గంగ, కావేరి.. నడుమ ‘నారీశక్తి’!
ABN , Publish Date - Apr 24 , 2026 | 01:06 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిగూఢ ఆలోచనాపరుడు. ఆయన మనసులో ఏముందో ఎప్పుడూ అర్థం చేసుకోలేం. అందుకు ప్రయత్నిస్తే చిక్కుల నెదుర్కోవలసివస్తుంది కూడా. మూడు సంవత్సరాల క్రితమే...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిగూఢ ఆలోచనాపరుడు. ఆయన మనసులో ఏముందో ఎప్పుడూ అర్థం చేసుకోలేం. అందుకు ప్రయత్నిస్తే చిక్కుల నెదుర్కోవలసివస్తుంది కూడా. మూడు సంవత్సరాల క్రితమే పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుపరిచేందుకు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత సందర్భంలో ఆయన ప్రభుత్వం ఎందుకు పూనుకున్నది? పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల లబ్ధి పొందేందుకా? పశ్చిమాసియా సంక్షోభంతో వాటిల్లుతోన్న ఆర్థిక బాధల నుంచి ప్రజల ఆలోచనలను మళ్లించేందుకా? మహిళా ఉద్ధారకుడుగా తనకు ఉన్న సువిఖ్యాతిని మరింతగా సుప్రతిష్ఠితం చేసుకునేందుకా?
ఉద్దేశం ఏదైనా కావచ్చుగానీ రాజకీయ పర్యవసానాలు చాలా ప్రముఖమైనవి. చట్టసభలలో మహిళలకు ప్రాతినిధ్యం విషయమై ప్రారంభమైన చర్చ మరింత వివాదాస్పదమైన విషయానికి మళ్లింది– డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన). ఈ వివాదాస్పద అంశం మళ్లీ చర్చల్లోకి రావడంతో ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య వ్యత్యాసాలు, విభేదాలు, విభజనల వ్యవహారాలు మళ్లీ ప్రజల మాటామంతీలోకి వచ్చాయి.
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు ప్రతికూలంగా అమలయితే మున్నెన్నడూలేని రీతిలో ఆందోళనలు ప్రజ్వరిల్లుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల పోరులో తలమునకలై ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం అటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వ్యాకులతా? లేక వ్యవస్థాగతమైన ఆందోళనకు ప్రతిబింబమా? రెండూ అని చెప్పితీరాలి. ఇది ఇబ్బందికరమైన సమాధానం, సందేహం లేదు.
అంకెలతో ఆరంభమవుదాం. గత ఐదు దశాబ్దాలలో దక్షిణాదిలో కంటే ఉత్తర భారతావనిలో జనాభా పెరుగుదల చాలా వేగంగా జరిగింది. ప్రజారోగ్యం, విద్య, కుటుంబ నియంత్రణ రంగాలలో దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచీ నిధులు భారీగా వినియోగించి జనాభా పెరుగుదలను నియంత్రించాయి. ఈ విషయంలో హిందీ భాషా రాష్ట్రాలు వెనుకబడిపోయాయి. రాజ్యాంగం నిర్దేశించినట్టు జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 2026 జనాభా గణన అనంతరం తగ్గిపోతుంది. ఇది జనాభా వాస్తవికతే గానీ రాజకీయ ఆక్షేపణ కానే కాదు. అసలు సమస్య రాజకీయాలలోను, విశ్వాసంలోను ఉన్నది. ఇది ఒక విధంగా విశ్వాస లోప రుగ్మత అని చెప్పితీరాలి.
అన్ని రాష్ట్రాలలోను లోక్‌సభ సీట్లు 50శాతం మేరకు పెంచుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించారు. ఏ రాష్ట్రమూ ఏ విధంగా నష్టపోకుండా ఉండేందుకు అది ఆచరణసాధ్యమైన రాజీకి ప్రాతిపదిక అయివుండదగింది. అయితే అమిత్ షా ప్రతిపాదన చాలా ఆలస్యంగా వచ్చింది. పైగా ప్రతిచర్యాత్మకమైనదిగా కనిపించింది. విస్తృతస్థాయి సంస్కరణలకు పూనుకున్నప్పుడు సంబంధిత వ్యక్తులు అందరితో ఓర్పుగా, నేర్పుతో సంప్రదింపులు జరిపి ఆ ప్రక్రియకు సార్వత్రిక సమ్మతి, విశ్వసనీయతను సాధించవలసి ఉన్నది. అయితే మోదీ ప్రభుత్వం సరిగ్గా ఈ విషయంలోనే తప్పటడుగు వేసింది.
