పర్యావరణహితంగా జీవించకపోతే ముప్పే!
ABN , Publish Date - Jul 30 , 2026 | 02:08 AM
భూమి మీద ఉన్న సహజ వనరులను మనం విచ్చలవిడిగా కొల్లగొడుతున్నాం. వాటిని విచక్షణారహితంగా వినియోగిస్తున్నాం. దీనివల్ల పర్యావరణ లోటు ఏర్పడుతోంది. ఒక సంవత్సరంలో భూగోళం...
భూమి మీద ఉన్న సహజ వనరులను మనం విచ్చలవిడిగా కొల్లగొడుతున్నాం. వాటిని విచక్షణారహితంగా వినియోగిస్తున్నాం. దీనివల్ల పర్యావరణ లోటు ఏర్పడుతోంది. ఒక సంవత్సరంలో భూగోళం పునరుద్ధరించగల వనరుల పరిమితిని మించి మనం వాడేస్తున్నాం... ఆ రోజు తర్వాత మనం వాడే ప్రతి వనరూ భూమికి అదనపు భారం అవుతుంది. 2026లో జూలై 30నాటికే, మానవాళి భూమి వార్షిక పర్యావరణ బడ్జెట్‌ను పూర్తిగా వినియోగించుకుంది. ఈ సంవత్సరం భూమి పునరుత్పత్తి చేయగల దానికంటే, మానవాళి పర్యావరణ వనరుల అవసరం ఇదే తేదీన మించిపోతుందని అంచనా. ఈ తేదీనే ‘పర్యావరణ లోటు దినోత్సవం’గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది అయిదు నెలల ముందే వచ్చింది. ఏటా దీనిని లెక్కించి, ‘గ్లోబల్ ఫుట్ ప్రింట్ నెట్‌వర్క్’ అనే సంస్థ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజును ప్రకటిస్తుంది. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ లోటు దినోత్సవం జూలై 30.
ప్రస్తుతం మానవాళి... పర్యావరణ వ్యవస్థలు పునరుత్పత్తి చేయగల దానికంటే 73శాతం వేగంగా ప్రకృతిని వాడుకుంటోంది. ఇది 1.73 భూగోళాలను వినియోగించడంతో సమానం. అంటే మానవాళి సహజ సంపదను క్షీణింపజేస్తోందని అర్థం. పర్యావరణ లోటును కొనసాగించడం వల్ల కలిగే పరిణామాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అడవుల నరికివేత, నేల కోత, జీవవైవిధ్య నష్టం, మంచినీటి కొరత, వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్ పేరుకుపోవడం– ఇవన్నీ వాతావరణ మార్పులకు కారణమవుతాయి. పరిమితులను అతిక్రమించడం వల్ల కలిగే ప్రత్యక్ష ఫలితాలే ఇవి.
సహజ వనరుల వాడకాన్ని తగ్గించాలి. కాలుష్యాన్ని, కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అమెరికన్లలా జీవిస్తే 5 భూగోళాలు కావాలి. జీవన శైలిని మార్చుకొని, సహజ వనరుల వాడకాన్ని తగ్గించుకుంటూ ప్రకృతి పరిరక్షణకు దోహదం చేయాలి. భూతలం మీద వాతావరణంలో కర్బన ఉద్గారాలను పెంపొందించే మానవ కార్యకలాపాలను తగ్గించుకోవాలి. మానవులు పర్యావరణహితంగా జీవించడానికి తమ జీవన శైలిని మార్చుకోవాలి. అప్పుడే భూతాపం నియంత్రణలోకి వస్తుంది.
డా. పి.సి. సాయిబాబు
(నేడు ప్రపంచ పర్యావరణ లోటు దినోత్సవం)
ఇవి కూడా చదవండి
కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!
విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా