Share News

కలిసికట్టుగా ప్రజారోగ్య పరిరక్షణ!

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:28 AM

ఆరోగ్యవంతమైన ప్రజలే ఏ దేశానికైనా వెన్నెముక. నేడు ఆ వెన్నెముక మన దేశంలో వయస్సుతో నిమిత్తం లేకుండా అనారోగ్యం పాలవుతోంది. వైద్యం, శస్త్రచికిత్సల, ఆర్థిక భారం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో...

కలిసికట్టుగా ప్రజారోగ్య పరిరక్షణ!

ఆరోగ్యవంతమైన ప్రజలే ఏ దేశానికైనా వెన్నెముక. నేడు ఆ వెన్నెముక మన దేశంలో వయస్సుతో నిమిత్తం లేకుండా అనారోగ్యం పాలవుతోంది. వైద్యం, శస్త్రచికిత్సల, ఆర్థిక భారం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం ‘‘శాస్త్ర, సాంకేతికతల ఆధారంగా ప్రపంచవ్యాప్త సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం సంఘటితమవుదాం!’’ అనే నినాదాన్ని ఇచ్చింది. కేవలం మనుషుల పైనే దృష్టి పెడితే ఆరోగ్య పరిరక్షణ సాధ్యం కాదని, అడవులు, చెట్లు, జంతుజాలాల పరిరక్షణతో పర్యావరణ పరిరక్షణ ద్వారానే మనిషి ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని ఈ నినాదం లక్ష్యాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తోంది.

మన దేశ ప్రజారోగ్య పరిస్థితుల విషయానికొస్తే... పరాన్నజీవ (పారాసైటిక్), బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ అంటువ్యాధులు తగ్గినట్లు కనిపిస్తున్నా వ్యాప్తి మాత్రం జరుగుతూనే ఉంది. కొన్ని రాష్ట్రాలలో కొన్ని సీజన్లలో ఆయా వ్యాధులు విజృంభిస్తూనే ఉన్నాయి. కరోనాలా అవి విరుచుకుపడనందున మనం వాటిపై దృష్టి సారించడం లేదు. పరాన్నజీవ వ్యాధుల్లో ఇంకా మలేరియా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. బ్యాక్టీరియల్ వ్యాధుల్లో టైఫాయిడ్, న్యుమోనియా, ఆంత్రాక్స్, మెలిడియోసిస్, స్క్రబ్‌టైఫస్ వంటి వ్యాధుల్ని చూస్తూనే ఉన్నాం. క్షయ వ్యాధి వ్యాప్తి వేగం పెరుగుతున్నదని ప్రభుత్వ గణాంక వివరాలే తెలుపుతున్నాయి. ఫంగల్ వ్యాధుల వల్ల కూడా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనా, డెంగ్యూ, చికెన్ ఫాక్స్, చికెన్‌గునియా, ఎన్‌సెఫిలైటిస్, నిఫా, బర్డ్ ఫ్లూ, మీజిల్స్ వంటి వ్యాధులతో పాటు ప్రమాదకర హెచ్ఐవీ, హెపటైటిస్–బి, హెపటైటిస్–సి వంటి వైరల్ వ్యాధులు ఆరోగ్య సమస్యల్ని సృష్టిస్తూనే ఉన్నాయి.

అంటు వ్యాధులలో వైరల్ వ్యాధులకు తప్ప మిగతా అన్ని రకాల వ్యాధులకు పూర్తి చికిత్స ఉన్నా, మరణాలు సంభవించడం మన ఆరోగ్య వ్యవస్థ విఫలత్వానికి నిదర్శనం. దేశవ్యాప్తంగా మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇవి జీవితకాలం క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన దీర్ఘకాలిక వ్యాధులు కావడంతో ప్రజలపై ఎంతో ఆర్థిక భారం పడుతోంది. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, అగ్ని, రోడ్డు ప్రమాదాలు కూడా ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగిస్తున్నాయి. పుట్టుకతో జన్యుపరంగా వచ్చే వ్యాధులు, అవయవ నిర్మాణ లోపాలతో పుట్టే శిశువుల సంఖ్య నేడు పెరిగిపోతోంది.

