ప్రభుత్వ ఉద్యోగంపై ఆశలే మనకున్న అతిపెద్ద రోగం.. రచయిత కామెంట్
ABN , Publish Date - Nov 20 , 2026 | 07:46 PM
ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలతో దేశ యువత ఇతర అవకాశాలపై దృష్టి సారించట్లేదని జాబ్ సెర్చ్ సీక్రెట్స్ పుస్తక రచయిత సుబీర్ వర్మ పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో లక్షలాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలుకంటారు. వాటి కోసం ఏళ్ల తరబడి సిద్ధం అవుతారు. ప్రభుత్వ ఉద్యోగంతోనే స్థిరమైన జీవితం, భవిష్యత్తు ఉంటాయని నమ్ముతారు. తాజాగా ఈ అంశంపై జాబ్ సెర్చ్ సీక్రెట్స్ పుస్తక రచయిత సుబీర్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తరాది వారికి ఉండే అతిపెద్ద రోగం ప్రభుత్వ ఉద్యోగంపై ఆశలు. నేను ఎప్పుడూ ఇదే చెబుతుంటాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఫ్రెషర్లు నెలరోజుల్లో జాబ్ ఎలా సాధించాలన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు.
ఏ ఉద్యోగం కావాలో స్పష్టమైన లక్ష్యం ఉండాలని సుబీర్ వర్మ విద్యార్థులకు సూచించారు. మీడియా, ఫైనాన్స్, హెచ్‌ఆర్ లాంటి పేర్లకే పరిమితం కాకుండా ఆయా విభాగాల్లో ఏ ఉద్యోగంపై ఆసక్తి ఉన్నదో తరచి చూసుకోవాలని అన్నారు. ఆ తరువాత యువత తమకు తమ వ్యక్తిత్వానికి తగిన జాబ్‌కు సంబంధించి 20 టాప్ కంపెనీలు ఏవో తెలుసుకోవాలని చెప్పారు. వాటిల్లో నియామకాలు నిర్వహించే వారి గురించి తెలుసుకోవాలని సూచించారు. లింక్డ్‌ఇన్ లాంటి వేదికల్లో ఆ వృత్తినిపుణులతో పరిచయాలు పెంచుకోవాలని కూడా సూచించారు. అర్థవంతమైన అభిప్రాయాలను వారితో పంచుకున్నాక అప్పుడు కావాలనుకుంటే ప్రొఫైల్ షేర్ చేయాలని చెప్పారు. అవకాశాలు వస్తాయని ఎదురు చూడకుండా ఉద్యోగాన్వేషణకు ఓ వ్యూహాన్ని ఏర్పాటు చేసుకుంటే కెరీర్‌లో ముందుకెళ్లవచ్చని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
పరిశోధకులకు మంచి ఛాన్స్.. ఫ్రీగా చాట్‌జీపీటీ ప్లస్
జేఎన్‌టీయూ అటానమస్ కాలేజీల్లో హాజరు దందా..