Share News

కేంద్రం కాదన్న ‘పద్మా’లకు రాష్ట్ర గౌరవం దక్కేనా?

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:57 AM

జాతీయ స్థాయి అత్యున్నత పౌర పురస్కారాలలో మరోసారి తెలంగాణకు అన్యాయం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ళుగా సిఫారసు చేస్తున్న వారికి కాకుండా వేరేవారికి పద్మ పురస్కారాలు...

కేంద్రం కాదన్న ‘పద్మా’లకు రాష్ట్ర గౌరవం దక్కేనా?

జాతీయ స్థాయి అత్యున్నత పౌర పురస్కారాలలో మరోసారి తెలంగాణకు అన్యాయం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ళుగా సిఫారసు చేస్తున్న వారికి కాకుండా వేరేవారికి పద్మ పురస్కారాలు కేటాయించారు. ఇది రాష్ట్రానికి అవమానమే. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నిధుల విషయంలోనే కాదు పద్మ పురస్కారాలలో కూడా నిరంతరం అన్యాయానికి గురవుతోంది.

ఎన్నో కోణాలలోంచి పరిశీలించి, రాష్ట్రానికి అత్యున్నత సేవ చేసిన వారి పేర్లను ముఖ్యమంత్రి ఆమోదంతో కేంద్రం పరిశీలనకు పంపిస్తారు. వారిలో కొంతమందికైనా పద్మ పురస్కారాలను ఇవ్వడం చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నది. కాబట్టి ఈ పోటీ వల్ల రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫారసులను కేంద్రం పరిశీలనలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా కేంద్రంలోని ప్రభుత్వం తమ పార్టీ భావజాలానికి చెందనివారి పేర్లను పక్కన పెట్టడం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ తమ పదేళ్ళ పాలనలో పద్మ పురస్కారాలకు సిఫారసులను పంపలేదు. దీని ద్వారా నష్టపోయింది తెలంగాణలో వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరువాత రెండుసార్లు పద్మ పురస్కారాలకు అభ్యర్థులను ఎంపిక చేసి వారి పేర్లను అధికారికంగా పంపారు. ఈ రెండుసార్లూ ఎంతో జాగ్రత్తగా పరిశీలించి ఆయా రంగాల్లో అత్యున్నత కృషి చేసిన వారి పేర్లను పంపారు. అందులో ఏ ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయలేదు. ఇది గమనించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో ఆగ్రహించారు. కేంద్రానికి లేఖ రాస్తానని, ఇలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని పలుమార్లు వేదికలపైన ప్రకటించారు. నిజానికి పురస్కారం వచ్చినా, వారెంత పేదరికంలో ఉన్నా, కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే గౌరవ సూచకంగా ఆర్థిక సహకారం అందించి, ఇంటి స్థలం ఇచ్చి సన్మానిస్తుంది. బీజేపీ తదితర పార్టీలకు అనుబంధించిన పద్మ అభ్యర్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించే పెద్ద మనసును ప్రదర్శించింది. ఇటీవల పద్మ పురస్కారాలకు ఎంపిక చేయనివారికి ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చింది. 500 గజాల ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించింది. ఇలా ప్రకటించడం సంతోషమే. కానీ ఎవరికి డబ్బులు అవసరమో వారికి ఇవ్వడం సముచితం.


తెలంగాణ సంస్కృతికి, నాగరికతలకు, కళలకు చెందిన సుమారు ఐదువేల కళాఖండాలను సొంత డబ్బుతో సేకరించిన ఆచార్య జయధీర్ తిరుమలరావుకు కాంగ్రెస్ ఆర్థిక సహాయం అందించకపోగా ఆయన పెద్దగా ఆసక్తి చూపని పద్మ పురస్కారానికి పేరు సిఫారసు చేసి ఆయనకు అవమానాన్నే మిగిల్చారని ప్రజలు భావిస్తున్నారు. అంతేకాదు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెండు పాత క్వార్టర్లలో నెలకొన్న ఆద్యకళా మ్యూజియంలో పని అర్ధాంతరంగా ఆగిపోయింది. పద్మ పురస్కారం వచ్చినా ఆయన సేకరించిన మ్యూజియానికి ఎలాంటి చేయూతా అందదు. కాబట్టి ఇలాంటి వారికి ప్రభుత్వం చేయూత అవసరం. ఆరేళ్ళుగా పెన్షన్ డబ్బులు తప్ప ఎలాంటి ఆర్థిక సహకారం లేకపోవడం వల్ల ఈ కళాఖండాల సంరక్షణ కూడా గగనమవుతున్నది. గద్దర్ ఫౌండేషన్‌కు ప్రకటించినట్లు ఆదిధ్వని ఫౌండేషన్‌కు కూడా ఆర్థిక సహకారాన్ని ప్రకటిస్తే అది తెలంగాణ కీర్తిని దేశవ్యాప్తంగా ఇనుమడింపజేస్తుంది. అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు వస్తుంది.

బద్రి నర్సన్

ఇవి కూడా చదవండి..

వందేమాతరం కొత్త ప్రోటోకాల్.. జనగణమన కంటే ముందే వందేమాతరం ఆలాపన

ఎప్‌స్టీన్‌ను కలిసాను కానీ.. రాహుల్ ఆరోపణలపై హర్దీప్ సింగ్ పూరి

Updated Date - Feb 12 , 2026 | 01:57 AM