ప్రజారోగ్య చైతన్యం, పరిసరాల పరిశుభ్రత, వైద్య సదుపాయాల కొరత వంటి ప్రధాన అంశాలలో ప్రజలు, ప్రభుత్వం సంయుక్తంగా కృషి చేస్తేనే మంచి ఫలితాలు సాధించగలం. నేడు ప్రజలందరికీ పౌష్టిక ఆహారం, వ్యాధుల వ్యాప్తికి గల కారణాలు, నియంత్రణ, నిరోధక చర్యలు, ముందు జాగ్రత్తలు తదితర విషయాల్లో శాస్త్రీయ అవగాహన తప్పనిసరి. పాఠశాల స్థాయి నుంచే ఆరోగ్య పరిరక్షణ చర్యలను పాఠ్యాంశాలుగా పెట్టి అధ్యయనం చేయించడం ద్వారా శాస్త్రీయ అవగాహన చిన్న వయస్సు నుంచే తీసుకురావాలి.


దేశంలో పెరిగిపోతున్న అంటువ్యాధులకు మూల కారణం పరిసరాల పరిశుభ్రత. ఇందుకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం వేసి మన పరిసరాలను మనమే అపరిశుభ్రం చేసుకుంటున్నాం. కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. సురక్షిత మంచినీరు, పరిసరాల పరిశుభ్రత ద్వారా ఎన్నో అంటువ్యాధుల్ని పూర్తిగా నిరోధించవచ్చు. ఆహారంలోని కల్తీలు ప్రజారోగ్యాన్ని తీవ్రంగా బలహీనపరుస్తున్నాయి. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు, ప్రమాదకర కలుపు నివారణ మందులు భూములను, నీటిని విషపూరితం చేస్తున్నాయి. ప్రజల జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పులు మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్లను పెంచేస్తున్నాయి.

వైద్య సదుపాయాల విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతాలలోని సబ్ సెంటర్ల నుంచి జిల్లా స్థాయి ఆసుపత్రులు, వైద్య విద్యాబోధన ఆసుపత్రుల వరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వ్యాధి నిర్ధారణ, చికిత్స సదుపాయాలు, వైద్య నిపుణులు, మందుల కొరతతో వైద్యశాలలు సతమతమవుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యానికి వార్షిక బడ్జెట్‌లో కేటాయించే నిధులు కూడా అత్యల్పంగానే ఉంటున్నాయి. నేడు మన దేశంలో వైద్యరంగం ఒక పెద్ద హెల్త్ కేర్ ఇండస్ట్రీగా మారిపోయిన ఫలితంగా ప్రజలకు వైద్యం ఇంకా భారంగా మారిపోయింది. వైద్య రంగాన్ని సేవా రంగంగా గుర్తించడం మానేశాం. నేడు వైద్య, ఆరోగ్య రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి. వైద్య రంగంలోనూ, అనుబంధ రంగాల్లోనూ పారామెడికల్ స్థాయి నుంచి సూపర్ స్పెషలిస్టుల స్థాయి వరకు వైద్యవిద్యా బోధన కళాశాలలో విద్యా ప్రమాణాలు యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచాలి. వ్యాధుల నిరోధం, నిర్మూలన అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్య సిబ్బందికి ప్రజల్ని చైతన్యవంతం చేసే విషయ పరిజ్ఞానపు నైపుణ్యాలను పెంచాలి. గ్రామీణ స్థాయి నుంచే మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. ప్లాస్టిక్ వినియోగం, ఆహారంలో కల్తీలు, ప్రమాదకర పురుగుమందులు, మద్యం, మాదకద్రవ్యాలు, గంజాయి వంటి వాటిపై ఉక్కుపాదం మోపాలి. పర్యావరణ పరిరక్షణ చర్యలు సత్వరమే చేపట్టాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే తప్ప ప్రస్తుత ప్రజారోగ్య పరిస్థితిని మెరుగుపరచలేం.

డాక్టర్ టి. సేవకుమార్

గుంటూరు

(నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం)

ఇవి కూడా చదవండి..

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, 6 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు: రాహుల్

బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత

Updated Date - Apr 07 , 2026 | 04:28 AM