ఫ్రాన్స్‌లో ఉన్నతచదువులు.. భారతీయ విద్యార్థులకు అద్భుత అవకాశాలు
ABN , Publish Date - Aug 25 , 2026 | 05:33 PM
ఫ్రాన్స్‌లో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్యను 2030 కల్లా 30 వేలకు పెంచుకునేందుకు అక్కడి అధికారులు కసర్తతు చేస్తున్నారు. తమ దేశంలో చదువులపై అవగాహన కల్పించేందుుకు అక్టోబర్‌లో ‘ఛూజ్ ఫ్రాన్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: విదేశీ చదువుల విషయంలో భారతీయుల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది. యూనివర్సిటీల ర్యాంకింగ్స్, పాప్యులారిటీలే కాకుండా అక్కడి చదువుల ఖర్చు తమకు అందుబాటులో ఉంటుందా? చదువు పూర్తయ్యాక ఉద్యోగావకాశాలు ఏమేరకు ఉంటున్నాయి? వంటి అంశాల ఆధారంగా ప్రస్తుతం నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులు ఉన్నత చదువుల కోసం తమ దేశాన్ని ఎంచుకునేలా ఫ్రాన్స్ చర్యలు ప్రారంభించింది.
2030లో తమ దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్యను నాలుగు రెట్లకు పెంచుకునే లక్ష్యంతో అక్కడి అధికారులు అక్టోబర్‌లో ‘ఛూజ్ ఫ్రాన్స్’ కార్యక్రమాన్ని సిద్ధమవుతున్నారు. ముంబై, పుణె, న్యూఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన అనేక యూనివర్సిటీలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తమ దేశంలోని అవకాశాల గురించి విద్యార్థులకు వివరించనున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం, 2024-25 సంవత్సరంలో ఫ్రాన్స్‌లో 9,100 మంది భారతీయ విద్యార్థులు చదువుకున్నారు. ఫ్రాన్స్‌లోని అంతర్జాతీయ విద్యార్థుల్లో సంఖ్యాపరంగా భారతీయులు 11వ స్థానంలో నిలిచారు.
పెరిగిన విద్యావకాశాలు..
ఫ్రాన్స్‌లో భారతీయులకు విద్యావకాశాలు పెరిగిన నేపథ్యంలో అన్ని విషయాలు తరచి చూసుకుని నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలతో పోలిస్తే ఫ్రాన్స్ ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఫీజులు కొంత తక్కువగానే ఉంటాయి. అయితే, విద్యార్థులు ఎంచుకునే యూనివర్సిటీ, కోర్సు, వారు ఉండే ప్రాంతాన్ని బట్టి జీవన వ్యయాలు పెరిగే అవకాశం ఉంటుంది. స్కాలర్‌షిప్‌లు, సబ్సిడీలు కారణంగా ఫ్రాన్స్‌లో చదువులు భారతీయులకు కొంత అందుబాటులోనే ఉంటాయి.
భారతీయ విద్యార్థుల ప్రాధాన్యాల్లో మార్పులు
ప్రస్తుతం భారతీయ విద్యార్థులు, వారి కుటుంబాలు తమకు అందుబాటు ధరల్లో ఉండే చదువులవైపు మొగ్గు చూపుతున్నారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగావాకాశాలు ఎక్కువగా ఉండే యూనివర్సిటీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక రంగాల్లో విద్యార్థులకు ఫ్రాన్స్ మంచి అవకాశాలను కల్పిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
అందుబాటులోకి ఇంగ్లిష్‌లో కోర్సులు
ఫ్రాన్స్‌లో చదవాలనుకునే భారతీయులకు గతంలో బోధనా భాష ఒక అవరోధంగా ఉండేది. అయితే, ప్రస్తుతం ఇంగ్లిష్‌లో బోధన ఉండే దాదాపు 1500 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేయాలనుకునే వారు ఆ భాషపై పట్టు సాధిస్తే మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అద్భుతమైన కెరీర్‌కు అవకాశం
ఏఐ, డీప్ టెక్, ఎయిరోస్పేస్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో పలు మేటి సంస్థలు ఫ్రాన్స్‌లో ఉన్నాయి. కేవలం డిగ్రీలే కాకుండా చదువుల తరువాత విదేశీ స్టూడెంట్స్ కెరీర్‌లు దూసుకుపోయేలా తమ దేశంలో అనేక అవకాశాలు ఉన్నాయని ఫ్రాన్స్ చెబుతోంది.
పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తే..
ఫ్రాన్స్‌లో మాస్టర్స్ చదువుల తరువాత విద్యార్థులకు ఇతరత్రా నిబంధనలకు లోబడి గరిష్ఠంగా రెండేళ్ల పాటు ఉద్యోగం కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఇది భారతీయులకు సానుకూల అంశమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
అవగాహనతో ముందడుగు..
ఫ్రాన్స్‌ను ఎంచుకునే విద్యార్థులు ముందుగా వివిధ కోర్సులకు సంబంధించి ట్యూషన్ ఫీజులు, వీసా నిబంధనలు, స్కాలర్‌షిప్‌లు వంటి వాటిపై పూర్తి అవగాహనతో ఉండాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు. కొత్త వాతావరణంలో సర్దుకుపోయేందుకు ఎంత సంసిద్ధంగా ఉన్నామన్న దానిపై విజయం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇన్ సర్వీస్ టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల
విదేశాల్లో చదువుకు ‘విద్యానిధి’ భరోసా..