Share News

‘రంగ’భూమీశుడు

ABN , Publish Date - Aug 21 , 2026 | 02:38 AM

ఒకసారి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర కూర్చొని ఒక వ్యక్తి భిక్షాటన చేస్తున్నాడు. అక్కడ ఇదే వృత్తిలో ఉన్న మరొక వ్యక్తి వచ్చి.. ‘ఇది నా అడ్డా, ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ అతనిపై దాడి చేశాడు. ఈ సీన్‌ను దూరం నుంచి..

‘రంగ’భూమీశుడు

ఒకసారి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర కూర్చొని ఒక వ్యక్తి భిక్షాటన చేస్తున్నాడు. అక్కడ ఇదే వృత్తిలో ఉన్న మరొక వ్యక్తి వచ్చి.. ‘ఇది నా అడ్డా, ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ అతనిపై దాడి చేశాడు. ఈ సీన్‌ను దూరం నుంచి షూట్ చేస్తున్న సినిమా బృందం పరిగెత్తుకుంటూ వచ్చి, దాడికి పాల్పడిన వ్యక్తికి సర్ది చెప్పింది. అతను నిజంగా యాచకుడు కాదని ‘చందమామ కథలు’ సినిమాలో యాచక పాత్ర పోషిస్తున్నాడని అసలు విషయం చెప్పింది. వేషధారణలో, అభినయంలో, వాచకంలో పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, పాత్రకు జీవం పోసిన ఆ విశిష్ట నటుడు వై.ఎస్.కృష్ణేశ్వరరావు. నాటక రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, సినిమా సంభాషణల రచయితగా నాలుగు దశాబ్దాలపాటు, అపురూప కళాసేవకు అంకితమైన కృష్ణేశ్వరరావు శ్వాసకోశ వ్యాధితో ఆగస్టు 11న గుంటూరులో మరణించారు.

సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కృష్ణేశ్వరరావు, ప్రజా పోరాటాల ప్రభావంతో, సమకాలీన స్పృహతో, సామాజిక చైతన్యంతో నాటకాలను, నాటికలను రచించారు. విప్లవ, స్త్రీవాద, దళితోద్యమాల మౌలిక ఆశయాలను నాటికల ద్వారా చాటి చెప్పారు. నాటి గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బోడపాడు గ్రామంలో హనుమంతరావు–వెంకటరమణమ్మ దంపతులకు 1955 ఆగస్టు 4న యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు జన్మించారు. మోపర్రులో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రత్తయ్య ప్రోత్సాహంతో ‘వాపస్’ నాటకంలో తొలిసారిగా శఠగోపం పాత్ర ధరించి అందరినీ మెప్పించారు. పొన్నూరు పి.బి.ఎన్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సందర్భంలో అధ్యాపకుడు ఆకురాతి మురళీకృష్ణ శిష్యరికంలో నాటక రచన, ప్రదర్శన, నటనలో మెళకువలు నేర్చుకున్నారు. ఇంటర్‌లోనే కళాశాలను విడనాడి కళామతల్లి ఒడిలో సేద తీరారు. పొన్నూరులో హోమియో వైద్యుడిగా సేవలందిస్తూనే నాటక కళా సాధనలో నిమగ్నమయ్యారు. యువశక్తి కళామండలి ద్వారా అనేక నాటకాలు ప్రదర్శించారు.

కె.ఎస్.టి సాయి, గుంటూరు శాస్త్రి, తల్లావజ్ఝల సుందరం, తనికెళ్ల భరణి వంటి ప్రముఖుల ప్రోత్సాహంతో కృష్ణేశ్వరరావు నటన నుంచి రచన వైపు మారి, తొలి ప్రయత్నంగా ‘రోజూ చస్తున్న మనిషి’ నాటకం రాశారు. తానే ప్రధాన పాత్ర ధరించి, స్వీయ దర్శకత్వంలో విజయవంతంగా ప్రదర్శించారు. ‘కాళ్లు కడిగిన చేతులు’, ‘గొంగళి పురుగు’, ‘పక్కింట్లో పుట్టండి’, ‘సంపద’, ‘గుర్తు తెలియని శవం’, ‘నష్ట పరిహారం’ వంటి నాటికలతో కృష్ణేశ్వరరావు వర్తమాన తెలుగునాటక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘రసఝరి’ అనే నాటక సంస్థను స్థాపించి తన బృందంతో రాష్ట్ర, జాతీయ స్థాయి పరిషత్ నాటక పోటీల్లో చాలా కాలంపాటు విజయభేరి మోగించారు. ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ నటుడు లాంటి బహుమతులెన్నో కైవసం చేసుకొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలతో పాటు ఢిల్లీ, ముంబాయి లాంటి ఇతర ప్రాంతాల్లో కూడా కృష్ణేశ్వరరావు తన బృందంతో 1500కు పైగా నాటిక ప్రదర్శనలిచ్చి ప్రేక్షకులకు కమనీయ కళా, సాంస్కృతిక ఉత్తేజాన్ని అందించారు. మద్రాస్‌లో ‘గొంగళి పురుగు’ నాటకం చూసి మురిసిపోయిన సినీ నటులు కొంగర జగ్గయ్య కృష్ణేశ్వరరావును అభినందించారు. ‘పక్కింట్లో పుట్టండి’ నాటిక కృష్ణేశ్వరరావు దార్శనిక దృష్టికి నిదర్శనం. ఇందులో మధ్యతరగతి మనస్తత్వానికి ప్రతీకగా నిలిచే కాంతారావు, విప్లవాది అయిన అతని కొడుకు సూర్యం మధ్య సంభాషణలు ఆలోచనాత్మకంగా ఉంటాయి. ‘‘ఈ సమాజం బాగుపడాలంటే భగత్‌సింగ్‌, అల్లూరి సీతారామరాజు, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం వీళ్లందరూ పుట్టాలి, ఉద్యమాలు చేయాలి, ప్రాణాలివ్వాలి, అమరులవ్వాలి’’ అని అందరికీ బోధించే కాంతారావు తన దాకా వచ్చేసరికి మాట మార్చుతాడు. ‘‘పక్కవాడి త్యాగాల మీద, ఎదుటివాడి కష్టం మీద బాగుపడాలనుకోవడం తప్పు. కష్టం మనదవ్వాలి, త్యాగం మనం చేయాలి’’ అంటూ ఈ నాటకం ద్వారా కృష్ణేశ్వరరావు ఉదాత్తమైన సందేశం అందించారు.


