కాళ్ళు విరగ్గొట్టి కర్ర చేతికిచ్చినట్టు!
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:49 AM
పార్లమెంటులోనూ, అసెంబ్లీలలోనూ, ఆడవాళ్ళకి ప్రత్యేకంగా నూటికి 33 సీట్లు వుండాలని ఎన్నో ఏళ్ళుగా, ఎన్నికల్లో పాల్గొనే పార్టీలన్నీ కోరుతూ వస్తున్నాయి. దానికోసం, ఒక బిల్లుని 2023లో పార్లమెంటులో...
పార్లమెంటులోనూ, అసెంబ్లీలలోనూ, ఆడవాళ్ళకి ప్రత్యేకంగా నూటికి 33 సీట్లు వుండాలని ఎన్నో ఏళ్ళుగా, ఎన్నికల్లో పాల్గొనే పార్టీలన్నీ కోరుతూ వస్తున్నాయి. దానికోసం, ఒక బిల్లుని 2023లో పార్లమెంటులో అన్ని పార్టీలూ ఆమోదించాయి. కానీ, ఆ చట్టం అప్పుడు అమలు కాలేదు. దానికి ప్రభుత్వం ఏవేవో కారణాలు చెప్పింది. జనాభా లెక్కలు తియ్యాలనీ, దాని ప్రకారం నియోజక వర్గాల్ని తిరిగి విభజించాలనీ! ఆ కారణాలతో లంకెపెట్టి, అదే బిల్లుని ప్రభుత్వం ఈ ఏప్రిల్ 18న, పార్లమెంటులో ఓటింగుకి పెట్టింది. అయితే, ఆ బిల్లుకి కావల్సినన్ని ఓట్లు రాకపోవడం వల్ల, ఆ బిల్లు వీగిపోయింది. అలా వీగిపోయిన మరుక్షణమే, ఏ మాత్రం ఆగకుండా, బీజేపీ కూటమికి చెందిన మహిళా ఎంపీలు, ‘బిల్లు వీగిపోవడానికి ప్రతిపక్షాల మహిళా వ్యతిరేకతే కారణం’ అని నినాదాలు చేస్తూ, నిరసన పోస్టర్లను పట్టుకుని పార్లమెంటు ప్రవేశ ద్వారం దగ్గిర చేరి, ఊరేగింపుగా బైల్దేరారు! ఆ ఊరేగింపుని చూపిస్తూ, ‘మీరేమంటారూ?’ అని ఒక స్త్రీ విలేఖరి, కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడూ, ఆశుకవీ అయిన, ఇమ్రాన్ ప్రతాప్ గఢీని అడగ్గా, ఆయన ఏమన్నాడో వినండి! ‘ఈ బిల్లుకి కావలిసిన మెజారిటీ ఓట్లు రావనీ, ఆ బిల్లు వీగిపోతుందనీ, బీజెపీకి ముందే తెలుసు కాబట్టే, ఈ నిరసన పోస్టర్లను ముందుగానే అచ్చువేసి (‘‘పెహ్లేహీ ఛపాహువా పోస్టర్స్’’) వుంచుకున్నారు! అందుకే ఆ బిల్లు ఓడిపోయిన వెంటనే, ఏ మాత్రం ఆలస్యం లేకుండా, ఈ అట్టలు పట్టుకుని బైల్దేరారు’ – అంటూ బీజేపీ కూటమి వాళ్ళ తెలివితక్కువ కిలాడీతనాన్ని బైటపెట్టాడు ఇమ్రాన్! బిల్లు ఆమోదం పొందితే, ‘చూశారా, మేమెంత మహిళోద్ధారకులమో!’ అనీ; బిల్లు వీగిపోతే, ప్రతిపక్షాలు ‘మహిళా విరోధులు’ అనీ; బెంగాలూ, తమిళనాడూ ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవచ్చు– అని బీజేపీ ఎత్తుగడ! చివరికి అదే జరిగిందని, ఆ మర్నాడు జరిగిన ఎన్నికల ప్రచారాల సభల్లో ప్రధాని ఉపన్యాసాల్లో రుజువైంది!
