ఎన్నికల వేళ ‘మహిళా’ వ్యూహం!
ABN , Publish Date - Apr 11 , 2026 | 05:38 AM
పార్లమెంటు ఉభయ సభలూ ఏప్రిల్ 2న, బడ్జెట్ సమావేశాల్లో సాధారణంగా జరిగే ఆర్థిక వ్యవహారాలపై చర్చలు, సంబంధిత బిల్లుల ఆమోదం ముగిసిన తరువాత వాయిదా పడ్డాయి. పార్లమెంటు వాయిదాకు అది సరైన సమయం. ఎందుకంటే...
పార్లమెంటు ఉభయ సభలూ ఏప్రిల్ 2న, బడ్జెట్ సమావేశాల్లో సాధారణంగా జరిగే ఆర్థిక వ్యవహారాలపై చర్చలు, సంబంధిత బిల్లుల ఆమోదం ముగిసిన తరువాత వాయిదా పడ్డాయి. పార్లమెంటు వాయిదాకు అది సరైన సమయం. ఎందుకంటే ఏప్రిల్ 9న అసోం, కేరళ రాష్ట్రాలలోను, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోను అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. అంతేకాకుండా తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పర్వం మార్చి 30న ఆరంభమయింది. ఆ రెండు రాష్ట్రాలలో పోలింగ్ ఏప్రిల్ 23న (తమిళనాడు), ఏప్రిల్ 29న (పశ్చిమ బెంగాల్) జరగనున్నది తమ తమ నియోజకవర్గాలకు తిరిగి వెళ్లేందుకు ఎంపీలు సహజంగానే ఆరాటపడుతున్నారు. ఏప్రిల్ మాసాంతంలోగా అత్యవసర ప్రాతిపదికన నిర్వహించవలసిన చర్చలు గానీ, ఆమోదించవలసిన బిల్లులు గానీ లేవు.
పార్లమెంటు అత్యవసరంగా చర్చించాల్సిన అంశాలు గానీ, చేపట్టాల్సిన కార్యక్రమాలు గానీ నిజంగానే ఏవీ లేవు. ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియను మరెలాంటి దుస్సాహసాలకు తావులేకుండా ముగించడమే అసంపూర్ణంగా ఉన్న కర్తవ్య పాలన. ‘ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) ఒక దుస్సాహసం కాదు, అది ఉద్దేశపూర్వక దుశ్చేష్ట. లక్షలాది ఓటర్ల ఓటుహక్కును గంపగుత్తగా తొలగించేందుకు ఉద్దేశించిన కార్యక్రమమది. చెదురుమదురుగా ఆవేశభరిత, విద్వేషపూరిత రాజకీయ ప్రసంగాలు మినహా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్ ‘సర్’పై న్యాయపోరాటం సర్వోన్నత న్యాయస్థానంలో జరుగుతోంది. ‘సర్’ ప్రభావిత రాష్ట్రాలలో సగటున 10శాతం మంది వయోజన జనాభాను ఓటర్ జాబితాల నుంచి తొలగించడం జరిగిందనే విషయాన్ని ఎవరూ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లలేదు. ‘సర్’ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పెద్ద రాష్ట్రాలు తమిళనాడు (234 సీట్లు), పశ్చిమ బెంగాల్ (294 సీట్లు)లో పోలింగ్ లోగా ఏదో ఒక వివాదాన్ని సృష్టించాలనే ఆలోచన బీజేపీ అగ్రనాయకులకు వచ్చినట్టున్నది. ‘106వ రాజ్యాంగ సవరణ చట్టం అమలు’ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో చర్చించమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని ఆదేశించి ఉంటారు. పార్లమెంటు ఆ చట్టాన్ని సెప్టెంబర్ 2023లో ఆమోదించింది. దాని అమలుపై 30 నెలల పాటు స్తబ్దుగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు హఠాత్తుగా మేల్కొంది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, ప్రతిపక్షాల నాయకుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఏప్రిల్ 29న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని మల్లికార్జున్ ఖర్గే సూచించారు. మార్చి 26న మంత్రి రాసిన లేఖ ఆసక్తికరంగా ఉన్నది: ‘ఆ సూచనను పాటిస్తే పార్లమెంటు, శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలులో జాప్యం జరగవచ్చని’, 2029 సాధారణ ఎన్నికలకుగాను ఆ చట్టంలోని అంశాల అమలు సాధ్యాసాధ్యాలను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని’ మంత్రి పేర్కొన్నారు. దరిమిలా మహిళా రిజర్వేషన్లపై చర్చించేందుకు ఏప్రిల్ 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లను శీఘ్రగతిన అమలుపరచాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పుడు సంకల్పించుకున్నది? సెప్టెంబర్ 2023లో 106వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందినప్పుడు కాదని నిశ్చితంగా చెప్పవచ్చు. మహిళా రిజర్వేషన్లను 2029 అనంతరం కాని అమలుపరచడం సాధ్యంకాదని సూచించే మాటలతో ఆ బిల్లుకు రూపకల్పన జరిగింది. మహిళా రిజర్వేషన్ల అమలుపై ఆనాడు రాజ్యసభలో నేను సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమివ్వనేలేదు.
