Share News

‘‘రోజూ కూర్చుని  ఇన్ని పేజీలని రాస్తూ పోలేను’’

ABN , Publish Date - Nov 23 , 2026 | 01:43 AM

@ ఒక పిల్లాడు తన భోజనాన్ని ఆకలితో ఉన్న ఇంకో పిల్లాడితో ఎందుకు పంచుకోకూడదు అనుకుంటాడు. ఇది నా పదిహేనేళ్ళ వయసులో రా‍సిన కథల్లో నాకు బాగా...

‘‘రోజూ కూర్చుని  ఇన్ని పేజీలని రాస్తూ పోలేను’’

  • ఒక పిల్లాడు తన భోజనాన్ని ఆకలితో ఉన్న ఇంకో పిల్లాడితో ఎందుకు పంచుకోకూడదు అనుకుంటాడు. ఇది నా పదిహేనేళ్ళ వయసులో రా‍సిన కథల్లో నాకు బాగా గుర్తున్న కథ. అప్పటి నుంచీ రాస్తూనే ఉన్నాను. రాయటంలో నాకు ప్రేరణ మా అమ్మే. చిన్నప్పుడు అమ్మ తన జీవితానుభవాలను కథల్లా చెప్తూండేది. అవన్నీ అప్పుడెప్పుడో జరిగిన విషయాల్లా కాక, కళ్ళముందే జరుగుతున్నట్టు వివరంగా చెప్పేది. అమ్మ నుంచే నాకు కథలు చెప్పటం వచ్చింది అనుకుంటాను.

  • నా ప్రతి పుస్తకం అంతకుముందు పుస్తకం నుంచి వేరుగా ఉండాలి అనుకుంటాను. తెలంగాణ మాండలికంలో ‘నల్లగొండ కథలు’ రాసాక అందరూ అదే శైలిలో రాయమంటుంటే నేను ఆ ట్రాప్‌లో పడతానేమో అనిపించింది. దాన్నుంచి భిన్నంగా ఏం రాద్దాం అనుకున్నప్పుడు తట్టిన కథ ‘ఒక ఎండాకాలపు మధ్యాహ్నం’. ఇది నా మొదటి నవల. ఈ ఏడాదే విడుదలైంది.

  • ఈ మొదటి నవల రాయటానికి ఐదేళ్ళు పట్టింది. నా జీవితానుభవంలోంచే వచ్చిన ఆలోచనలు ఉండటం వల్ల దాన్ని పర్సనల్ స్టోరీ అని చెప్పొచ్చు, అలాగని ఆటోబయోగ్రఫికల్ నవల కాదు. ఆ నవల రాసినన్ని రోజులూ దాని గురించి ఆలోచించడం బావుండేది. రాయలేకపోతున్నప్పుడు లోతైన నిరాశలోకి వెళ్ళిపోయేవాడ్ని. ఆ బాధ కూడా బావుండేది. ఇప్పుడు రాసి బైటపెట్టేశాక ఇక దాని గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. లోపలున్నదంతా రాసి బైటకు పంపడం ఒక థెరపీ లాంటిది. ఆ లోపలి విషయాల నుంచి ఇక దూరం జరగవచ్చు అన్నట్టు ఉంటుంది.