అయితే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆడవాళ్ళకి చట్టసభల్లో రిజర్వేషన్లు జరగడం వల్ల, కనీవినీ ఎరగని అద్భుతాలు జరుగుతాయని అధికార పక్ష పార్టీలూ, ప్రతిపక్ష పార్టీలూ కూడా ఊదరగొట్టేస్తున్నాయి. రిజర్వేషన్ల వల్ల అతి సామాన్య స్త్రీ కూడా చట్టసభల్లో ప్రవేశించి, స్త్రీల ఉద్ధరణకు గొప్ప గొప్ప చట్టాలు రావడానికీ, పరిపాలనలో పాలుపంచుకోవడానికీ, వీలవుతుందని అన్ని పార్టీలూ ఒకటే రోకటిపాట. మొత్తానికి అన్ని పార్టీలూ ఈ రిజర్వేషన్లని స్త్రీల సమస్యలకు సర్వరోగ నివారిణి అన్నంతగా గొప్ప చేస్తున్నాయి! ఇది నిజమేనా? ఈ బిల్లు వల్ల, స్త్రీలకి జరిగే మేలు ఎంత? కలిగించే భ్రమ ఎంత? – అని శ్రామికవర్గ స్త్రీల ప్రయోజనాల దృష్టితో ఆలోచించాలని చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశం!
‘శ్రామిక వర్గ స్త్రీలు’ అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే, దేశంలో స్త్రీలందరి స్తితిగతులూ ఒక్కలాగే లేవు. పురుషులు ఎలాగైతే వర్గాలుగా చీలిపోయి వున్నారో, స్త్రీలు కూడా అలాగే విడిపోయి వున్నారు. ఒకేలా లేరు! శ్రమలు చేసే వర్గమూ, ఏ శ్రమలూ చెయ్యని వర్గమూ అనే తేడాలతోనే వున్నారు. ‘శ్రమలు చెయ్యని వర్గపు స్త్రీలు’ అనడానికి కారణం, వారి కుటుంబాల భారీ ఆదాయాలు! అవి: లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ, అద్దెలూ, వర్తక కమిషన్లూ అనే పేర్లతో వుంటాయి. ఇవన్నీ శ్రామిక స్త్రీ పురుషుల నించీ లాగే ‘అదనపు శ్రమ’ ద్వారా వచ్చేవే! అలాంటి ఆదాయాలకు మూలం, భూములూ, ఫ్యాక్టరీలూ, గనులూ, రవాణా సాధనాలూ, వర్తక సంస్తలూ– ఇవన్నీ వీరి ఆస్తిగా వుండడమే. అంటే, ఈ స్త్రీలు ఆస్తుల్ని రిజర్వ్ చేసుకున్న వర్గం వారన్న మాట! ఈ విషయం అర్ధం చేసుకోవాలంటే, ఈ స్త్రీలు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఇచ్చే ఆస్తిపాస్తులా ఆదాయాల వివరాలు చూడాలి. అలాగే, ఎన్నికల సంస్కరణలకోసం పాటుపడే ఎ.డి.ఆర్ వంటి సంస్తల నివేదికల్ని కూడా చూడాలి.