ముందుగా ముఖ్యమంత్రులతో సహా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి చర్చించలేదు. అలా ప్రజాస్వామికంగా వ్యవహరించకుండా మహిళా రిజర్వేషన్ అమలుపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఆ తరువాత ఆ నిర్ణయాన్ని రాజకీయ పక్షాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసింది. మనది ఒక సమాఖ్య వ్యవస్థ. ఏ సమాఖ్య వ్యవస్థలో అయినా తమ నిర్ణయాలను ప్రతిపక్షాలు ఎలా అవగాహన చేసుకుంటున్నాయన్న విషయాన్ని ప్రభుత్వం తప్పక దృష్టిలో పెట్టుకోవాలి. సమాఖ్య వ్యవస్థలో బహుళ అధికార కేంద్రాల మధ్య నిరంతర సంప్రదింపులు, సమన్వయ సహకారాలు అవసరం. ఈ వాస్తవాన్ని మోదీ సర్కార్ విస్మరించింది. మహిళా రిజర్వేషన్ నిర్ణయంపై ప్రభుత్వ కథనం విశ్వసనీయమైనదిగా ప్రతిపక్షాలు భావించలేదు. అయితే ఈ సమస్యను ఉత్తరాది వర్సెస్ దక్షిణాది అనే వైఖరితో చూడడం తప్పుదారి పట్టడమే అవుతుంది. నిశితంగా, నిష్పాక్షికంగా ఆలోచించడంలో మానసిక బద్దకాన్ని చూపడమేనని కూడా చెప్పవచ్చు.
రాజకీయ రంగంలో తమ ప్రాబల్యం ఎలా ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలు ఇతర రంగాలలో తమ ప్రభావాన్ని బాగా పెంపొందించుకున్నాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే భారతదేశ పురోగతికి అవి చోదకశక్తులుగా ప్రభవించాయి. ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి. జీడీపీలో వాటా, ఎగుమతులు, పన్ను ఆదాయాలలో దక్షిణాది రాష్ట్రాలు అగ్రగాములుగా ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మొదలైన నగరాలు గ్లోబల్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్స్‌లో అంతస్థగితమయ్యాయి. పార్లమెంటు దేశ జనాభాను ప్రతిబింబిస్తే ఆర్థిక వ్యవస్థ పాలనా దక్షత, ఆర్థిక సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. మరి ఆర్థిక రంగంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా ముందంజలో ఉన్నాయి. మానవాభివృద్ధి, అక్షరాస్యత, ఆరోగ్య భద్రత మొదలైన సామాజిక అభివృద్ధి సూచీలలో కూడా దక్షిణాది రాష్ట్రాలే అగ్రస్థానాలలో ఉన్నాయి. అయితే, ఇప్పుడవి ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. జనాభా నియంత్రణలో సాధించిన విజయాల కారణంగా పార్లమెంటులో తమ రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోయే విపత్కర పరిస్థితి వాటికి ఏర్పడింది. సుపరిపాలననందించడంలో తమ విజయానికి శిక్షే ఈ విపత్కర పరిస్థితి అని అవి వాదిస్తున్నాయి. అయితే ఆ వాదనను రాజకీయంగా ఆమోదింపజేయడం అంత తేలికేమీ కాదు.
అదే సమయంలో భారతీయ జీవన వాస్తవికత ప్రాంతీయ విభజనలను ప్రతిఘటిస్తోంది. రాజకీయాలు తరచూ ఉపేక్షించే మార్గాలలో సాంస్కృతిక, సామాజిక సమైక్యత మరింత ప్రగాఢమవుతోంది. జార్ఖండ్ బిడ్డ ఎమ్‌ఎస్ ధోనీ చెన్నైలోని క్రికెట్ అభిమానులకు కులదైవం అయిపోలేదూ? తెలుగు సినిమా ప్రతిభకు నిలువెత్తు దర్పణంగా నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్ భారతావని అంతటా, అన్ని భాషల వారిని అలరించలేదూ?
సరే, వలసలకు ఉత్తర, దక్షిణ హద్దులు ఉంటాయా? దక్షిణాది టెక్‌హబ్స్‌లో ఉత్తరాది భారతీయులు ఎంతమంది లేరూ? దక్షిణాది వృత్తి నిపుణులు ఉత్తరాది నగరాలలో రాణించడం లేదూ? రాజకీయాలు అంగీకరించిన దానికంటే ఎక్కువగా ఉత్తరాది, దక్షిణాది భారతీయులు ‘కలసి ఉంటే కలదు సుఖం’గా జీవన వ్యాపకాలలో నిమగ్నమై వర్ధిల్లుతున్నారు, సందేహం లేదు. అయితే సాంస్కృతిక సమైక్యత రాజకీయ భరోసాకు ప్రత్యామ్నాయం కాదు, కాబోదు.
దక్షిణాదిలో సుస్థిర ఉనికిని సాధించుకోవడానికి బీజేపీ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఉత్తరాది నుంచి వచ్చిన పార్టీ నాయకులు స్థానిక దుస్తులు ధరిస్తున్నారు. గుడులు, గోపురాలు సందర్శిస్తున్నారు. ఈ ప్రతీకాత్మక చర్యలకు పరిమితులు ఉన్నందున నిర్మాణాత్మక విశ్వాసలోటును బీజేపీ అధిగమించలేకపోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది సంప్రదాయ దుస్తులు ధరించి గురువాయూర్ ఆలయానికి వెళ్లారు. భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించారు. అయితే ప్రజల మనస్సుల్లో వేళ్లూనుకున్న భయ సంకోచాలను తొలగించేందుకు ఆ పూజలు సరిపోతాయా?
