Share News

ప్రజల మనసు కమ్యూనిస్టులకు తెలియదు!

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:11 AM

స్వాతంత్ర్యోద్యమ కాలంలో గాంధీజీ ‘ఒకే భారతదేశం’ అనే జాతీయ భావనను ప్రజల్లో రగిలించి, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడేలా వారిని పురిగొల్పారు. సామ్యవాదులు, కమ్యూనిస్టులు...

ప్రజల మనసు కమ్యూనిస్టులకు తెలియదు!

స్వాతంత్ర్యోద్యమ కాలంలో గాంధీజీ ‘ఒకే భారతదేశం’ అనే జాతీయ భావనను ప్రజల్లో రగిలించి, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడేలా వారిని పురిగొల్పారు. సామ్యవాదులు, కమ్యూనిస్టులు సహా వివిధ రాజకీయ శక్తులను ఏకతాటిపైకి తెచ్చి, ఎన్నికల ఆధారిత ప్రజాస్వామ్యానికి నెహ్రూ నాంది పలికారు.

కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన జాతీయ భావనతో కమ్యూనిస్టులు విభేదించారు. గాంధేయ జాతీయవాదానికి, నెహ్రూ అనుసరించిన వ్యూహానికి ప్రత్యామ్నాయం రూపొందించడం ఎం.ఎన్.రాయ్, ఎస్.ఏ. డాంగే, పి.సి.జోషి, ఆర్.పి.దత్‌లకు కష్టసాధ్యమైంది. ఒకవైపు జాతీయవాదం క్రమంగా బలపడుతున్న తరుణంలో, దానికి ప్రత్యామ్నాయంగా రైతు– కార్మిక రాజకీయాలను కమ్యూనిస్టులు ప్రతిపాదించారు. కాంగ్రెస్ పాలన మొదలైన వెంటనే, నెహ్రూ ప్రభుత్వాన్ని కూలదోయాలని వారు ఉవ్విళ్లూరారు. పశ్చిమ యూరప్, రష్యా అనుభవాల ప్రభావంతో దేశంలో నెహ్రూ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని చేపట్టి, రాజులను తన పాలనలో భాగస్వాములుగా చేసుకున్నారు. అనంతరం భూ సంస్కరణల కమిషన్‌ను ఏర్పాటు చేసి, రైతు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. తత్ఫలితంగా, జమీందార్లు, భూస్వాముల స్థానంలో రైతులు భూ యజమానులయ్యారు. వారు పంటలు పండించి అమ్మడంతో వ్యవసాయం కొత్త దశలోకి మళ్లింది. అదే ఆధునిక ఆర్థిక వ్యవస్థకు పునాది అయింది. ‘దున్నే వాడిదే భూమి’ అనే కమ్యూనిస్టుల ప్రాథమిక నినాదాన్ని నెహ్రూ తమ పాలనలో ఆచరిస్తూ, ఆ పార్టీని బలహీనపరిచారు.


కమ్యూనిస్టులు ఈ ధోరణులను అర్థం చేసుకున్నారా? లేదు. నిజానికి, నెహ్రూ అమలు చేసిన వ్యవసాయ విధానానికి ప్రత్యామ్నాయంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టుల మీద ఉంది. కానీ వారు అలా చేయలేదు. అంతేకాదు, శూద్రుల్లోని ఉన్నత రైతు వర్గం కాంగ్రెస్‌లో భాగమవుతున్నప్పుడు, కమ్యూనిస్టులు కనీసం ఆ వర్గంలోని కింది కులాలనైనా తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాల్సింది. అదీ చేయలేదు. కమ్యూనిస్టులు ప్రధానంగా రైతు కులాల నుంచి వచ్చినవారు కావడంతో రైతు ప్రయోజనాలు దాటి, వ్యవసాయ కూలీ– దళిత రాజకీయ దృష్టిని అభివృద్ధి చేసుకోలేకపోయారు. చట్టాల ద్వారా ఎప్పుడో అమలైన వ్యవసాయ విప్లవాన్నే (ఇప్పటికీ జరగలేదన్నట్లుగా) కమ్యూనిస్టు పార్టీలన్నీ ఇంకా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి! భూ సంస్కరణలతో బలపడిన రైతు కులాలు, అనంతర కాలంలో సొంత ప్రాంతీయ పార్టీలను స్థాపించి రాజకీయ శక్తులుగా ఎదిగాయి. ఈ దశలో ఇందిరాగాంధీ, రైతు రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా దళితులను, క్రింది కులాల అజెండాను ముందుకు తెచ్చారు. దాంతో కమ్యూనిస్టులకు స్పష్టమైన రాజకీయ అజెండా మిగలకుండా పోయింది. వ్యవసాయ పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఏర్పడిన రైతు కూలీ, దిగువ కులాల ఐక్యతను వారు ఇప్పటికీ గుర్తించలేదు!

