Why Do Rivers Speak to Me: ఈ నదులెందుకిలా మాట్లాడతాయి
ABN , Publish Date - Jan 05 , 2026 | 02:27 AM
ఇక్కడెక్కడో ఇన్ని వందల మైళ్ళ దూరంలో కూర్చుని ఉంటే గంగ కళ్ళలో మెదుల్తుంది ఒక్కసారి వచ్చి చూసిపో అని అచ్చం అమ్మ...
ఇక్కడెక్కడో ఇన్ని వందల మైళ్ళ దూరంలో
కూర్చుని ఉంటే
గంగ కళ్ళలో మెదుల్తుంది
ఒక్కసారి వచ్చి చూసిపో
అని అచ్చం అమ్మ అడిగినట్లే
అడుగుతుంది
మూగగా అగమ్యంగా
మనసు కొట్టుకుంటున్నపుడు
‘‘దిగులెందుకు!
ఇలా నా ఒడిలోకి రా’’ అంటూ
నర్మద మృదువుగా పిలుస్తుంది
కొండంత దుఃఖాన్ని
బింకంగా కళ్ళవెనుక
దాచుకుంటున్నపుడు
తనపక్కన నిలబడి కేరింతలు
కొట్టిన పసిపిల్లని
కృష్ణ గుర్తు చేస్తుంది
అంత బింకమూ సడలిపోయి
ఉధృతంగా కన్నీళ్ళు ఉబికి వస్తే
అయ్యో నా తల్లీ
అంటూ బాసర గోదావరి
గుండెల్లో పొదువుకుంటుంది
మథుర నుంచి యమున
చేయి సాచి
చుబుకమందుకుంటుంది
తుంగానది శారదాంబ
ముచ్చట్లు చెప్పబోతుంది
అమ్మా అమ్మా అమ్మా
అంటూ మనసు వేయిగొంతులతో
పిలుస్తుంటే
గంగా గోదారీ కావేరీ
కదిలిపోయి నన్ను చూడడం
పరుగు పరుగున వచ్చి పక్కన నిలబడడం
స్పష్టంగా తెలుస్తుంది
కరుణాసముద్రుని కూతుళ్ళు
అన్నది కారణమే కాకపోతే
కన్నతల్లి కన్నా ఎక్కువగా ఇవి
ఎందుకిలా కనులలో మెదుల్తాయి!
ఎవరికీ ఏమీ కాని
నన్నెందుకిలా పొదువుకుంటాయి!
ఈ నదులెందుకిలా నాతో మాట్లాడతాయి!!
టి. శ్రీవల్లీ రాధిక
ఇవీ చదవండి: