వైసీపీ... నిండా మునిగిన ఓడ!
ABN , Publish Date - Apr 10 , 2026 | 02:44 AM
ఒకప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో తిరుగులేని నౌకలా కనిపించిన వైసీపీ, నేడు మునిగిపోయిన టైటానిక్ నౌకను తలపిస్తోంది. సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ నౌక కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే. వైసీపీ కూడా...
ఒకప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో తిరుగులేని నౌకలా కనిపించిన వైసీపీ, నేడు మునిగిపోయిన టైటానిక్ నౌకను తలపిస్తోంది. సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ నౌక కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే. వైసీపీ కూడా రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోనున్నదా? టైటానిక్ ఓడ మంచుకొండను ఢీకొన్నట్టే, వైసీపీ కూడా అతివిశ్వాసం, అంతర్గత లోపాలు, అహంకారం, అరాచకంతో ప్రజా వ్యతిరేకత అనే మంచుకొండను డీ కొట్టింది. ఓడ మునిగిపోయిన తర్వాత సముద్రం నిశ్శబ్దంగా మారినట్లు, ప్రస్తుత రాజకీయ ముఖచిత్రంలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. టైటానిక్ నౌక విషాదం సాంకేతిక లోపమైతే, వైసీపీ పతనం ప్రతీకారం, రాజకీయ వ్యూహాల వైఫల్యంతో ఓడ మునిగిపోయింది. టైటానిక్ షిప్‌లా వైసీపీ భవిష్యత్తు కూడా ఏ దిశగా వెళ్తుందో చరిత్రే చెబుతుంది. వెలుగుల కాంతిలో బయలుదేరిన టైటానిక్ భారీ నౌక చివరకు మంచుకొండను ఢీకొని అగాధంలో మునిగిపోయినట్లే, వైసీపీ రాజకీయ ప్రయాణం కూడా అదే దిశగా సాగుతోంది. ప్రజల విశ్వాసం అనే సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టిన వైసీపీ అహంకార పాలనతో ప్రజల విశ్వాసం కోల్పోయింది. రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడం, పరిశ్రమలు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం యువత నిరాశ చెందడం, జాబ్‌లు ఇవ్వలేకపోవడం, భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయేలా చేసింది. అమరావతి రాజధాని విషయంలో స్పష్టత లేకుండా మూడు రాజధానుల గందరగోళం సృష్టించడం వల్ల రైతులు, పెట్టుబడిదారులు, సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ వైసీపీ అనే టైటానిక్ నౌకను అగాధంలోకి నెట్టాయి.
వైసీపీ 2019 తర్వాత అప్రతిహత శక్తిగా తనను తాను భావించింది. కానీ 2024లో ఓటరు తీర్పు వైసీపీని కిందకు ఈడ్చింది. ఇప్పుడు వైసీపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పోకడలను పరిశీలిస్తే 2024లో వచ్చిన ఓట్లను అయినా వైసీపీ నిలబెట్టుకోగలదా అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నా సోషల్ మీడియా గ్రాఫిక్స్ చూసి వైసీపీ మురిసిపోయింది. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ పట్టుదల, బీజేపీ మద్దతు కలిసి ఒక బలమైన సునామీ ఏర్పడి వైసీపీ నౌకను అగాధంలోకి నెట్టాయి. టైటానిక్ నౌక మునిగిపోతున్నప్పుడు ఎలాగైతే ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయాణికులు హాహాకారాలు చేశారో, ఇప్పుడు వైసీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ముఖ్య నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం వేరే పార్టీల వైపు చూపు చూస్తున్నారు. ప్రజల ఆగ్రహం అనే సునామీ ముందు ఏ కోటలు నిలబడలేవని 2024 ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. టైటానిక్ నౌక సముద్ర గర్భంలో శిథిలమైపోయింది. దానిని మళ్ళీ బయటకు తీయడం ఎలా అసాధ్యమో వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. విశ్వసనీయత కోల్పోయిన చోట, నాయకత్వం పట్ల నమ్మకం సడలిన చోట తిరిగి కోలుకోవడం కష్టం. టైటానిక్ షిప్ వలే, వైసీపీ కూడా నేడు మన కళ్ల ముందే మునిగిపోయింది. ఆ పార్టీ అధినేత జగన్‌రెడ్డి కనుచూపు మేరలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తెలుసుకోవాలి.
కోనేరు సురేష్
టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయ కార్యదర్శి
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News