  • కథ రాయటం నాకు సులువుగా వస్తుందనుకుంటాను. నవల రాయటం మాత్రం చాలా కష్టంగా అనిపించింది. నేను ప్రతి రోజూ కూర్చుని ఇన్ని పేజీలని లెక్కగా రాస్తూ పోలేను. రాయబోయే కథ పూర్తిగా అర్థమైంది అనుకున్నాకనే, ఇక దానిలోంచి బైటకు రాకుండా నిమగ్నమై రాయగలను అనుకున్నాకనే రాయటం మొదలుపెడతాను. ‘ఒక ఎండాకాలపు మధ్యాహ్నం’ నవలలో ఏంగర్‌ ఇష్యూస్‌, గిల్ట్‌, రిమోర్స్‌, ఎగ్జిస్టెన్షియలిజమ్ వంటి థీమ్స్‌ ఉన్నాయి. వాటన్నిటినీ నేను బాగా అర్థం చేసుకుని, ఒక అవగాహనకు వస్తే కానీ రాయలేననిపించింది. కానీ ఎంత కష్టంగా అనిపించినా, కథలతో పోలిస్తే, నవల రాయటం లోనే ఎక్కువ సంతోషం ఉంది. కథ ఒక విడతలో రాసేస్తే అయిపోతుంది కదా. దానికి భిన్నంగా ఒక నవలని పట్టుకుని ఐదేళ్ళు వేలాడటం నచ్చింది.


  • ‘నల్లగొండ కథలు’ కాకుండా నా మిగతా పుస్తకాలన్నీ ఫిక్షనే అయినా, వాటన్నిటిలోనూ నేను ఉన్నాను. నా జీవితమూ నా పుస్తకమూ రెండూ కలిసే ఉంటాయి. రచనను దూరంగా చూడలేను. నన్ను నేరుగా తెచ్చి నా రచనల్లో పెట్టుకోవడం పట్ల నాకు ఏ ఇబ్బందీ లేదు. ఎవరైనా వచ్చి ఈ కథ మీదేనా అని అడిగితే నాదే అని చెప్పుకోవటంలో ఇబ్బందేమీ పడను. నా రచనల్లో పూర్తిగా కల్పిత సందర్భాల్ని కూడా ఎవరైనా నాకు ఆపాదించుకున్నా ఇబ్బంది లేదు.

  • ఏదైనా కథ చెప్తున్నప్పుడు నాలో ఇది చెప్పటానికి కావాల్సినంత నిజాయితీ ఉన్నదా లేదా అని ఆలోచిస్తాను. రాస్తున్నప్పుడు నా నిజాయితీని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాను. ఈ ప్రశ్న తర్వాత మొదలయ్యే ఆలోచన నన్ను నేను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. అలా రచయితగా రాయటం మనిషిగా ఎదగటంలో సహాయపడుతుందనుకుంటాను.

  • ప్రపంచం ఇంత క్రూరమా అనిపిస్తుంది అప్పుడప్పుడూ. నిజాయితీగా రాయటం ఇష్టం అని చెప్పాను కదా. కానీ చుట్టూ ప్రపంచాన్ని చూస్తున్నకొద్దీ ఈ ప్రపంచం ఇంక రిపేర్‌ చేయటం వీలు కానంత చెడిపోయిందనిపిస్తుంది. నిజం నుంచి పక్కకు తిప్పుకోలేని ఆ చూపే రచయితగా ఉండటంలో కష్టమైన విషయం అనుకుంటాను.

  • కథకు అవసరమనిపించినప్పుడు ఎంత దూరమైనా వెళ్తాను. ఆ విషయంలో అస్సలు రాజీ పడాలనుకోను. సమాజం పోకడకు కట్టుబడి రాయాలనుకోను. ఎవరికైనా అభ్యంతరకరం అనిపించినా ఉన్నది ఉన్నట్టే రాస్తాను. చదివేవాళ్లు ఎలా తీసుకుంటారు అన్నది ఆలోచించను.

  • మనం నమ్మే సిద్ధాంతాలు మన కథల్లో ఏదో ఒక కోణంలో వ్యక్తం అవుతాయి. అలాగాక ఏదో పనిగట్టుకుని చెప్పాలన్నట్టు, జెండా పట్టుకున్నట్టు కథలు రాస్తారు కదా– అలాంటి కథలు రాయటం ఇష్టం ఉండదు. నేను చెప్పదల్చుకున్న విషయం కథలో ఇమిడిపోయి ఉంటుంది కానీ, కథ నుంచి బైటకు వచ్చి నిలబడి నేను ఏదీ చెప్పాలీ అనుకోను.

