ఈ యుద్ధాల వల్ల ‘లాభాలు’ ఎవరికి?
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:09 AM
ఫిబ్రవరి 28న ఇరాన్ మీదకి ఇజ్రాయిలు ప్రభుత్వమూ, దాన్ని నడిపే అమెరికా ప్రభుత్వమూ కలిసికట్టుగా బాంబులతో దాడి మొదలుపెట్టి, ఇప్పటికీ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని అనేక కోణాల్లో...
ఫిబ్రవరి 28న ఇరాన్ మీదకి ఇజ్రాయిలు ప్రభుత్వమూ, దాన్ని నడిపే అమెరికా ప్రభుత్వమూ కలిసికట్టుగా బాంబులతో దాడి మొదలుపెట్టి, ఇప్పటికీ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని అనేక కోణాల్లో చర్చించిన వ్యాసాలు వస్తున్నాయి. ఈ యుద్ధం, అంతర్జాతీయ న్యాయసూత్రాలకు ఎలా విరుద్ధమో; ఇజ్రాయిలు ప్రాంతీయ ఆధిపత్యం కోసమూ, అమెరికానేమో ప్రపంచ ఆధిపత్యం కోసమూ, ఎంత దౌర్జన్యంగా ఈ యుద్ధాన్ని సాగిస్తున్నాయో– ఇలా వేరు వేరు కోణాలలో చర్చించడం వల్ల పాఠకులకు ఎంతో ఉపయోగమే. ఈ వ్యాసంలో, యుద్ధాలకు మూలం, సరుకుల అమ్మకాల కుమ్ములాటల్లో ఎలా వుందో చూపాలని నా ప్రయత్నం.
ఏ సమాజంలో అయినా సరుకుల ఉత్పత్తి ప్రధానంగా రెండు శాఖల్లో జరుగుతుంది. ఒకటి: సరుకుల్ని తయారు చేయించడానికి అవసరమైన ఉత్పత్తి సాధనాల శాఖ. యంత్రాలూ, ముడిపదార్థాలూ వగైరాలు ఈ శాఖలో తయారయ్యే సరుకులు. ఇంకో శాఖలో, తిండీ, బట్టా, నివాసమూ, వైద్యమూ, విద్యా వంటి పోషణకి కావలిసిన సరుకులు తయారవుతాయి. పెట్టుబడిదారీ సమాజంలో, అటు ఉత్పత్తి సాధనాలుగా గానీ, ఇటు పోషణ వస్తువులుగా గానీ పనికిరాని ఉత్పత్తి ఒకటి జరుగుతుంది. అదే ఆయుధాల ఉత్పత్తి. వీటిని తయారు చేసేది ఎందుకంటే: ఒక వర్గం ఇంకో వర్గాన్ని అణచి వుంచడానికో; ఒక దేశ ప్రభుత్వం ఇంకో దేశ ప్రభుత్వాన్ని తన చెప్పుచేతల్లో వుంచుకోడానికో! ఇప్పుడు అమెరికా–ఇజ్రాయిల్ దేశాలు సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం తక్షణ లక్ష్యం– ఇరాన్ మీద ఆధిపత్యం! ఆ ఆధిపత్యం వల్ల, ఇరాన్‌లో అపారంగా దొరికే ‘చమురు’ అనే సరుకుతో పాటు, జింకూ, రాగీ, ఇనుమూ, బంగారమూ, బొగ్గూ, లిథియం వంటి విలువైన ఖనిజాల్నీ, లోహాల్నీ లాగేసుకోవడానికి.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, తరచుగా రెండు దేశాల మధ్య గానీ, రెండు కూటముల మధ్య గానీ యుద్ధాలు జరిగితే లాభపడేది, యుద్ధ సామాగ్రిని సరుకులుగా తయారు చేయించే పెట్టుబడిదారులే. ఆయుధాల్ని తయారుచేయించేది ప్రైవేటు పెట్టుబడిదారులే కాదు, ప్రభుత్వమే ఒక పెట్టుబడిదారుగా ఆ పని చేయిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో, వందల, వేల సంఖ్యలో ఆయుధాలు ఖర్చయిపోతూ, ఆయుధాల కొరత ఏర్పడుతూ వుంది అని వార్తలు. అందుకే ఇటీవల అతి పెద్ద ఆయుధ కంపెనీల వాళ్ళని, అమెరికా రక్షణ శాఖ పిలిపించి, గతంలో కంటే 3–4 రెట్ల ఆర్డర్లు ఇచ్చిందని రాయటర్ వార్తా సంస్థ తెలిపింది. అంతేకాదు, ఇవ్వాళే, 660 మిలియన్ల డాలర్ల విలువగలిగిన 27,000 బాంబులను ఇజ్రాయిల్‌కి అమ్మడానికి అమెరికా నిర్ణయించింది. ఆయుధ తయారీ కంపెనీలలో, అమెరికాలో వున్న అధికార–ప్రతిపక్ష పార్టీల నాయకులకూ, వాళ్ళ భార్యలకూ, పెద్ద మొత్తంలో షేర్లు వున్నాయి!
