 1 తర్వాత జారీ అయినది), బీసీ నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్, స్థానిక ధ్రువీకరణ పత్రాలు, ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయని, దరఖాస్తు చేసే ముందు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని కోరారు. జోన్ల వారీ పోస్టుల రిజర్వేషన్ల వివరాలను సైతం అందుబాటులో ఉంచామని వివరించారు.
తాజా నియామకాల్లో మహిళలకు పెద్దపీట వేశారు. పోలీసు కానిస్టేబుల్(సివిల్), ఎస్పీఎఫ్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్స్ విభాగాల్లో మూడో వంతు, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల్లో దాదాపు 10శాతం పోస్టులను మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ సారి మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయనున్నారు. మహిళా అభ్యర్థి ఏ సామాజిక వర్గానికి చెందిన వారైతే ఆ వర్గంలోనే మహిళా రిజర్వేషన్ కింద ఆమెకు అవకాశం కల్పిస్తారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు అందుబాటులో లేకపోతే.. ఆయా ఖాళీలను అదే సామాజిక వర్గానికి చెందిన పురుష అభ్యర్థులతో భర్తీ చేస్తామని బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.
భర్తీ చేయనున్న పోస్టులు ఇవీ..
పోలీసు శాఖ
సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్) - 148
సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్) - 14
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్(టీజీఎస్‌పీ) - 12
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్(సీపీఎల్) - 3
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఎఫ్‌పీబీ) - 23
కానిస్టేబుల్ (సివిల్) - 3,697
కానిస్టేబుల్(ఏఆర్) - 1,052
కానిస్టేబుల్(సీపీఎల్) - 24
కానిస్టేబుల్(డ్రైవర్) - 20
కానిస్టేబుల్(మెకానిక్) - 7
అగ్నిమాపక శాఖ
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ - 39
ఫైర్ ఫైటర్ - 751
జైళ్ల శాఖ
డిప్యూటీ జైలర్(పురుషులు) - 14
డిప్యూటీ జైలర్(మహిళలు) - 1
వార్డర్(పురుషులు) - 196
వార్డర్(మహిళలు) - 12
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్
సబ్ ఇన్‌స్పెక్టర్ - 44
కానిస్టేబుల్ - 1,380