నాటక రంగంలో ఎంతో కీర్తి గడించిన కృష్ణేశ్వరరావు ‘ఊరేగింపు’ సినిమా కోసం పి.ఎల్ నారాయణ వద్ద సహాయకుడిగా చేరారు. ఆ సినిమా నిర్మాణ సమయంలో కృష్ణేశ్వరరావు రచనా ప్రతిభను గమనించిన ప్రసిద్ధ నటుడు, దర్శకుడు ఎం.ప్రభాకరరెడ్డి ‘ప్రచండ భారతం’ చిత్రానికి మాటల రచయితగా అవకాశం కల్పించారు. ‘భద్రాచలం’, ‘పరశురాముడు’, ‘పిలిస్తే పలుకుతా’, ‘మౌనం’, ‘సూర్యపుత్రులు’ మొదలైన సినిమాలకు కృష్ణేశ్వరరావు పదునైన సంభాషణలను అందించారు. తన మిత్రులైన సి.ఉమామహేశ్వరరావు, ఎన్‌.శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమాల (అంకురం, శ్రీరాములయ్య)కు రచనా సహకారం అందించారు. కృష్ణేశ్వరరావును ఆర్‌.నారాయణమూర్తి ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన ‘ఎర్ర సముద్రం’, ‘కూతురు కోసం’, ‘వేగుచుక్కలు’, ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ లాంటి ఎన్నో చిత్రాల్లో కృష్ణేశ్వరరావు నటించడంతో పాటు, స్క్రీన్ ప్లే, రచనా సహకారమందించారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘నాంది’, ‘విరూపాక్ష’ తదితర చిత్రాల్లో ఈయన చేసిన పాత్రలు విలక్షణమైనవి. ‍స్నేహితుడైన నటుడు జీవా ద్వారా దర్శకుడు వంశీకి దగ్గరయ్యారు. ఆయన దర్శకత్వంలోని ‘దొంగ రాముడు’, ‘గోపి గోపిక గోదావరి’, ‘సరదాగా కాసేపు’ మొదలైన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించి, వంశీ మార్క్‌ హాస్యాన్ని సమర్థవంతంగా పండించారు. నాటక రంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం ‘ధర్మనిధి’ పురస్కారాన్ని అందించింది. ‘చందమామ కథలు’ చిత్రంలో యాచకుడి పాత్రకు గానూ ఉత్తమ సహాయనటుడిగా నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నారు. ‘కూతురు కోసం’ చిత్రంలో ఉత్తమ ప్రతినాయకుడిగా మెప్పించి ‘భరతముని’ పురస్కారాన్ని కృష్ణేశ్వరరావు పొందారు.

లౌక్యం బొత్తిగా లేకపోవడం వల్ల కృష్ణేశ్వరరావుకు రావాల్సినన్ని అవకాశాలు రాలేదు. అయినప్పటికీ ‘టాలీవుడ్’ ఇమేజ్‌ కోసం ఆయన తహతహలాడలేదు. నాటక రంగ వికాసం కోసమే ప్రతీ క్షణం పరితపించారు. చివరి దశలో కృత్రిమ శ్వాసతో మంచం మీద ఉండి కూడా, రాయాల్సిన కొత్త నాటకాల గురించి, ఇతివృత్తం గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఆపరేషన్‌ కగార్ నేపథ్యంలో మంచి నాటిక రాసి, గుంటూరులో ప్రదర్శించాలన్న కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. కృష్ణేశ్వరరావు సమగ్ర నాటికల సంకలనం ప్రచురించాల్సిన అవసరముంది. ఇదే ఆ ప్రజా కళాకారుడికి నిజమైన నివాళి.

ప్రొ. కోయి కోటేశ్వరరావు

(ఆగస్టు 22న గుంటూరులోని శ్రీ త్యాగరాజ సాంస్కృతిక కేంద్రంలో

వై.ఎస్‌. కృష్ణేశ్వరరావు సంస్మరణ సభ)

ఈ వార్తలను కూడా చదవండి:

పార్క్‌లో భారీ కొండచిలువ హల్‌చల్.. వీడియో వైరల్

ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా.. గంటకు 45.6 కిలోమీటర్ల వేగంతో చైనా 'సూపర్‌మ్యాన్' రోబో..

Updated Date - Aug 21 , 2026 | 02:39 AM