Share News

తెలుగులో నాన్‌ఫిక్షన్‌ ఏదీ?

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:08 AM

..హిందూ దేశంలో ఇప్పటికి వచ్చిన గ్రంథాలు చాలా వరకు ఛందోబద్ధమైనవే! కొన్ని గ్రంథాలు వచన రూపంలో ఉన్నా, ఇవి సంస్కృత భాషలో ఉండటం చేత, మిక్కిలి కఠినంగా అనిపిస్తాయి. పండిత...

తెలుగులో నాన్‌ఫిక్షన్‌ ఏదీ?

‘‘...తెలుగులో సృజనాత్మక సాహిత్యముంది విస్తృతంగా. శాస్త్ర సాహిత్యం లేదనే కన్నా ఉండవలసినంతగా లేదని చెప్పవచ్చు.’’

డా. బూదరాజు రాధాకృష్ణ

(2008లో ఒక పుస్తకానికి రాసిన ముందుమాటలో)

‘‘...హిందూ దేశంలో ఇప్పటికి వచ్చిన గ్రంథాలు చాలా వరకు ఛందోబద్ధమైనవే! కొన్ని గ్రంథాలు వచన రూపంలో ఉన్నా, ఇవి సంస్కృత భాషలో ఉండటం చేత, మిక్కిలి కఠినంగా అనిపిస్తాయి. పండిత పామరులందరిచేత చదివించే సాధారణ వచన గ్రంథాలు లేకపోవడం చేతనే హిందూ దేశస్థులకు విద్యలు రావడం కష్టమయిపోతున్నది. విశేషమైన, అత్యావశ్యకమైన అనేక శాస్త్ర గ్రంథాలలో ఉండే విజ్ఞానం వారికి అందకుండా పోతున్నది.’’ – స్వామినేని ముద్దునరసింహంనాయుడు (175 సంవత్సరాల క్రితం రాసిన ‘హితసూచని’ తొలి అధ్యాయం ‘విద్య’లో)

‘‘ఇప్పుడు మనకి వచన వాఙ్మయం చాలా అవసరంగా ఉంది.’’

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

(‘ప్రబుద్ధాంధ్ర’ 1934 జనవరి సంచికలో)

నేడు ప్రపంచవ్యాప్తంగా బెస్ట్‌ సెల్లర్స్‌గా అమ్ముకాలు జరిగే పుస్తకాల్లో చాలా భాగం నాన్‌ఫిక్షన్ మాత్రమే! కానీ తెలుగులో, ముఖ్యంగా సాహిత్య రంగంలో, నాన్‌ఫిక్షన్‌ దాదాపు అందరి దృష్టి నుంచి తప్పుకుంది. దీనికి కారణం ఏమిటో ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, గణితశాస్త్ర పరిశోధకులు డా. పి.వి. అరుణాచలం ఇలా వివరిస్తారు: ‘‘తెలుగు భాష చాలా వరకు సంస్కృత మూలాల నుండి అభివృద్ధి చెందింది. ఈ అనుసరించడం అన్ని రంగాలలో జరుగలేదు. ఎందుకో చారిత్రాత్మకంగా అట్లా జరిగిపోయింది... దీనివల్ల తెలుగు భాష ఎంతగానో నష్టపోయింది.’’ (‘సైన్స్ ఎందుకు రాస్తున్నాం’ సంకలనంలో నుంచి.)

నాన్‌ఫిక్షన్ నుంచి ఫిక్షన్ మౌలిక వస్తువును స్వీకరించాలి; శిల్పపరంగా ఫిక్షన్ నుంచి నాన్‌ఫిక్షన్ నేర్చుకోవాలి! తెలుగులో మొదటిది అధ్వాన్నం అనుకుంటే, రెండోది మరింత అధ్వాన్నం! సమాచారం పంచే మాధ్యమాల నుంచి విద్యార్థులు రాసే సమాధాన పత్రాలు దాకా ఇలా అన్నీ వచనం లోనే ఉంటాయి. కానీ ఇంత తరచుగా వాడే వచనం ఎందుకిలా అయ్యిందని ఆ వచనాన్ని విరివిగా వినియోగించేవారు కూడా ఆలోచించరు!


అదే సమయంలో గొప్పగా రాణించిన ప్రతి రచయితా చక్కని చదువరి అని సులువుగా తెలుసుకోవచ్చు. ఆ మధ్య గురజాడ అప్పారావు సేకరించిన, పోయినవి పోగా చివరన మిగిలిన గ్రంథాల జాబితాను చిన్న పుస్తకంగా ప్రకటించారు. ఆ పుస్తకాల చిట్టా చూస్తే గురజాడ వారి అధ్యయనం ఎంత విస్తృతమో బోధపడుతుంది. తాపీధర్మారావు, శ్రీశ్రీ, కుటుంబరావు, పాలగుమ్మి పద్మరాజు, ఆరుద్ర, బుచ్చిబాబు, గోపీచంద్ వంటి రచయితల వచన సాహిత్యాన్ని విశేషంగా గమనించాలి. ఇపుడు ఈ పరిశీలనా, అధ్యయనం తగ్గిపోయాయి. మన మేధో ట్యాంకులు నింపుకోకపోతే రేపు ఉత్పత్తి అయ్యే సాహిత్యం డొల్ల కాక తప్పదు! ఇది సోషల్ మీడియా గురించి చేస్తున్న వ్యాఖ్య కాదు. మెయిన్ స్ట్రీమ్‌లో రెగ్యులర్‌గా, విరివిగా రాస్తున్న రచయితలను కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తున్న వ్యాఖ్య! ‘గేమ్ చేంజ్‌’ ఐతే తప్ప తెలుగు ప్రపంచ వేదిక ముందు భాసించే అవకాశం లేదు! చాలా స్థాయిల్లో ఇందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలి.

నాగసూరి వేణుగోపాల్

94407 32392

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..

సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు

Read Latest Telangana News And AP News

Updated Date - Feb 09 , 2026 | 02:08 AM