డీలిమిటేషన్‌పై దక్షిణాది ప్రజల్లో మానసిక ఆందోళన కేవలం సీట్ల సంఖ్య గురించి మాత్రమే కాదు. పార్లమెంటులో తమ పలుకుబడి, దేశ రాజకీయాలలో తమ ప్రభావం గురించిన కలత అది. భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి విశేష సేవలు అందించిన దక్షిణాది రాష్ట్రాలకు యథావిధిగా జాతి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో నిర్ణయాత్మక ప్రభావాన్ని నెరపే అవకాశాలు ఉంటాయా? ఈ ప్రశ్నకు సమాధానం రాజకీయ భరోసాతో లభించదు. దూరదృష్టితో కూడిన ఆలోచన అందుకు అవసరం.
నియోజకవర్గాల పునర్విభజనలో హైబ్రిడ్ నమూనాను భారత్ రూపొందించుకోగలదా? జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచుతూ పాలనాదక్షత, ఆర్థికాభివృద్ధికి అందిస్తున్న సేవలు, మానవాభివృద్ధి లక్ష్యాల సాధనలో పురోగతి... ఇత్యాది అంశాలను ప్రాతి పదికగా తీసుకుంటారా? ఇటువంటి ఆలోచన సర్వ జనామోదం పొందకపోవచ్చు. రాజకీయులు తీవ్రంగా వ్యతిరేకించడం ఖాయం. అయితే అటువంటి ఆలోచనను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరిస్తే ఉత్తర–దక్షిణ వ్యత్యాసాలు, విభజనలు మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. డీలిమిటేషన్ అంతిమంగా నియోజకవర్గాల హద్దులను పునర్నిర్ధారించే సాంకేతిక కార్యకలాపం మాత్రమే కాదు. అది భారతదేశ సమాఖ్య ఒడంబడికకు ఒక విషమ పరీక్ష. ఆ రాజ్యాంగ బాధ్యతను అపసవ్యంగా నిర్వహిస్తే ప్రాంతీయ అసంతృప్తులు తీవ్రమై దేశ రాజకీయ సమైక్యత బీటలువారుతుంది. అలా కాకుండా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సున్నితంగా నిర్వహిస్తే భారత సమాఖ్య మరింత సమ్మిళితంగానూ, సమాలోచనాత్మకంగానూ రూపొందుతుంది.
మహిళా రిజర్వేషన్‌పై చర్చ ‘పునర్విభజన’పై వాదోపవాదాలను ప్రారంభించింది. అయితే అది మరొక వాస్తవాన్ని కూడా బహిర్గతం చేసింది: రాబోయే సంవత్సరాలలో అధికారం పంపిణీ ఎలా జరుగుతుందనే విషయమై పెరుగుతోన్న కలవరపాటు. ఇది కేవలం లోక్‌సభ సీట్ల అంక గణితం గురించి మాత్రమే కాదు. భారత్ లాంటి విశాల వైవిధ్యభరిత దేశంలో భిన్న ప్రాంతాలు, సామాజిక వర్గాల మధ్య పరస్పర విశ్వాసం తగ్గిపోతే ఏ పరిష్కార సూత్రమూ అదెంత పరిపూర్ణమయినదైనప్పటికీ, దేశ ఐక్యతను సురక్షితంగా నిలబెట్టలేదు, దేశ ప్రజలను సమైక్యపరచలేదు. ఇది నిశ్చితం.
తాజా కలం: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యామ్నాయ డీలిమిటేషన్ నమూనాను ప్రతిపాదించారు. పార్లమెంటరీ సీట్ల పెంపుదల కాకుండా రాష్ట్ర స్థాయిలోను, స్థానిక పాలనా సంస్థల్లోనూ ప్రజా ప్రాతినిధ్యాన్ని పెంపొందించాలని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. ప్రజలకు సుపరిపాలన నందించేందుకు మరింత మంది ఎంపీలు కాకుండా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లే మరింత ఎక్కువగా అవసరమని ఆయన అన్నారు. ఉత్తరాది–దక్షిణాది విభేదాలను తిరిగి రెచ్చగొట్టడం కంటే తక్కువ ఆందోళనకరమయింది గనుక రేవంత్‌రెడ్డి ప్రతిపాదన విస్తృత చర్చకు యోగ్యమైనది.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
ఇవి కూడా చదవండి
ఆర్టీసీ సమ్మెలో ఆందోళనకర పరిణామాలు..
చిన్న నౌకలనూ కాల్చేయండి.. అమెరికా నేవీకి ట్రంప్ కీలక సూచనలు