జనపదాల జాగృతికి ఆలంబన
ABN , Publish Date - Feb 28 , 2026 | 01:43 AM
అగ్నిపర్వతం నుంచి పెల్లుబికిన లావా తన దారిలో ఉన్నవాటన్నిటినీ తనలో విలీనం చేసుకుంటుంది. అదే తీరులో– జమీందారీ దుర్మార్గాలకు అతలాకుతలమవుతున్న ప్రజల దైన్యం, ధిక్కారాల నుంచి...
అగ్నిపర్వతం నుంచి పెల్లుబికిన లావా తన దారిలో ఉన్నవాటన్నిటినీ తనలో విలీనం చేసుకుంటుంది. అదే తీరులో– జమీందారీ దుర్మార్గాలకు అతలాకుతలమవుతున్న ప్రజల దైన్యం, ధిక్కారాల నుంచి ప్రభవించిన ‘జమీన్ రైతు’ వారపత్రిక ఉద్యమ భావజాలం ఆనాటి నెల్లూరు తదితర ప్రాంతాల సమాజ జీవిత రంగాలన్నిటినీ తనలో అంతర్భాగం చేసుకుందనడంలో అతిశయోక్తి లేదు. జమీందారీ వ్యతిరేక పోరాటం, బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్య్ర పోరాటాలకు ఊతమిచ్చే లక్ష్యంతో నెల్లూరు వెంకట్రామానాయుడు ఈ వార పత్రికను స్థాపించి అహరహం కృషి చేశారు.
నాడు– బ్రిటిష్ వలసవాదం, దాని దోపిడీ యంత్రాంగమైన జమీందారీల వ్యవస్థతో ఆయా ప్రాంతాల్లోని రైతులు, ప్రజలు తీవ్ర దోపిడీకి, అణచివేతకు నిర్బంధానికి గురై హీనంగా బతుకులీస్తుండేవారు. ఈ తరుణంలో జమీందారీ వ్యతిరేక ప్రజా ఉద్యమం నుంచి 1930 మార్చి 2న ఉద్భవించిన ‘జమీన్ రైతు’ పత్రిక సహజంగానే ఆర్థికంగాను, అధికారం రీత్యా ఎన్నో అవాంతరాలను, అవరోధాలను ఎదుర్కొంది. వివిధ రూపాల్లో జమీందారీ దౌర్జన్యాలకు, బ్రిటీష్ ప్రభుత్వ నిర్బంధ, అణచివేత చర్యలకు గురైనా, ప్రజలను జాగృతం చేసింది. నెల్లూరు ప్రాంతీయుల ఆత్మగా, తెలుగు నేలలోని జమీందార్లకు సింహస్వప్నంగా, దక్షిణ భారత జమీందారీ రైతుల ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా, దేశవ్యాప్త జమీందారీ విధానానికి ఒక ఢక్కాగా ‘జమీన్ రైతు’ పత్రిక నిలిచింది. స్వాతంత్ర్యోద్యమ సందర్భంలో, జమీందారీ వ్యవస్థ వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర పోషించిన అంత్యవాసులు, రైతులు, గ్రామీణుల సమస్యలను, జీవితాలను, ఉద్యమాలను వెలుగులోకి తీసుకొచ్చి, జాతిని జాగృతం చేయడంలో ఈ ‘జమీన్ రైతు’ పత్రిక పాత్ర చరిత్రాత్మకమైనది. అంతటి మహోన్నత పాత్ర నిర్వహించిన ఈ వారపత్రిక– అనేక ఆటుపోట్లను, అడ్డంకులను, దౌర్జన్యాలను, నిషేధాలను దాటుకుని 2029 నాటికి తన వందేళ్ల ప్రస్థానంలోకి అడుగిడబోతుండడం అత్యంత ఆసక్తికరమైన విషయం.
కేవలం ఆశయం ప్రధానమైనంత మాత్రాన్నే పత్రిక దానంతటది నడుస్తుందనుకోవడం పొరపాటు. దీని వెనుక అంకితభావం, చిత్తశుద్ధి దృఢ సంకల్పమున్న నిర్వాహకుల పాత్ర ఎంతో ఉంది. వెంకట్రామానాయుడు తన జీవితాన్ని త్యాగం చేసి ‘జమీన్ రైతు’ పత్రికను ఆ రెండు (జమీందారీ, బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్ర్య పోరాటం) పార్శ్వాల పోరాటానికి ఒక భావజాల కేంద్రంగా నడిపారు. స్వాతంత్య్రానికి పూర్వం, అనంతరం ఆర్థిక, సాంఘిక రాజకీయ న్యాయం కోసం, ఆ ఉద్యమాలకు ఆలంబనగా ప్రజలను జాగృతం చేసిన పత్రిక... ఆ ప్రాంత ప్రజల అంతరాత్మగా మారింది. జమీందార్ల నిరంకుశత్వం, బ్రిటిష్ వలస దోపిడీని ఎదుర్కోవడమేగాక, ఎవ్వరూ శ్రద్ధ చూపని పల్లెటూళ్లను, వాటి సమస్యలను లోకానికి చాటడం కూడా ‘జమీన్ రైతు’ లక్ష్యం. ‘‘జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై పోరాడేందుకు ఎన్నో పత్రికలున్నాయి. కానీ, పల్లెటూళ్లను ప్రపంచానికి పరిచయం చేసే పత్రికలు అరుదు. పల్లెల వార్తలకు, రైతు సమస్యలకు ప్రాధాన్యం నొసగుతూ, కేవలం పల్లెటూరు వాణిగా ‘జమీన్‌రైతు’ ఉండాలని భావిస్తున్నాను’’ అని ఆ పత్రిక వ్యవస్థాపకుడు నెల్లూరు వెంకట్రామానాయుడు ప్రకటించడమే కాకుండా, ఆ లక్ష్యాన్ని సాధించారు కూడా. ‘‘కేవలం వార్తాపత్రికగా వారపత్రికకు స్థానం లేదు. వార్తల వెనుక విశేషాలు, వ్యక్తులు, విమర్శలతో కూడి ఉంటేనే వారపత్రికకు మనుగడ. ఎప్పుడూ ఒత్తిడితో పనిచేయాలి, వివాదాస్పదుడిగా బతకాలి’’ అంటూ పత్రిక మాజీ సంపాదకులు నెల్లూరు శ్రీరామమూర్తి వెలువరించిన వాక్యాలు అక్షర సత్యాలు. వారి అనంతరం కూడా ఎన్నో ఒడిదుడుకులను, ఆటుపోట్లను, దాడులను, తిరస్కారాలను ఎదుర్కొని, గత మూడున్నర దశాబ్దాలుగా ఈ వార పత్రిక నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ సంపాదకత్వంలో విజయవంతంగా కొనసాగుతోంది. 2029లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆ పత్రికా ప్రేమికులు, పాఠకులు, రచయితలు, సాహిత్యకారులు తమ తమ స్పందనలు తెలియజేయగలరు.
వెన్నెలకంటి రామారావు
(మార్చి 2: ‘జమీన్ రైతు’ పత్రిక వార్షికోత్సవం)
ఇవి కూడా చదవండి:
వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!
టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్