ఇక, శ్రామిక వర్గ స్త్రీలలో, అతి ఎక్కువమంది ఆస్తులు ఏమీ లేనివారూ, ఉన్నా అతి కొద్దిపాటి మాత్రమే వున్నవారూనూ! వీరంతా శ్రమలు చేసుకుంటూ, జీతాల మీదా, అతి తక్కువ ఆదాయాల మీదా ఆధారపడి జీవించే కుటుంబాల స్త్రీలే! ఈ శ్రామికుల్లో మళ్ళీ మేధా శ్రమలు చేసేవాళ్ళూ, శారీరక శ్రమలు చేసే వాళ్ళూ అనే తేడాలున్నాయి. వాళ్ళల్లో నైపుణ్యంగల శ్రమలు చేసేవాళ్ళూ, అట్టడుగు శ్రమలు చేసేవాళ్ళూ కూడా! మళ్ళీ వాళ్ళల్లోనే మురికిని శుభ్రం చేసే ‘పాకీ’ శ్రమలు చేసేవాళ్ళూ! అంటే, శ్రామిక వర్గ స్త్రీలకి ‘శ్రమలు’ మాత్రమే రిజర్వ్ ఐ వున్నాయన్నమాట!
ఇంత ‘అసమాన పరిస్తితులు’ వున్నప్పుడు, చట్టసభల్లో దొరికే రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం ఎవరికి? ఉత్పత్తి సాధనాలు సమిష్టిగా కాక, కొన్ని కుటుంబాల ఆస్తులుగా వుండడాన్ని సమ్మతించే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, రిజర్వేషన్ల ద్వారానో, రిజర్వేషన్లు లేకుండానో, పార్లమెంటులోకీ, అసెంబ్లీలలోకీ ప్రవేశించి, పురుషులైనా, స్త్రీలైన చేసే ఘనకార్యాలేముంటాయి? ఇప్పటికే, గ్రామ పంచాయితీలలో 33శాతం రిజర్వేషన్లు వున్నాయి. అక్కడ ఆ శాతం స్త్రీలుగానీ, మిగతా శాతంలో వున్న పురుషులుగానీ, ఏమేమి పనులు చేస్తారూ, ఏమేమి చెయ్యగలుగుతారు? ఉత్పత్తి సాధనాలను ఒక వర్గానికి రిజర్వ్ చేసి, ఇంకో వర్గానికి రకరకాల శ్రమల్ని రిజర్వు చేసి వుండగా, ఆ శ్రామిక వర్గ స్త్రీలకి చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించడం అంటే, ఆ శ్రామిక స్త్రీలకి కాళ్ళు విరగ్గొట్టి, కర్ర చేతికివ్వడమే కదా!
ఎవరైనా ఇలా అడగవచ్చు: ‘‘నువ్వు ఆశించే, సమానత్వ సమాజం దూరపు కల! అప్పటిదాకా, తాత్కాలిక ఉపశమనాలు అక్కరలేదా? ఈ రాజకీయ రిజర్వేషన్లను ఉపయోగించుకోకూడదా? ‘మబ్బుల్ని చూసి, కుండలో నీళ్ళని పారబోసుకున్నట్టు’ అవదా?’’ ఇలాంటి ప్రశ్నలకి నా జవాబు: చట్ట సభల్లో శ్రామిక వర్గ స్త్రీలకి– అంటే, మేధా శ్రమలు చేసే కుటుంబాల స్త్రీలకే కాదు, అట్టడుగు శారీరక శ్రమలు చేసే కుటుంబాల స్త్రీలకి కూడా– రిజర్వేషన్లు పెడతారంటే, ‘అవి మాకు వద్దు’ అని వ్యతిరేకించమని కాదు! కానీ, శ్రామిక స్త్రీ, పురుషుల అదనపు శ్రమల విలువల్ని దోపిడీదారుల ఆదాయాలుగా కాపాడే రాజ్యాంగం ఇది. అలాగే, అసమాన శ్రమ విభజనను సమర్ధించే రాజ్యాంగ పాలనని అభ్యుదయంగా నమ్ముతూ, తమ శ్రామికవర్గ ప్రయోజనాలను కాపాడగలం–అనే భ్రమల్లో వుండొద్దు–అనడమే ఇది! ఈ రిజర్వేషన్లు కొన్ని భ్రమల్ని కలిగిస్తాయి! ఆ చట్రంలోకి దిగాక, క్రమంగా, ఇక శ్రామిక స్త్రీలు ఎలాగో అలా ఎన్నికల్లో గెలిచి, ఎం.