సంక్షోభానికి కారణం ఎవరు?
ABN , Publish Date - Jun 10 , 2026 | 02:14 AM
డాక్టర్ జయప్రకాశ్ నారాయణ మే 28న ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసానికి ఒక సామాన్యుడిగా నా స్పందన ఇది. ప్రజలకు పొదుపు చేయడానికి అందుబాటులో ఉన్నవి ప్రముఖంగా బ్యాంకులు. ప్రభుత్వ విధానాలే...
డాక్టర్ జయప్రకాశ్ నారాయణ మే 28న ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసానికి ఒక సామాన్యుడిగా నా స్పందన ఇది. ప్రజలకు పొదుపు చేయడానికి అందుబాటులో ఉన్నవి ప్రముఖంగా బ్యాంకులు. ప్రభుత్వ విధానాలే సామాన్య ప్రజలను బ్యాంకులకు దూరం చేశాయి. వీటిలో పొదుపు చేయడానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహమూ లేదు. పైగా ఆదాయపన్నుల భయం.
ప్రజలను భయాందోళనలకు గురి చేసే Financial Resolution and Deposit Insurance Bill (FRDI) అనే చట్టాన్ని 2017లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులోని బెయిల్–ఇన్ క్లాజ్‌లో సెక్షన్ 52 ప్రకారం ఒక బ్యాంకు దివాళా తీసే పరిస్థితి వస్తే Resolution Corporation అనే కొత్త సంస్థ ఆ బ్యాంకును కాపాడడానికి మీ డిపాజిట్ డబ్బును వాడుకోవచ్చు. అంటే– మీ డిపాజిట్లు, సేవింగ్స్ డబ్బును షేర్లుగా మార్చడం. తద్వారా మీకు డబ్బు బదులు షేర్లు ఇస్తామనడం; లేదా ఇప్పుడు డబ్బు ఇవ్వం, ఐదేళ్ల తరువాత ఇస్తామని వాయిదా వేయడం; లేదా డిపాజిట్‌లో కోత విధించడం... మీ అకౌంట్లో పది లక్షలు ఉన్నా రెండు లక్షలు మాత్రమే సేఫ్. మిగతాది పోయినట్టే లేదా వాయిదాలలో ఇస్తాం అనే అధికారం ఈ చట్టం కల్పిస్తుంది. ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లును దేశవ్యాప్తంగా బ్యాంక్ యూనియన్లు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘మా కష్టార్జితం బ్యాంకులకు దోచిపెడతారా’ అని చేసిన ఆందోళనల ఫలితంగా 2018 జూలైలో ప్రభుత్వం దానిని ఉపసంహరించుకుంది.
సామాన్య ప్రజలకు కావలసిందల్లా వారి పొదుపునకు అదనంగా కొంత వడ్డీతో తిరిగి పొందే విశ్వాసం. ప్రభుత్వం పొదుపును ప్రోత్సహించేందుకు ఆదాయపు పన్ను చెల్లింపులో మినహాయింపులు ఇవ్వాలి. ఇప్పుడు లభిస్తున్న సెక్షన్ 80TTBలో పది వేలు వడ్డీగా పొందిన ఆదాయ పరిమితిని ఇరవై వేలకు పెంచాలి. ప్రజలకు పెట్టుబడి పెట్టుకోవడానికి లిక్విడిటీ ఉన్న వనరు బంగారం మాత్రమే. సావరిన్ గోల్డ్‌బాండ్ వంటివి మళ్లీ ప్రవేశపెట్టాలి. బంగారం రేటుతో ముడిపెట్టకుండా ప్రస్తుతం ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ కంటే ఒకటి, రెండు శాతం ఎక్కువ వడ్డీ చెల్లించాలి. బాండ్స్‌కు కనీసం మూడు సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ పెట్టాలి. పెట్టుబడి పైన లభించిన వడ్డీ మీద ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యం ఈ బాండ్లపై పూర్తి మొత్తానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి.
ఎఫ్‌ఆర్‌డీఐ లాంటి చట్టాలు వచ్చినప్పుడు జయప్రకాశ్ నారాయణ వంటి మేధావులు ప్రభుత్వాలను హెచ్చరించి ఉంటే బాగుండేది. కార్పొరేట్లకు లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసే ప్రభుత్వాలు, సామాన్య ప్రజలు తమ కష్టాన్ని బ్యాంకుల్లో దాచుకుంటే వారి పొదుపునకు అదనంగా కొంత మొత్తం చెల్లించడానికి ఎందుకు ముందుకు రావడం లేదు. బ్యాంకులపై నమ్మకం సన్నగిల్లిపోవడంతోనే సామాన్యులు బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. బంగారం ఎప్పుడైనా, ఎక్కడైనా కొనవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం, వైద్య చికిత్సల కోసం దాచుకున్న బంగారాన్ని అమ్ముకొని ప్రాణాలు కాపాడుకున్న సంఘటనలెన్నో ఉన్నాయి. అలాగే పిల్లల చదువుల కోసం అత్యవసర పరిస్థితుల్లో బంగారాన్ని ఉపయోగించుకున్నవారు ఎందరో ఉన్నారు. బంగారం అమ్ముకోవడం వల్ల అప్పులు చేయనవసరం లేదు, వడ్డీలు కట్టనవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో సామాన్యులను ఆదుకొనే పొదుపు బంగారం మాత్రమే. దీర్ఘకాలిక లక్ష్యాలు లేని ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు తమకు సౌలభ్యంగా ఉండే పద్ధతులను పాటిస్తారు.
పోనీ మళ్లీ ఎఫ్‌ఆర్‌డీఐ వంటి చట్టాలు చేయరని ప్రజలకు నమ్మకం ఏమిటి? ప్రజలకు పొదుపు అలవాటు కల్పించి, వారిని ఆర్థికంగా బలవంతులను చేసి, దేశ ఆర్థిక పునాదులు పటిష్ఠపరచడంలో వారిని భాగస్వాములను చేయాలి. బడుగు ప్రజల వద్ద ఉండేది ఒకటో రెండో తులాల బంగారం మాత్రమే. మధ్య తరగతి వద్ద మహా అయితే ఐదు, పది తులాల బంగారం ఉండవచ్చు. అవినీతి నాయకులు, అధికారుల వద్ద లభించే క్వింటాళ్ల కొద్దీ బంగారాన్ని ఎలా వెలికితీయాలో మేధావులు సూచనలు చేస్తే బాగుండేది. అలాగే మత సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేస్తే బాగుండేది. అంతేకానీ సామాన్యులు బంగారంపై పెట్టుబడి పెట్టడాన్ని నేరంలా చూస్తే ఎలా?
యాచం నాగభూషణం
ఎల్‌ఐసీ అభివృద్ధి అధికారి (రి)
ఇవి కూడా చదవండి..
విజయ్ కీలక నిర్ణయం.. మహిళల భద్రత కోసం సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్
సంతకాల ఫోర్జరీ కేసు.. మమతా బెనర్జీ కార్యాలయానికి సీఐడీ టీమ్