కేశవరావు జాదవ్‌కు తగిన గుర్తింపు ఎప్పుడు?
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:22 AM
తెలంగాణ ఉద్యమ చరిత్రలో రాజకీయ నాయకుల పాత్ర ఎంత ముఖ్యమో, మేధావుల పాత్ర కూడా అంతే కీలకం. ఉద్యమానికి సిద్ధాంత బలం, మేధో దిశ, చారిత్రక న్యాయబద్ధతను అందించిన అరుదైన వ్యక్తుల్లో ప్రొఫెసర్ కేశవరావు...
తెలంగాణ ఉద్యమ చరిత్రలో రాజకీయ నాయకుల పాత్ర ఎంత ముఖ్యమో, మేధావుల పాత్ర కూడా అంతే కీలకం. ఉద్యమానికి సిద్ధాంత బలం, మేధో దిశ, చారిత్రక న్యాయబద్ధతను అందించిన అరుదైన వ్యక్తుల్లో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఒకరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం దాటినా, ఉద్యమానికి మేధో పునాది వేసిన జాదవ్ వంటి వ్యక్తులకు అధికారిక గుర్తింపు తగిన స్థాయిలో లభించకపోవడం గమనార్హం.
జాదవ్ కేవలం అధ్యాపకుడు కాదు... ప్రజా మేధావి, సోషలిస్టు ఆలోచనాపరుడు, రచయిత, సంపాదకుడు, మానవ హక్కుల కార్యకర్త. అధికారానికి దూరంగా ఉంటూ ప్రజల పక్షాన నిలబడిన ఆయన జీవితం విలువలకు ప్రతీక. ఆయన సంపాదకత్వంలో వచ్చిన “Mankind”, “Jan”, “New Mankind”, “Olympus” పత్రికలు సామాజిక చైతన్య వేదికలుగా నిలిచాయి. అసమానతలు, ప్రజాస్వామ్య సమస్యలు, మానవ హక్కుల అంశాలపై ఆయన నిరంతరం మేధో చర్చలు చేసేవారు. డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా ప్రభావంతో సోషలిస్టు ఉద్యమాలతో ఆయన అనుబంధం కొనసాగింది. సోషలిస్టు పార్టీ, సోషలిస్టు యువజన సభ, సమాజవాది జన పరిషత్ వంటి వేదికలతో ఆయన పనిచేశారు. సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం ఆయన ఆలోచనలకు కేంద్ర బిందువు. 1969 ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని సిద్ధాంతపరంగా బలపరిచిన మేధావుల్లో ఆయన ముందు వరుసలో ఉన్నారు. భావోద్వేగానికి బదులుగా చారిత్రక, రాజ్యాంగ, ఆర్థిక కోణాల్లో తెలంగాణ అంశాన్ని విశ్లేషించారు. ఉద్యమ సమన్వయానికి ఆయన తెలంగాణ జనపరిషత్‌ను స్థాపించి కీలకపాత్ర పోషించారు. తరువాత తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడిగా వివిధ తెలంగాణ శక్తులను ఒకే వేదిక పైకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వం–మావోయిస్టుల చర్చల సమయంలో మధ్యవర్తిగా వ్యవహరించి సంభాషణ ద్వారానే పరిష్కారాలు సాధ్యమని విశ్వసించారు. ప్రజాస్వామ్యంలో చర్చకు వేదిక ఉండాలన్నది ఆయన దృక్పథం. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్‌తో అనుబంధం ద్వారా మానవహక్కుల పరిరక్షణలో కూడా చురుకైన పాత్ర పోషించారు.
ఆయన జీవితం అత్యంత సరళమైనది. పదవులు, వ్యక్తిగత లాభాలు ఆయన లక్ష్యం కాలేదు. విలువలు, నిబద్ధత, నిజాయితీ ఆయన జీవితాన్ని నడిపించాయి. తెలంగాణ ఉద్యమానికి మేధో దిశనిచ్చిన ఇలాంటి వ్యక్తులకు పాఠ్యపుస్తకాల్లో, అధికారిక చరిత్రలో తగిన స్థానం లభించకపోవడం శోచనీయం. చరిత్రను రాసేటప్పుడు కేవలం రాజకీయ నాయకులకే పరిమితం చేయడం సరైన విధానం కాదు. కేశవరావు జాదవ్‌ను స్మరించడం అంటే తెలంగాణ ఉద్యమానికి మేధో బలం అందించిన విలువలను స్మరించడం. ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వడం ఒక వ్యక్తికి నివాళి మాత్రమే కాదు, తెలంగాణ చరిత్రను సమగ్రంగా అర్థం చేసుకునే ప్రయత్నం.
సయ్యద్ రఫీ
(నేడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ వర్ధంతి)
ఇవీ చదవండి:
పైలట్ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!
టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!