ఎదిగిన వారికి రిజర్వేషన్ ఎందుకు?
ABN , Publish Date - May 26 , 2026 | 02:55 AM
ఒక వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి తన స్వయం ప్రతిభతో సివిల్ సర్వీసెస్ సాధించినప్పుడు ఆ కుటుంబం దేశంలోనే అత్యున్నత సామాజిక, ఆర్థిక స్థాయికి చేరుకుంటుంది. వారి పిల్లలకు...
ఒక వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి తన స్వయం ప్రతిభతో సివిల్ సర్వీసెస్ సాధించినప్పుడు ఆ కుటుంబం దేశంలోనే అత్యున్నత సామాజిక, ఆర్థిక స్థాయికి చేరుకుంటుంది. వారి పిల్లలకు నగరాల్లోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కార్పొరేట్ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి విద్య అందుతుంది. ఈ సదుపాయాల మధ్య పెరిగిన వారి పిల్లల జీవనశైలి... మారుమూల గ్రామంలో సరైన కరెంట్, పాఠశాల, ఆర్థిక స్థోమత లేని ఒక సాధారణ పేద విద్యార్థి జీవనశైలి ఒక్కటే ఎలా అవుతుంది? ఇంతటి సామాజిక, ఆర్థిక వ్యత్యాసం స్పష్టంగా ఉన్నప్పుడు, మళ్లీ ఆ అధికారి పిల్లలు అదే రిజర్వేషన్ కోటా కింద పోటీపడటం ఏ రకమైన న్యాయం అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం సమర్థనీయం, సమాజానికి అవసరం. రిజర్వేషన్ల వ్యవస్థలో ‘క్రీమీలేయర్’ను ప్రవేశపెట్టడంలోని ముఖ్య ఉద్దేశం ఇదే. ఒక వర్గంలో బాగా స్థిరపడిన వారిని మినహాయించి, ఆ వర్గంలోని అసలైన పేదలకు అవకాశాలు ఇవ్వాలనేది దీని ప్రధాన లక్ష్యం. కానీ నేడు ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు, రాజకీయ నాయకులు తమ పిల్లలకు కూడా అదే కోటాను వర్తింపజేస్తూ సమాజంలో ఒక కొత్త సంపన్న అలిగార్కీ (కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం కావడం)ని సృష్టిస్తున్నారు. కాగా, అదే వర్గంలోని కోట్లాది మంది గ్రామీణ పేదలు, కూలీలు ఇంకా అట్టడుగు స్థానంలో మగ్గిపోతున్నారు.
రిజర్వేషన్లు వారసత్వ హక్కు కాదు. అవి సమాజంలోని అసమానతలను తొలగించడానికి రాజ్యాంగం ఇచ్చిన ఒక తాత్కాలిక చికిత్స. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు రిజర్వేషన్ల వ్యవస్థను బలహీనపరచేవి కావు, దాన్ని మరింత పటిష్టం చేసి అసలైన అర్హులకు చేర్చడానికి ఉద్దేశించినవి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలు మాని, సుప్రీంకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకుని, స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలి.
వెంకగారి భూమయ్య
ఈ వార్తలనూ చదవండి:
రాష్టప్రతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం
కశ్మీర్ గుల్మార్గ్‌లో ఆగిన కేబుల్ కార్లు.. గాల్లోనే 300 మంది.. వీడియో వైరల్