Share News

‘కరోడ్‌పతు’లయ్యే భాగ్యం దక్షిణాదికి లేదా?

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:32 AM

‘కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)’ క్విజ్‌ షోలో పాల్గొనే అభ్యర్థులకు హిందీతో పాటు ఇంగ్లీషులో కూడా మాట్లాడే వీలు కల్పించాలని, దక్షిణ భారతదేశ అభ్యర్థులకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని నేను కోరుతున్నాను...

‘కరోడ్‌పతు’లయ్యే భాగ్యం దక్షిణాదికి లేదా?

‘కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)’ క్విజ్‌ షోలో పాల్గొనే అభ్యర్థులకు హిందీతో పాటు ఇంగ్లీషులో కూడా మాట్లాడే వీలు కల్పించాలని, దక్షిణ భారతదేశ అభ్యర్థులకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని నేను కోరుతున్నాను. ఈ వినతి హిందీ భాషకు వ్యతిరేకంగా చేస్తున్నది కాదు. హిందీ గౌరవనీయమైన భాష. అయితే ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ క్విజ్‌ కార్యక్రమంలో పాల్గొనగలిగే స్థాయి ఉన్న అభ్యర్థులు ఎందరో కేవలం హిందీలో మాట్లాడలేకపోవటం అన్న కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అందులో పాల్గొనే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. అలాంటి వారికి ఇంగ్లీషులోనైనా మాట్లాడే అనుమతిని ఇవ్వాలి. ఈ క్విజ్‌ షో ఐక్య భారతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టయితే ఇందులో హాట్‌ సీటులో కూర్చునేందుకు హిందీతోపాటు ఇంగ్లీష్‌ను ఎందుకు అనుమతించకూడదు? దాదాపు 26 సంవత్సరాలుగా దక్షిణ భారతదేశానికి చెందిన అభ్యర్థులకు ఈ క్విజ్‌ షోలో అవకాశం పరిమితంగానే దక్కుతున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే కేబీసీ ప్రక్రియలో రిజిస్ట్రేషన్‌, ప్రశ్నలు, జవాబుల ఆప్షన్లు, స్క్రీన్‌పై నియమ నిబంధనలూ... వీటన్నిటికీ ఇంగ్లీషును వాడుతున్నారు. కాబట్టి అభ్యర్థులకు కూడా ఇంగ్లీషులో మాట్లాడే వీలును కల్పించాలి. దీని ద్వారా దేశవ్యాప్తంగా హిందీ మాట్లాడలేని ఎందరో అభ్యర్థులు ఈ క్విజ్‌ షోలో పాల్గొనగలుగుతారు.

ఈ కార్యక్రమంలోనే వెల్లడించిన సమాచారం ప్రకారం, దేశంలో జోన్ల వారీగా ప్రాతినిధ్య శాతం ఈ విధంగా ఉన్నది: జోన్ 1– ముంబై, ఢిల్లీ 21శాతం, జోన్ 2– గుజరాత్, దమన్ & డయ్యూ, నగర్ హవేలి 12.60శాతం, జోన్ 3– మహారాష్ట్ర (ముంబై మినహా), గోవా 13.20శాతం, జోన్ 4– పంజాబ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ & కశ్మీర్, లడఖ్, రాజస్థాన్ 12.20శాతం, జోన్ 5– మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ 12శాతం, జోన్ 6– ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్ 15శాతం, జోన్ 7– పశ్చిమ బెంగాల్, అస్సాం, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు 11.50శాతం ఉండగా, జోన్‌ 8– తక్కిన భారతదేశం 2.50శాతం మాత్రమే ఉంది. ఈ జోన్ 8లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ & నికోబార్ దీవులు ఉన్నాయి. ఇంత పెద్ద ప్రాంతానికి కేవలం 2.50శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉండటాన్ని బట్టి జాతీయ స్థాయిలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సమతౌల్యం, సమాన అవకాశాలూ లేవని అర్థమవుతున్నది. హిందీ మాట్లాడని ప్రాంతాల ప్రేక్షకుల మద్దతుతోనూ ప్రసారమవుతున్న జాతీయ కార్యక్రమం కాబట్టి అందరికీ సమాన ప్రాతినిధ్యం వచ్చేలా కార్యక్రమ నిర్వాహకులు జాగ్రత్త వహించాలి.


కోల్‌కత్తాలో కేబీసీ సీజన్‌–15 ఆడిషన్‌ సందర్భంగా వెళ్లినప్పుడు నేను ఈ సమస్యను స్వయంగా అనుభవించాను. 70 సంవత్సరాల వయస్సులో నేను నా భార్యతో కలిసి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లాను. అక్కడ ఎంపిక ప్రక్రియలో కొన్ని దశల్లో ఇంగ్లీష్‌ వాడినప్పటికీ, ఎక్కువ హిందీలోనే మాట్లాడాల్సిన పరిస్థితి వల్ల చాలా ఇబ్బంది ఎదురైంది.

ఈ అంశంపై నేను గత ఏడాది ప్రధానమంత్రి కార్యాలయానికి ప్రజావినతి పంపించాను (PMOPG/ D/2025/0048643, తేదీ 13.03.2025). దీనికి జవాబుగా సమాచార ప్రసార మంత్రిత్వశాఖ నన్ను కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ నియమాలను అనుసరించి నేరుగా బ్రాడ్‌కాస్టర్‌ను సంప్రదించవచ్చని సూచించారు (Ref No. N–41011/ 26/2025–BC.111, తేదీ 28.03.2025). కానీ ఇప్పటికీ జోన్‌ 8 ప్రాతినిధ్య లేమి, ఇంగ్లీషు మాట్లాడే అవకాశం లేకపోవడం అన్న సమస్యలు అలాగే ఉన్నాయి.

అందువల్ల: 1. అర్హత కలిగి, హిందీలో మాట్లాడలేని అభ్యర్థులకు ఇంగ్లీషులో మాట్లాడే అవకాశాన్ని అనుమతించాలి. 2. జోన్‌ 8లో ప్రాతినిధ్యం అత్యంత తక్కువగా ఉండటాన్ని ఒకసారి సమీక్షించాలి. 3. దక్షిణ భారతదేశానికి చెందిన అభ్యర్థులు, వారిలో సీనియర్‌ సిటిజన్ల సౌకర్యార్థం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, లేదా విశాఖపట్నం నగరాలలో కనీసం ఒక ఆడిషన్‌ సెంటరును ఏర్పాటు చేయాలి. ప్రజాహిత దృష్టితో సమర్పిస్తున్న ఈ వినతిపై కార్యక్రమ నిర్వాహకులు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను.

కొరె మల్లికార్జునరావు

ఇవీ చదవండి:

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!

Updated Date - Jun 16 , 2026 | 01:32 AM