అబలలపై అమానవీయతకు అంతం ఎప్పుడు?
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:52 AM
దేశంలో, రాష్ట్రంలో మహిళలపై, అభం శుభం తెలియని పిల్లలపై ఏదైనా అమానవీయ ఘటన జరిగినప్పుడు సమాజం నివ్వెరపోతోంది. దిగ్గున నిద్ర లేస్తోంది. ఒక్కొక్క గొంతుక వంద గొంతుకలై చట్టాలను...
దేశంలో, రాష్ట్రంలో మహిళలపై, అభం శుభం తెలియని పిల్లలపై ఏదైనా అమానవీయ ఘటన జరిగినప్పుడు సమాజం నివ్వెరపోతోంది. దిగ్గున నిద్ర లేస్తోంది. ఒక్కొక్క గొంతుక వంద గొంతుకలై చట్టాలను, అమలు చేసే పోలీసులను నిగ్గదీస్తాయి. ప్రభుత్వాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తాయి. నాలుగు రోజులు గడవగానే ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతారు. మళ్లీ దారుణం జరగ్గానే తుళ్లిపడి లేస్తారు. కారణాలు, పరిష్కారాలపై మేధోమథనం ఉండదు.
ఇటీవల అనంతపురం జిల్లాలోని రాప్తాడులో పాఠశాల విద్యార్థినిపై జరిగిన రాక్షస చర్య అందరినీ మరోమారు నిద్ర లేపింది. బడిలో ఉన్న విద్యార్థినిపై చెట్లు కోసే ఎలక్ట్రికల్ రంపం మిషన్‌తో ఉన్మాది చేసిన ఘాతుకం మానవీయ కోణంపై నెత్తుటి మరక మిగిల్చింది. 2012 డిసెంబర్ 16 రాత్రి ఢిల్లీలో కదులుతున్న బస్సులో 23 ఏళ్ల ఫిజియోథెరఫీ వైద్య విద్యార్థిని ‘నిర్భయ’పై ఆరుగురు క్రూరులు జరిపిన ఘాతుకానికి యావత్తు దేశ ప్రజలు నిశ్చేష్టులయ్యారు. 2019 నవంబర్ 27 రాత్రి హైదరాబాద్ శివార్లలో పశువైద్యురాలిపై నలుగురు ముష్కరులు చేసిన అత్యాచారం, హత్య సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కోపోద్రిక్తులను చేసింది. ఇటీవల కాలంలో చిన్నపిల్లపై వృద్ధుడి అఘాయిత్యం, ముక్కుపచ్చలారని పసికందులపై అత్యాచారాలు సభ్య సమాజాన్ని బోనెక్కిస్తూనే ఉన్నాయి. ఇలా ఏదో ఒక చోట, ఏదో ఒక అమానవీయ ఘటన జరుగుతూనే ఉంది. ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? వీటికి ప్రధాన కారణాలు ఏమిటన్నది మొదటి ప్రశ్న. ఇలాంటి అరాచకాలు, కీచక పర్వాలు జరగకుండా ఉండాలంటే, అటు ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అన్నది రెండో ప్రశ్న.
‘ఏ వ్యక్తీ పుట్టుకతో నేరస్థుడు కాదు, అతను జీవించే విధానమే అతడిని నేరస్థుడిని చేస్తోంది’ అంటాడో రచయిత. ఉద్దేశపూర్వకంగా జరిగినా, క్షణికావేశంలో జరిగినా ఈ దారుణాల వెనుక సామాజిక, ఆర్థిక, మానసిక, సాంస్కృతిక కారణాలు ఎన్నో. 1. పితృస్వామ్య (లింగ వివక్ష) భావజాలం. పురుషుడు అధికం, స్త్రీ తక్కువ అన్న పాతకాలపు భావం. ఇప్పటికీ ఈ భావ దారిద్ర్యం మనిషి మస్తిష్కం లోంచి పోలేదు. ఇందులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం, పెంపకంలో లోపాలు ఎక్కువ. పిల్లలపై అధ్యయనం ఉండదు. జాగ్రత్తలు చెప్పరు. వారికి కఠినంగానైనా సమాజ మనుగడ గురించి నేర్పరు. 2. అత్యాచారాలకు శిక్షలపై చట్టాల్లో జాప్యం, కఠినమైన శిక్షలు లేకపోవడం. ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో కేసులు అపరిష్కృతంగా ఉండటం. 2012లో నిర్భయ సంఘటన జరిగితే, 2020 మార్చి 20న నిందితులకు ఉరిశిక్ష అమలు చేశారు. ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న మహిళలపై అఘాయిత్యాల కేసులు ఎన్నో. 3. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ప్రభావం. మనుషులను మృగాలుగా మార్చేవి ఇవే. చాలా కేసుల్లో మనిషి తత్వం సిగ్గుపడేలా హింసాత్మక ఘటనల వికృత రూపానికి కారణం ఇవే. ప్రభుత్వాలు డ్రగ్స్ నిరోధక కార్యక్రమాలు చేస్తున్నా అవి అంతంత మాత్రమే. వీటిని సమాజం నుంచి దూరం చేయటం అందరి బాధ్యత. 4. సాంస్కృతిక కారణాలు. ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో సులభంగా, ఉచితంగా దొరుకుతున్న అశ్లీల చిత్రాలు, హింసాత్మక సందేశాలు. ఇవి మనిషిలోని మానసిక స్థితిని దెబ్బతీస్తాయి. ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అన్న ఇంగితం మరిచిపోయోలా చేస్తాయి. సినిమాలు కూడా నేరప్రవృత్తికి కేంద్రాలుగా మారాయి. 5. ఆర్థిక అవసరాలు కూడా ప్రభావం చూపి, మహిళలపై అఘాయిత్యాలకు, హత్యలకు, చోరీలకు దారితీస్తున్నాయి.
ఇలాంటి సామాజిక వికృత రూపాలకు పరిష్కారం ఏమిటి అంటే... రోగానికి కారణాలు తెలుసుకుంటేనే, వైద్యం తెలుస్తుంది. ఇందుకు తల్లిదండ్రులు, చట్టాలు, ప్రభుత్వాల బాధ్యత చాలా ఉంది. సామాజిక చైతన్యవంతమైన కార్యక్రమాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు వంటి అన్ని ప్రక్రియల్లో మార్పులు అవసరం. చెట్టు వేరుకు పట్టిన చెదను నిర్మూలించకుండా చెట్టును రక్షించలేం. కొమ్మలకు, రెమ్మలకు మాత్రమే మందు వేస్తే, తుంచేస్తే ప్రయోజనం ఏమిటి? మళ్లీ మళ్లీ చెదపట్టదన్న గ్యారంటీ ఉండదు. మారుతున్న సమాజంలో కొత్త ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి. రుగ్మతల కారకాలపై దృష్టి పెడితే సమాజం సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఉండదు.
l పోతుల బాలకోటయ్య
చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓపై మేము గూఢచర్యం చేయలేదు: చైనా
వాళ్లు చాలా క్లోజ్.. ఎన్విడియా సీఈఓ ఎఫైర్‌పై 6 నెలల క్రితమే డౌట్