  • కథ రాసి బైటకు పంపేదాకా అది నాకు చాలా పర్సనల్‌. అది నాకు మాత్రమే సంబంధించినది అనిపిస్తుంది. కథ రాస్తున్నప్పుడు ఎవరికైనా పంపి అభిప్రాయాలూ అడగను.

  • నేను రాయటం మొదలుపెట్టినప్పుడు పబ్లిషింగ్‌ రంగం అంత ప్రోత్సాహకరంగా ఉండేది కాదు. అ‍సలు ఆ వ్యవస్థ ఎలా పని చేస్తుందో దగ్గరగా వెళ్ళి పరిశీలించాను. వ్యవస్థలోనే లోపం ఉందనిపించింది. దాన్ని నేను సవాలుగా తీసుకున్నాను. అందుకే పబ్లిషర్‌గా కూడా మారిపోయి నా పుస్తకాలు నేనే ప్రచురించుకోవడం మొదలుపెట్టాను.

  • రోజూవారీ జీవితంలో డబ్బున్న, పై స్థాయిలో ఉన్న వాళ్ళ హిపోక్రసీని చూస్తూ, సిగ్గుపడుతూ ఉంటాను. మోరల్ ఆంబిగ్విటీని నా కథల్లోకి తీసుకురాగలిగాననిపిస్తుంది గానీ, అబ్జల్యూట్ హిపొక్రైట్స్ ఉంటారు, వాళ్ళ గురించి రాయలేననిపిస్తుంది.


  • నేను కచ్చితమైన పొలిటికల్, సోషల్ ఐడియాలజీలతోనే బతుకుతాను. సందర్భం వచ్చినప్పుడు వాటిని ఏ సంకోచమూ లేకుండా నా కథల్లోకి తీసుకురాగలను కూడా. కానీ ఎప్పుడైనా సోషల్ మీడియాలో సమాజంలోని అవినీతిని ప్రశ్నించినప్పుడో, ఏదైనా సామాజిక విషయం పట్ల నేనిలా ఆలోచిస్తున్నానని చెప్పినప్పుడో – హిపొక్రైట్స్‌ అని చెప్పాను కదా, వాళ్ళు పచ్చి బూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏదైనా రాయడానికి భయపడతాను.

  • ప్రస్తుతం రెండు నవలలకు ఆలోచన ఉంది. ఈమధ్య మా నాన్న చనిపోయిన తర్వాత నేను మరణం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. అలాంటి ఆలోచనల్లోంచి పుట్టిన నవల ఒకటి. రెండోది ప్రేమకథ. అలాగే ‘ఒక ఎండాకాలపు మధ్యాహ్నం’ నవల రాస్తున్న ఐదేళ్ళలో కథలకు ఆలోచనలు వచ్చినా కూడా నవలను మధ్యలో ఆపలేక వాయిదా వేసాను. అవి కూడా రాయాలి.

  • ఒక యాభై ఏళ్ళ తర్వాత ఫలానా మల్లికార్జున్‌ అనే రచయిత ఉన్నాడు అని నన్ను ఒక పేరుగా గుర్తుంచుకోవటం కంటే, పాఠకులు నన్ను మర్చిపోయి నా పుస్తకాలు చదువుకుంటుంటే ఎక్కువ సంతోషిస్తాను.

వి. మల్లికార్జున్‌

70752 75454

ఈ వార్తలూ చదవండి

కేంద్ర మంత్రి జైశంకర్‌తో నేపాల్ ప్రధాని బలేంద్ర షా భేటీ..

ఎమ్మెల్యే అసభ్య మెసేజీలు పెట్టినట్టు ఆరోపణ.. మద్రాస్ హైకోర్టు సీరియస్

Updated Date - Nov 23 , 2026 | 01:43 AM