నా ఉద్దేశం ప్రకారం, భారతీయ సమాజంలో వచ్చిన చైతన్యాన్ని కమ్యూనిస్టులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఈ దేశంలో కులవ్యవస్థే ప్రధాన పాత్ర పోషిస్తున్నదన్నది నిజం. గతంలో బ్రిటిషర్ల వలస పాలన, స్వాతంత్ర్యానంతరం ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా కులాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడినవే. పెట్టుబడిదారీ వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి శూద్రులే వెన్నెముకగా నిలిచారు. ఇక, కమ్యూనిస్టులకు ప్రత్యామ్నాయం– దిగువ కులాల ఆధారంతో సామాజిక న్యాయం ప్రాతిపదికన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం. ఇక్కడే అసలు సమస్య. భారతదేశంలో రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణం... వీటన్నింటినీ నిర్ణయించే ప్రధాన అంశం ‘కులమే’ అయినప్పటికీ, ఆ పదాన్ని తమ విధానాల్లో ఉపయోగించడానికి కమ్యూనిస్టులు సంకోచించారు. కుల వాస్తవికతను అర్థం చేసుకోవడంలో వారు విఫలమయ్యారు. క్రమంగా వామపక్ష పార్టీల్లో చీలికలు మొదలై, ఆ పార్టీలు మరింతగా బలహీనపడ్డాయి.


1940–50 దశకంలో ప్రభుత్వాన్ని నడపడానికి లౌకిక– మతవాద రాజకీయాలు నెహ్రూకు రాజకీయ అవసరంగా మారాయి. దేశ విభజన సమయంలో అల్లర్లకు కారణమైన హిందుత్వ శక్తులను నెహ్రూ తన మతతత్వ వ్యతిరేక విధానం ద్వారా ఒంటరిని చేశారు. తొలుత హిందూ మహాసభ, అనంతర కాలంలో జనసంఘ్ అభివృద్ధి చేసిన హిందూ ఆధిపత్య రాజకీయాలను పక్కకు నెట్టి, మతభేదం లేకుండా అందరికీ ప్రజాస్వామ్య పాలనను అందించడానికి ఆయన కృషి చేశారు. దీంతో కమ్యూనిస్టులు సైతం సెక్యులరిజానికి మౌన అనుచరులుగా మారాల్సి వచ్చింది. ప్రారంభంలో రణదివే, రాజేశ్వరరావు లాంటి ప్రముఖ కమ్యూనిస్టు నేతలు నెహ్రూ విధానాలను గుడ్డిగా వ్యతిరేకించారు. కానీ నెహ్రూ రాజకీయాలకు దీటుగా తమ రాజకీయ విధానాలను రూపొందించుకోవడంలో విఫలమయ్యారు. దీంతో క్రమంగా వారు కూడా నెహ్రూవియన్ కమ్యూనిస్టులుగా మారిపోయారు! ఎమర్జెనీ కాలంలో హిందుత్వ రాజకీయ అజెండా మళ్లీ తెరపైకి వచ్చింది. జనసంఘ్‌ అనంతర కాలంలో బీజేపీగా మారి మతవాద రాజకీయాలను ముందుకు తెచ్చింది. అప్పటికే ఏర్పడిన రాజకీయ శూన్యతను క్రమంగా తనకనుకూలంగా మలుచుకుంటూ 2014లో అధికారాన్ని చేజిక్కించుకుంది.

ప్రజలకు మతం ఒక విశ్వాసం. కానీ మతతత్వవాదం అనేది పక్కాగా రాజకీయం. ప్రజలకు ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. ప్రజల మనస్తత్వాన్ని కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాలి. నేటికీ భారతీయులు తమ పండుగలతో పాటు పెళ్లిళ్లు, చావులకు సంబంధించిన తంతులన్నింటినీ వారి మతాచారాల ప్రకారంగానే జరుపుకుంటున్నారు. అయినప్పటికీ ప్రజలు స్వభావరీత్యా మతవాదులు కారు. వారు బీజేపీకి ఓటు వేయడానికి హిందూత్వం ఎంతమాత్రం కారణం కాదు. ప్రజల దృష్టిలో మతమనేది మోక్ష సాధనం మాత్రమేగానీ రాజకీయ సాధనం ఏమాత్రం కాదు. నిజానికి దేశంలో సరళీకరణ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయింది. ఈ అవినీతి, కుల రాజకీయాలపై ప్రజలు విరక్తి చెందారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ అంశాలే దోహదం చేశాయి.‌ ఈ క్రమంలో కాంగ్రెస్‌ తన పరువును కాపాడుకోవడానికి మతతత్వవాదం అనే ఎత్తుగడను తెరపైకి తెచ్చింది. అయితే, ఈ రాజకీయ మార్పును కూడా కమ్యూనిస్టులు అర్థం చేసుకోలేకపోయారు.


హిందుత్వ నినాదం నగరాల్లో మాత్రమే ప్రభావం చూపగలదని బీజేపీకి తెలుసు. అందుకే, ప్రాంతీయ రాజకీయాల్లో మతపరమైన అంశాల కంటే ఇతర అంశాలపైనే వారు అధిక దృష్టి పెట్టారు. నేడు వీలైనంతగా తటస్థ రాజకీయాలను అవలంబిస్తూ, ముస్లింల మద్దతు కోసమూ ప్రయత్నిస్తున్నారు. ఇక, తెలంగాణలో ఏ ధోరణిని అనుసరించాలో బీజేపీకి ప్రస్తుతం అర్థం కాకుండా ఉంది. ఇప్పటికే రాజకీయంగా అభివృద్ధి చెందిన రెడ్డి సామాజికవర్గాన్ని ఆధారంగా చేసుకుని పార్టీని నిర్మించాలా, లేక ఎగిసిపడుతున్న బీసీ అజెండాను తలకెత్తుకోవాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉంది. ఏదేమైనా రాష్ట్ర కమలదళం హిందుత్వ అజెండాను మాత్రం తెరపైకి తీసుకురావాలనుకోవడం లేదు. అలాంటి మతవాదాన్ని ప్రజలు ఆదరించరని బీజేపీకి తెలుసు. అందుకే కాంగ్రెస్ కూడా ప్రస్తుతం సామాజిక న్యాయం అనే అజెండాను అనుసరిస్తోంది.

ఇటీవల ఖమ్మంలో‌ నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల వేడుకల్లో వామపక్ష నేతలు మాట్లా డుతూ, బీజేపీ హిందుత్వ వాదానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.‌ కానీ ప్రజల మనసులో ఏముందో మాత్రం వారు గుర్తించడం లేదు. రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర కావాలని కోరుకుంటున్నారు. కానీ రైతు, కార్మిక సమస్యలపై కూడా కమ్యూనిస్టులు దృష్టి సారించడం లేదు. పట్టణ‌ కార్మికవర్గం ఇప్పటికే పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగమైంది.


ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల్లో వచ్చిన రాజకీయ చైతన్యం నేడు పాలక పార్టీలను కుదిపేస్తోంది. అందుకే ఆయా వర్గాల నాయకులను తమ పార్టీల్లోకి లాక్కోవడానికి పాలకులు ప్రయత్నిస్తున్నారు. నేడు పార్టీలకు అత్యంత అనుకూలమైన అజెండా సామాజిక న్యాయమే. ప్రజా నేతలమని చెప్పుకునే కమ్యూనిస్టులు, ఓటు బ్యాంకు రాజకీయాల్లో కులం ఎంత ప్రధాన అంశమో అర్థం చేసుకోలేకపోయారు. తత్ఫలితంగా, పార్టీకి కట్టుబడి ఉండే క్రింది కులాల కార్యకర్తలు సైతం క్రమంగా ఆ పార్టీని వీడుతున్నారు. దీంతో కమ్యూనిస్టులు క్షేత్రస్థాయిలో బలహీనపడి, చివరకు ఎన్నికల్లో పొత్తుల కోసం ఆ పార్టీని, ఈ పార్టీని ప్రాధేయపడే స్థితికి దిగజారారు. భారత పెట్టుబడులు ఇప్పుడు ప్రపంచ పెట్టుబడులతో పోటీ పడుతున్నాయి. దీనివల్ల మానవ విలువలు, సంబంధాలు కుటుంబ జీవితం కూడా బూర్జువా భావజాలంతోనే నడుస్తోంది. ప్రజలు కొత్త రకమైన రాజకీయాలను కోరుతున్నారు. కానీ కమ్యూనిస్టు పార్టీలు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాయి. ‘సామాజిక న్యాయం’ అనే నినాదం దేశంలో ఇప్పుడు మార్మోగుతోంది. తమకు ఎంతగానో ఉపకరించే ఈ అజెండాను కమ్యూనిస్టులు అనుసరిస్తారా? లేక, ఎప్పటిలాగే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రాజకీయంగా మున్ముందుకు సాగాలనే సీపీఐ కోరిక ఫలిస్తుందా? కమ్యూనిస్టుల ఐక్యత ఏనాటికైనా సాధ్యమవుతుందా? వేచి చూడాలి.

ఇనుకొండ తిరుమలి

చరిత్రకారుడు

ఇవి కూడా చదవండి..

'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం

Updated Date - Feb 10 , 2026 | 01:11 AM