మరి ఇప్పుడు హఠాత్తుగా మహిళా రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ చూపుతోంది? చాలా ఆతురత పడుతోంది సుమా! ఏప్రిల్ 16 నుంచి మూడు రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 816కు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టనున్నదని తెలుస్తోంది. ఇందుకు ఒక రాజ్యాంగ సవరణ బిల్లును ప్రత్యేక మెజారిటీతో ఉభయ సభల్లో ఆమోదం పొందవలసి ఉన్నది. సభలోని మొత్తం సభ్యులలో సగం మందిగానీ లేదా సమావేశాలకు హాజరైన సభ్యులలో మూడింట రెండు వంతుల మందిగానీ ఆ బిల్లును బలపరచవలసి ఉన్నది. లోక్‌సభలో భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలకు, మద్దతునిచ్చే ఇతర పక్షాలకు కలిపి మూడింట రెండువంతుల మెజారిటీ లేదు. అయినా ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల విషయమై మున్నెన్నడు చూపని తెగువను ప్రదర్శిస్తోంది. ఎందుకు? ఏప్రిల్ 23న పోలింగ్ జరగనున్నందున తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రతిపక్ష ఎంపీలు సమావేశాలకు రాలేక పోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉన్నది. లోక్‌సభలో సభ్యుల సంఖ్య పెంపుదలకు సబంధించిన బిల్లు ఆమోదం పొందినా పొందకపోయినా ఆ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో తప్పక ఉపయోగించుకుంటుంది. బిల్లు ఆమోదం పొందితే మహిళా సభ్యుల సంఖ్య 182 నుంచి 272కు పెరుగుతుందని ఇందుకు తమ ప్రభుత్వం చూపిన చొరవే కారణమని బీజేపీ ప్రజలకు చెప్పుతుంది. ఒకవేళ ఆమోదం పొందక పోతే అందుకు ప్రతిపక్షాలను తప్పుపడుతుంది.
లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 816కు పెంచాలన్న ప్రతిపాదన అమలులోకివస్తే ఉత్పన్నమయ్యే సంభావ్య ప్రతికూలతలను బీజేపీ పరిగణనలోకి తీసుకోవడం లేదు.. లోక్‌సభను నిర్వహించడం కష్టతరమవుతుంది. ఒక సభ్యుడికి మాట్లాడే అవకాశం అరుదుగా, అందునా కొద్ది నిమిషాల పాటు మాత్రమే లభిస్తుంది. మరీ ముఖ్యంగా జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలు, జనాభా పెరుగుదలను స్థిరీకరించిన దక్షిణాది రాష్ట్రాల ఓటింగ్ బలాల మధ్య వ్యత్యాసం పెరిగిపోతుంది. ఇది అనివార్యంగా రాజకీయ ఘర్షణలకు దారితీస్తుంది. ‘విభజించి పాలించు’ అనే బీజేపీ స్వతస్సిద్ధ కుయుక్తికి ఇదొక తార్కాణం. లోక్‌సభ సభ్యుల సంఖ్య పెంపుదల చర్చకు యోగ్యమైన ఆలోచనే. అయితే ఆ చర్చకు నిర్ణయించిన సమయమే గర్హనీయం.
పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
ఈ వార్తలూ చదవండి:
200 మిలియన్ డాలర్ల అమెరికన్ డ్రోన్ అదృశ్యం!
ఇజ్రాయెల్ ఆగ్రహం! పాక్ మంత్రి ట్వీట్‌ను డిలీట్ చేయించిన ఆర్మీ చీఫ్