సమస్యలను యువతే పరిష్కరిస్తే.. పాలకులెందుకు?
ABN , Publish Date - Aug 18 , 2026 | 03:34 AM
యువత ప్రశ్నించడమే కాదు, సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా వెతకాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఐఐటీ ఢిల్లీ యాభై ఏడవ స్నాతకోత్సవంలో చేసిన వ్యాఖ్యను పాలకుల దృక్పథంతో చూస్తే అంతా బాగున్నట్టుగానే...
యువత ప్రశ్నించడమే కాదు, సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా వెతకాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఐఐటీ ఢిల్లీ యాభై ఏడవ స్నాతకోత్సవంలో చేసిన వ్యాఖ్యను పాలకుల దృక్పథంతో చూస్తే అంతా బాగున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఆ వ్యాఖ్యను మరోవైపు నుంచి పరిశీలిస్తే ఒక కీలకమైన ప్రశ్న ముందుకొస్తుంది. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలదా? ప్రభుత్వానిదా?
2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు యువతకు ఎలాంటి ఆశలు కల్పించింది? ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, తయారీ రంగం విస్తరణ, పెట్టుబడుల పెంపు, అవినీతి నిర్మూలన, నల్లధనాన్ని వెనక్కి రప్పించడం వంటి అంశాలపై ఎన్నో హామీలు ఇవ్వలేదా? ఇప్పటివరకు యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? ఎలాంటి ఉద్యోగాలు వచ్చాయి? ఇంకా ఎంత చేయాల్సి ఉంది? అన్న విషయాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఈ పుష్కర కాలంలో ప్రభుత్వం ఆ పని ఎప్పుడైనా చేసిందా? ఇవి ఏవీ జరగనందుకే కదా యువత ఆందోళన బాట పట్టింది?
నీట్ వివాదం ఈ పరిస్థితికి ఒక ఉదాహరణ మాత్రమే. విద్యార్థులు నెలల తరబడి ఆందోళనలు చేస్తే, వారి సమస్యలను వినడం, విచారణ జరిపించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం లాంటి పనులను ప్రభుత్వం చేయలేదు. పైగా నిరసనకారులకు ‘పరిష్కారం మీరే చూపండి’ అని చెప్పడం ద్వారా ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? ఈ చర్య నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వం పాలనా బాధ్యతలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా లేదూ? అసలు పరిష్కారం చూపాలంటే ముందు వాళ్లకు అవకాశం ఇవ్వాలి కదా. నిజానికి యువత కోరుతున్నది ఈ దేశ అభివృద్ధిలో తమను కూడా భాగస్వాముల్ని చేయమని, తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించమని అంటున్నారు. తద్వారా వికసిత భారత్‌లో తమను కూడా భాగస్వాములను చేయమంటున్నారు. ఇవి ఏవీ జరగకుండా, అన్నింటికీ దూరంగా ఉంచడం వల్ల అభివృద్ధి ఎలా జరుగుతుంది?
యువత ప్రశ్నలు నీట్‌కే పరిమితం కావాల్సిన అవసరం లేదు. పెరుగుతున్న విదేశీ అప్పు, పెట్రోల్–డీజిల్–గ్యాస్ ధరలు, నిరుద్యోగం, అవినీతి ఆరోపణలు, పరిపాలనలో జవాబుదారీతనం, రాజకీయ ఫిరాయింపులు, దర్యాప్తు సంస్థలు, ఎన్నికల వ్యవస్థ వంటి కీలక సంస్థల స్వతంత్రతపై వ్యక్తమవుతున్న సందేహాలు.. ఇవన్నీ ప్రశ్నించాల్సిన అంశాలే. అయితే ప్రభుత్వం తన అధికారాన్ని ప్రశ్నను అణచడానికి కాకుండా, సమస్యను పరిష్కరించడానికి వినియోగిస్తే అసలు సమస్యే ఉండదు. కానీ ప్రభుత్వ ధోరణి అలా కనిపించడం లేదు. యువత పరిష్కారాలు చూపాలి, అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అనే అర్థం వచ్చేలా ఉంది. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రజలు సమస్యలను చూపించినప్పుడు నాయకులు పరిష్కారాలు చూపించడానికి సిద్ధంగా ఉండాలి. నిజానికి ప్రశ్నించే యువత ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదు. అతి పెద్ద బలం.
గుండెబోయిన శ్రీనివాస్
ఇవి కూడా చదవండి
పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా