Share News

Venezuela Crisis: వెనెజువెలాలో అమెరికా అభీష్టం నెరవేరేనా

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:48 AM

చమురు విపణిపై ఆధిపత్యం అనేది అమెరికా విదేశాంగ విధానాన్ని నిర్ణయాత్మకంగా నిర్దేశించే అంశాలలో ముఖ్యమైనది. వెనెజువెలాను దురాక్రమించడం ద్వారా చమురు రాజకీయాగ్నులను ఎగదోసి...

Venezuela Crisis: వెనెజువెలాలో అమెరికా అభీష్టం నెరవేరేనా

చమురు విపణిపై ఆధిపత్యం అనేది అమెరికా విదేశాంగ విధానాన్ని నిర్ణయాత్మకంగా నిర్దేశించే అంశాలలో ముఖ్యమైనది. వెనెజువెలాను దురాక్రమించడం ద్వారా చమురు రాజకీయాగ్నులను ఎగదోసి, ప్రపంచ దేశాలతో సరికొత్త చెలగాటానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ శ్రీకారం చుట్టారు.

ఇప్పుడు వెనెజువెలా, అంతకు ముందు ఇరాన్, ఇరాక్‌, లిబియాలతో అగ్రరాజ్యానికి ఉన్న వైరానికి చమురు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. తమ జాతీయ ప్రయోజనాలకు ఏ దేశమూ చమురు విషయంలోగానీ, మరే సహజసంపద విషయంలో గానీ స్వతంత్రంగా వ్యవహరించడం అమెరికాకు సుతరామూ గిట్టదు గాక గిట్టదు.

చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న దేశాలపై దండయాత్ర చేయడమనేది అమెరికాకు ఇదేమీ మొదటిసారి కాదు. ఇతర దేశాలలో జోక్యం మూలంగా అమెరికాకు వాటిల్లిన నష్టాల గురించి ట్రంప్‌ గత ఏడాది తన ఎన్నికల ప్రచారంలో తరచూ ప్రస్తావించారు. తత్కారణంగా అంతర్జాతీయ వ్యవహారాలలో గత అధ్యక్షుల వలే కాకుండా భిన్న విధానాలను ట్రంప్ అనుసరించవచ్చునని భావిస్తున్న తరుణంలో వెనెజువెలా ఉదంతం చోటుచేసుకోవడం అమెరికా ప్రజానీకాన్ని దిగ్భ్రాంతిపరిచింది. వెనెజువెలా సహజసంపదపై పెత్తనం చెలాయించే ప్రయత్నాలను ప్రపంచ ప్రజలూ నిశితంగా గమనిస్తున్నారు.

దేశాలను దురాక్రమించినంత మాత్రాన తాను ఆశించిన రీతిలో చమురు సంపదను ఉత్పత్తి చేయడం అమెరికాకు సాధ్యమవుతుందా? ఇరాక్‌, లిబియా దేశాల ఉదంతాల నుంచి అమెరికా గుణపాఠం నేర్చుకోలేదని అనిపిస్తోంది. చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపుదల అనేది నిరంతర కృషి, భారీ పెట్టుబడులతో కూడిన వ్యవహారం. ఏ వ్యాపార సంస్థ అయినా తమ పెట్టుబడులకు రాబడులు వస్తాయని ప్రగాఢంగా విశ్వసించిన చోట మాత్రమే మదుపులు చేస్తుంది. చమురు నిక్షేపాలను వెలికితీయడానికి భౌగోళిక పరిస్థితులతో పాటు ఆయా ప్రాంతాలలోని ప్రజా సహకారం కూడా అవసరం. స్థానికుల తోడ్పాటు లేకుండా పురోగతి అసాధ్యమనే విషయాన్ని ఇరాక్‌, లిబియాలను చూస్తే తెలుస్తోంది. జీవాయుధాలు, అణ్వస్త్రాలతో తమ ప్రజలపై దాడులు చేస్తోందనే వ్యూహాత్మక తప్పుడు ప్రచారంతో జార్జి బుష్ 2003లో ఇరాక్‌ను దురాక్రమించారు. ఆ కాలంలో చమురు ఉత్పాదక దేశాల కూటమి (ఒపెక్)లో సౌదీ అరేబియా తర్వాత రెండవ స్థానంలో ఇరాక్‌‍ ఉంది. అమెరికా, దాని మిత్ర దేశాల సైనిక బలగం, ఇరాక్‌లోని అసమ్మతి, తిరుగుబాటు దళాలు, తెగల సహాయం ఉన్నప్పటికీ అమెరికన్ చమురు సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇతోధికంగా పెంపొందించుకోవడంలో విఫలమయ్యాయి. లిబియాలో ఆ దేశాధినేత గడాఫీని హతమార్చి ఆ చమురు ఉత్పాదక దేశాన్ని అమెరికా హస్తగతం చేసుకున్నది. అమెరికా లేదా ఐరోపా చమురు సంస్థలు ఏవీ కూడా ఇప్పటికీ లిబియాలో తమ ప్రతాపాన్ని చూపలేకపోతున్నాయనేది ఒక నమ్మవలసిన వాస్తవం.


ఒక పరాయి దేశాన్ని సైనిక, సాంకేతిక సామర్థ్యంతో దురాక్రమించడం ద్వారా ఆ దేశ సంపదను దోచుకోవడం అంత సులభతరమా? అయిన పక్షంలో ప్రపంచంలోకెల్లా శ్రేష్ఠతరమైన నాణ్యత ఉన్న చమురుగా పేరున్న ఇరాక్‌ చమురు నిక్షేపాలపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకోకుండా ఆ దేశం నుంచే అమెరికా ఎందుకు నిష్ర్కమించింది?

స్వల్ప మోతాదులో సల్ఫర్ ఉండి, అధిక మొత్తంలో పెట్రోలును తక్కువ వ్యయంతో విడుదల చేసే ఇరాక్‌ చమురుకు, వెనెజువెలా చమురుకు మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది. ఇరాక్‌ ఎడారిలో తక్కువ లోతులో లభించే క్రూడ్‌లో ఎక్కువ మోతాదులో పెట్రోలు వెలువడుతుంది. ఆ తరువాత ప్లాస్టిక్ ఉత్పత్తి, ఆటోమొబైల్ పరిశ్రమల్లో వినియోగించే రసాయనాలు వెలువడుతాయి. ఇరాక్‌తో పాటు అరబ్బు దేశాలలో ఉత్పత్తి అయ్యే ఈ రకం చమురు తేలికగా ఉంటుంది. భారతదేశంలోని అన్ని రిఫైనరీలకు దీన్ని సునాయాసంగా శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. వెనెజువెలాలో సాధారణంగా నీళ్ళ కింద లభించే క్రూడ్‌లో సల్ఫర్‌ అధికంగా ఉంటుంది. దట్టంగాను, జిగటగాను ఉంటుంది. దీని నుంచి డీజిల్‌ ఎక్కువ మోతాదులో వెలువడుతుంది. ఆ తర్వాత తారు ఉత్పన్నమవుతుంది. పెట్రోలు, రసాయనాల భాగం తక్కువగా ఉంటుంది. క్రూడ్‌ను పైపుల ద్వారా రవాణా చేయడానికి అందులో అదనంగా రసాయనాలు కలపవలసి ఉంటుంది. పైగా వెనెజువెలా క్రూడ్‌ను శుద్ధిచేయడం రిఫైనరీలకు అదనపు వ్యయంతో కూడుకున్న పని. భారతదేశంలో ఇటువంటి క్రూడ్‌ను శుద్ధి చేసే రిఫైనరీ ఒక్కటే ఉన్నది. అది రిలయెన్స్‌ కంపెనీది. విశాఖతో సహా మిగిలిన రిఫైనరీలకు వెనెజువెలా తరహా క్రూడ్‌ను శుద్ధి చేయడమనేది అదనపు పని భారం.

మరో ముఖ్యమైన వాస్తవం– చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి యంత్రసామగ్రి, విశాల భూభాగంలో పైపు లైన్ల కొరకు భారీ పెట్టుబడులు అవసరం. దీని ఫలితాలు రావడానికి కనిష్ఠంగా పది సంవత్సరాల కాలం పడుతుంది. అప్పటికి అమెరికా విధానం ఏ విధంగా ఉంటుందో చెప్పలేం. చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపుదలకు ఇంతకుముందే చెప్పినట్లుగా నిరంతర కృషి, భారీ పెట్టుబడులతో పాటు ముందు చూపుతో కూడిన దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. సత్వర లాభాపేక్షతో వ్యవహరించే అమెరికా సంస్థలు అందుకు సిద్ధంగా ఉన్నాయా అనేది సందేహమే. ప్రపంచవ్యాప్తంగా ధరలు పతనమవుతున్న ప్రస్తుత తరుణంలో స్థానిక ప్రజాభీష్టానికి విరుద్ధంగా వెనెజువెలాలో జూదమాడడానికి అమెరికన్ చమురు సంస్థలు ఎంత వరకు ఇష్టపడతాయి? ఈ విషయంపైనే అమెరికా విదేశాంగ విధాన సాఫల్యం ఆధారపడి ఉంది.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

రైలు పట్టాలపైనే మహిళ ప్రసవం.. ఏమైందంటే?

బెట్టింగ్ యాప్‌ బారిన పడి యువకుడి బలి

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 14 , 2026 | 12:52 AM