ఎల్.ఎ, ఎం.పీల సీట్లలో కూచుంటే చాలనే భ్రమల్లో మునగవద్దు–అని చెప్పడానికే ఇది! గత 75 ఏళ్ళుగా గ్రామ పంచాయితీలలో గానీ, అసెంబ్లీలలో గానీ, పార్లమెంటులో గానీ కూచున్న పురుషులు ఏమైనా గొప్ప పనులు చేశారా, చేస్తున్నారా? ఈ మహిళా రిజర్వేషన్ల ద్వారా వాటిల్లో ప్రవేశించేవాళ్ళు కూడా అదే చేస్తారు. గ్రామాల్లో సైడు కాలవల నిర్మాణాల నించీ మొదలు పెట్టి, పెద్ద పెద్ద నగరాలలో అంతర్జాతీయ విమానాశ్రయాల దాకా చూస్తే, మౌలిక సదుపాయాల పేరుతో జరిగే పనుల్లో కాంట్రాక్టులు ఎన్నో వుంటాయి. డ్రైనేజీ ఏర్పాట్లూ, నీళ్ళ సప్లై, కరెంటు సప్లై, రోడ్లూ, జాతీయ రహదారులూ, రైల్వే లైనులూ, నౌకా కేంద్రాలూ, ఫ్లై ఓవర్లూ, మెట్రో లైన్లూ– ఇలా సాగే అనేక రకాల పనుల కాంట్రాక్టుల్ని తమ పార్టీ వారికి గానీ, తమ బంధుమిత్రులకు గానీ, తమ పార్టీకి చందాలు ఎక్కువగా ఇచ్చే వాళ్ళకిగానీ అప్పజెప్పడాలు జరుగుతూ వుంది–చట్ట సభల్లో ప్రవేశించేవారి ద్వారా! రాజకీయ పార్టీల వాళ్ళు ఒకరి మీద ఒకరు చేసుకునే ‘కుంభకోణాల’ ఆరోపణలను చూస్తే, పరిపాలనలో నిజాలు తెలియడం లేదూ? చివరికి సంక్షేమ కార్యక్రమాల పేరుతో గుడ్లూ, బియ్యం, కూరగాయలూ, యూనిఫారాలూ, పుస్తకాలూ, చీరలూ, రేషన్ వస్తువులూ, ఒకటేమిటి, అనేక సరుకుల సప్లైలకు కాంట్రాక్టులే కాంట్రాక్టులు!
చట్టసభల్లోకి స్త్రీలు రిజర్వేషన్ల ద్వారా వెళ్ళవద్దని కాదు, వెళ్తే ఇన్ని ప్రమాదాలున్నాయనీ, ఆ ప్రకారమే వీరు నడవక తప్పదనీ, తెలుసుకోమనడానికే ఇది. ‘‘మరి సమస్యల పరిష్కారానికి ఏం చెయ్యాలి?’’ అంటే, చట్ట సభలకి వెళ్ళి ఏం సాధించుదామనుకుంటారో, దానికోసం తోటి శ్రామిక స్త్రీలని ‘వర్గ సంఘాల’లోకీ, ‘ప్రజా సంఘాల’లోకీ ఏకం చెయ్యడానికి ప్రయత్నాలు చెయ్యాలి. అంతేగానీ, ‘బాతాకానీ’ కేంద్రాలుగా పేరుగాంచిన చట్టసభలలో కాలక్షేపం చెయ్యడం కాదు– అని చెప్పడానికే ఈ వ్యాసం!
రంగనాయకమ్మ
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం మంత్రి కీలక ఆదేశాలు
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం.. బాధితురాలితో మాట్లాడిన రాయపాటి శైలజ
Read Latest AP News And Telugu News