Share News

యుద్ధం తర్వాత...

ABN , Publish Date - Sep 28 , 2026 | 02:08 AM

బూడిద కుప్పలు పోగుపడ్డాక.. క్షిపణుల గొంతు మూగబోతుంది బాంబుల చప్పుడు ఆగిపోతుంది పేలిన తూటాల కింద వేలాది కలలు కాలి కూలుతాయి...

యుద్ధం తర్వాత...

బూడిద కుప్పలు పోగుపడ్డాక..

క్షిపణుల గొంతు మూగబోతుంది

బాంబుల చప్పుడు ఆగిపోతుంది

పేలిన తూటాల కింద వేలాది కలలు

కాలి కూలుతాయి

చిగురాకులూ పండుటాకులనే కాదు

సర్వం కోల్పోయిన చెట్టు

ఒంటరి మరుభూమిలో మిగిలిన

కడపటి కర్మయోగి

తిరిగిరాని దారుల వైపు

ఆశలు ఆరని చూపులు రాల్చి

అగుపించని బిడ్డ కోసం

కమిలిన కాలాన్ని

కళ్ళల్లో ఒత్తుకుంటుంది ఓ తల్లి

బడిగంట మోగాల్సిన చెవుల్లో..

ఫిరంగి మోత

జీవితపు ఆఖరి గీత గీసిపోతుంది

పొలంగట్ల మీద పూయాల్సిన పూలకు

గర్భవిచ్ఛిత్తి

‘‘అమ్మా...’’ అన్న ఆర్తనాదాలను

నిశ్శబ్ద నింగి నిర్దయగా మింగి

కుతిదీరా ఆకలి బాపుకుంటుంది

విత్తనాలను దాచుకునే భూతల్లి

ఎముకలను ఎత్తిపోసుకుంటుంది

నదులన్నీ నిశ్శబ్దాన్ని పారుతుంటే

ఒంటరిగాలి మోర ఎత్తి ఏడుస్తుంది

యుద్ధం తర్వాత శాంతి

ఆమ్ల దాడి జరిగిన అమ్మ దేహం

జింకను వేటాడి తిన్నాక

ప్రశాంతమైన సింహపు బేవరింపు

పగిలిన కిటికీ అద్దాల్లో

ఆకాశపు వికటాట్టహాసం

అరుపులన్నీ చల్లారాక

మిగిలే అనంత శూన్యం

మాడిపోయిన గుండెల మీద

ఇక ఎప్పటికీ అంకురించని ఆశ

పొగచూరిన గోడలపై

ఇంకిపోయిన మృత్యు చారిక

యజమాని రాక కోసం తెగిపడ్డ చేతితో

చిన్నారి బొమ్మచేసే అంతిమ ఆర్తనాదం

అంత్యక్రియలు ముగిశాకా ఒంటరైన స్మశానం

ఇది చరిత్రకు కాలం రాసిచ్చే కన్నీటి వాంగ్మూలం

అవును..

క్షిపణి కాదు అణుబాంబు కాదు

యుద్ధమంటే నిజంగా..

మనిషిలో గడ్డకట్టిన ద్వేషమే...

తుల శ్రీనివాస్

99485 25853

ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్ ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: మంత్రి పొంగులేటి

Updated Date - Sep 28 , 2026 | 02:09 AM