Share News

వైద్యం ఎందుకంత ఖరీదు?

ABN , Publish Date - Jul 01 , 2026 | 03:19 AM

దేశంలో నేడు వైద్యం చాలా ఖరీదైపోయింది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు మాత్రం బహు భారంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యరంగం– సేవా రంగమా, వ్యాపార రంగమా అని తేల్చి చెప్పడం లేదు...

వైద్యం ఎందుకంత ఖరీదు?

దేశంలో నేడు వైద్యం చాలా ఖరీదైపోయింది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు మాత్రం బహు భారంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యరంగం– సేవా రంగమా, వ్యాపార రంగమా అని తేల్చి చెప్పడం లేదు. సందర్భానుసారంగా ఆయా రంగాలను వాడుకుంటున్నారు. ఆరోగ్యరంగం, దాని ఆధారిత రంగాలైన ఫార్మా, ఇంజక్షన్లు సూదుల దగ్గర నుంచి నేటి అత్యాధునిక ఎంఆర్‌ఐ స్కాన్‌ వంటి యంత్రాల వరకు... కాటన్ స్వాబ్ నుంచి, కట్లు కట్టే గాజువస్త్రం వరకు జీఎస్టీలతో కలిపి చాలా ఖరీదు అవుతున్నాయి. గతంలో మందులపై జీఎస్టీ ఐదు శాతం మాత్రమే ఉండేది. మోదీ ప్రభుత్వం దానిని 12 శాతానికి పెంచి, ఇప్పుడు మళ్లీ ఐదు శాతానికి తగ్గించింది. సూదులు, సిరంజిలు, డయాగ్నోస్టిక్ కిట్స్, దూది మొదలైన వాటిపై 12 నుంచి 18శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.

గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య కళాశాలలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో వైద్య కళాశాలలు పెరిగిపోయాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఫీజు ఆయా రాష్ట్రాలలో సంవత్సరానికి 15 నుంచి 20 వేల వరకు ఉంటే, ప్రైవేటు వైద్య కళాశాలలో కన్వీనర్ కోటాలో అన్ని ఫీజులు కలిపి లక్షకు పైగానే వసూలు చేస్తున్నారు. ఇక బి–కేటగిరీ సీట్లకు ఫీజులు లక్షల్లో ఉంటే, ఎన్నారై సీట్లుకు కోట్లలో ఫీజులు ఉంటున్నాయి. ప్రభుత్వ కళాశాలలో సీట్లు పొందినవారు సరే, లక్షలకు లక్షలు కట్టి చదివినవారు మళ్లీ వృత్తిలో ఆ డబ్బు సంపాదించుకోవాలనుకోరా? అప్పుడు వైద్యం ఖరీదుగాక ఏమవుతుంది? ప్రభుత్వమే ఈ విషయమై ఆలోచించాలి.

ప్రైవేట్ వైద్య కళాశాలల నిర్వహణ అంత తేలిక కాదు. ప్రైవేటు వైద్య కళాశాలలో అవసరమైనంత మంది ఆచార్యులు దొరకటం లేదు. ఒకవేళ దొరికినా, వారు ఎంతకాలం ఆ కాలేజీలో కచ్చితంగా పనిచేస్తారో తెలియదు. ఇక విద్యార్థుల పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. వైద్య విద్యలో ప్రవేశించే వారిలో వైద్యుల, వైద్య అనుబంధ రంగంలో పనిచేస్తున్న వారి పిల్లలు అధికంగా ఉంటున్నారు. వారిలో అధికులు దండిగా డబ్బులు కలిగినవారే. వైద్య విద్యార్థులు, ఆచార్యుల మధ్య గురు–శిష్య సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. గతంలో ఎంబీబీఎస్‌లో 30శాతం విజయం సాధిస్తే గొప్ప. ఇప్పుడు నూటికి 99శాతం ఉత్తీర్ణత సాధించే రోజులు వచ్చేశాయంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.


ఏ వైద్యుడయినా 10 సంవత్సరాలు బాగా ప్రాక్టీస్ చేయగలుగుతారు. అందులో ఐదు సంవత్సరాలు ఆయా విభాగాలు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పడుతుంది. మంచి ప్రాక్టీస్ ఉండేది ఐదు సంవత్సరాలు మాత్రమే. ఈ కాలంలోనే చదువుకు అయిన ఖర్చు, హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి అయిన ఖర్చు, పరికరాలకు అయిన ఖర్చు సంపాదించుకోవాలనుకుంటున్నారు. కాబట్టే ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా సంపాదించుకుంటున్నారు. ప్రభుత్వం వైద్య రంగంపై చేస్తున్న వ్యాపారాలు అన్నీ ఇన్నీ కావు. మొత్తం 17 నుంచి 20 రకాల పన్నులు ముక్కు పిండి, వైద్యుల నుంచి వసూలు చేస్తున్నది.

వైద్యులకు కరెంటు కమర్షియల్. పారిశ్రామికవేత్తలకు అనేక రాయితీలు ఉంటాయి, కానీ వైద్యులకు, హాస్పిటల్స్‌కు ఏ రాయితీలూ ఉండవు. మున్సిపల్ టాక్స్ కమర్షియల్. పేషెంట్ రూమ్స్, ఐసీయూ బెడ్స్‌ లగ్జరీ టాక్స్, చెత్త పన్ను, బయోమెడికల్ వేస్ట్ పన్ను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పన్ను, వాటితో పాటు అగ్నిమాపక విభాగం నుంచి ఎన్వోసీ రావాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. వీటికి తోడు అనధికార ఆర్థిక లావాదేవీలు తప్పనిసరి అవుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు, లేబర్ ఫీజు, భవిష్యనిధి, సిబ్బంది జీతభత్యాలు... వెరసి ఆసుపత్రుల నిర్వహణ బహుభారం అయిపోయింది. అందువల్లనే చిన్న చిన్న ఆసుపత్రులు పోయి, నేడు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చేస్తున్నాయి. ఇక్కడ సామాన్యులకు వైద్యం చాలా భారం అయిపోతుంది. ఫ్యామిలీ డాక్టర్లలాగా పరీక్షలు లేకుండా, వ్యాధిని కచ్చితంగా నిర్ధారించకుండా వైద్యం చేయటం వైద్యశాస్త్రపరంగా సాధ్యం కాదు. అందుకు అనుమానిత వ్యాధులన్నిటికీ పరీక్షలు తప్పనిసరి అవుతాయి. ఇటీవల కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వెల్‌నెస్, ఫ్యామిలీ ఫిజిషియన్ క్లినిక్‌ల వల్ల కాస్త పేద ప్రజలకు లాభం చేకూర్చవచ్చు. వైద్యం ప్రతి ఒక్కరికీ అనివార్యం. దాన్ని సాధ్యమైనంత వరకు పేదలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

l డాక్టర్ టి. సేవకుమార్

నేషనల్ కౌన్సిల్ మెంబర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్

(నేడు జాతీయ వైద్యుల దినోత్సవం)

Also Read:

టీమిండియా నిష్క్రమించినా.. అగ్రస్థానంలోనే శ్రీ చరణి

డెలివరీ బాయ్‌తో వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్

Updated Date - Jul 01 , 2026 | 03:19 AM