ఇరాన్ మీద అమెరికా–ఇజ్రాయిళ్ళు యుద్ధం ప్రారంభించడానికి రెండు రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 26న, ఏయే దేశాలకు అమెరికా ఆయుధాల్ని ఎన్ని అమ్మిందో, ఎన్ని ఇంకా సప్లై చెయ్యాల్సివుందో, ఆ వివరాలన్నీ అమెరికా విదేశాంగ వెబ్‌సైట్‌లో ఇచ్చారు. ఫిబ్రవరి 6వ తేదీన జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం, దాదాపు 40 దేశాలకు ఏ రకమైన, ఎంత శక్తివంతమైన, ఎన్ని శాల్తీలు, ఎప్పటికల్లా కావాలో, అన్ని వివరాలూ వున్నాయి. ఆ 40 దేశాల్లో, ఇప్పుడు ఇరాన్ చుట్టూ వున్న, అమెరికా అనుకూల దేశాలు కూడా వున్నాయి. సౌదీ అరేబియా, కువైట్, లెబనాన్, బహ్రెన్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఖతర్ వగైరా! అంటే, ఆ దేశాలు అమెరికా నించీ కోట్ల కోట్ల డాలర్లు ఖర్చుపెట్టి ఆయుధాలని కొని తీరాలన్నమాట! అంత డబ్బు ఎక్కణ్ణించీ వస్తుంది? శ్రామిక జనాలనించీ, వారి యజమానులు శ్రమ దోపిడీ ద్వారా లాగిన, కోట్ల కోట్ల అదనపు విలువ నించీ! కనీసం, విద్య, వైద్యం, ఉద్యోగాలూ వంటి వాటిమీద ఖర్చుపెట్టడం అన్నా కాదు. పరాయి దేశం మీదకి సైనికుల్ని పంపి, అక్కడి ప్రజల్నీ, సైనికుల్నీ వీళ్ళూ; ఇక్కడి ప్రజల్నీ, సైనికుల్నీ అవతలి దేశమూ చంపుకోవడాలే కదా? ఒకరి రక్తాన్ని ఇంకోరు కళ్ళ చూడడమే గదా? ఈ దారుణ పరిస్థితుల్ని, సాహీర్ లూధ్వియాన్వీ అనే ఒక కమ్యూనిస్టు భావాలు గల ఉర్దూ కవి, 1965లో, ‘ఓ మంచి మనుషులారా’ అనే ఒక యుద్ధ వ్యతిరేక గీతంలో ఇలా అంటాడు:
‘‘మన రక్తమై ఉండొచ్చు/ లేదా పరుల రక్తమై ఉండొచ్చు/ చివరికి అది మానవ జాతి రక్తమే/ యుద్ధం తూర్పులో జరిగినా/ లేదా పడమట జరిగినా/ చివరికి అది ప్రపంచ శాంతి రక్తమే/ బాంబులు ఇళ్లపై పడినా/ లేదా సరిహద్దులపై పడినా/ సృష్టి ఆత్మ గాయపడుతుంది/ మన పొలాలు కాలిపోయినా/ లేదా ఇతరులవి కాలిపోయినా/ జీవితం ఆకలితో తల్లడిల్లుతుంది/ ట్యాంకులు ముందుకు వెళ్లినా/ లేదా వెనక్కి తగ్గినా/ భూమి గర్భం బంజరమవుతుంది/ విజయోత్సవం జరిగినా/ లేదా ఓటమి దుఃఖం వచ్చినా/ జీవితం మృతదేహాలపై ఏడుస్తుంది/ యుద్ధం తానే ఒక సమస్య/ అది సమస్యలకు పరిష్కారం ఎలా ఇస్తుంది?’’
ఇలా మాత్రమే చెప్పి ఊరుకోక, ఒక పోరాటమార్గం కూడా చూపుతున్నాడు కవి సాహిర్:
‘‘అందుకే ఓ మంచి మనుషులారా/ రండి, ఈ దురదృష్ట ప్రపంచంలో/ ఆలోచనల వెలుగును వ్యాప్తి చేద్దాం/ శాంతికి బలం ఇచ్చే/ అలాంటి పోరాటాలను ప్రారంభిద్దాం/ మరణాన్ని పండించే రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం/ పేదరికానికీ, బానిసత్వానికీ వ్యతిరేకంగా పోరాటం/ తప్పుదారి పట్టిన నాయకత్వానికి వ్యతిరేకంగా పోరాటం/ పెట్టుబడిదారీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం/ యుద్ధాల తత్వానికి వ్యతిరేకంగా పోరాటం/ శాంతియుత జీవితం కోసం శాంతి!’’
మరి మనం చెయ్యవలిసింది, సాహిర్ చెప్పినట్టు, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడడమే. దానికి మొదటి అడుగు, లాభాల కోసం ఆ విధానం ఎంత దుర్మార్గానికీ, నీచత్వానికీ ఒడిగడుతుందో తెలుసుకోవాలి. దాని దుర్గుణాన్ని ఒక కార్మిక నాయకుడు ఎంత బాగా చెప్పాడో, మార్క్సు తన రచన ‘పెట్టుబడి’లో, ఇలా ప్రస్తావిస్తాడు. ‘‘ఓజ్జే అన్నట్టు ‘డబ్బు అనేది, పుట్టుకతో ఒక చెంపమీద రక్తపు మరకతో జన్మిస్తే; పెట్టుబడి అనేది నఖశిఖ పర్యంతం ప్రతీ రోమకూపం నించీ రక్తమూ మురికీ కారుతూ జన్మిస్తుంది... తగినంత లాభం ఉంటే, పెట్టుబడి చాలా ధైర్యం గలది. నిశ్చయమైన 10శాతం లాభం వుంటే అది ఎక్కడైనా వ్యాపారం చేస్తుంది. నిశ్చయమైన 20శాతం లాభం దానికి ఉబలాటాన్ని కలిగిస్తుంది. 50శాతం లాభం సాహసాన్ని కలిగిస్తుంది. 100శాతం లాభం ఉంటే అది మానవీయ నియమాలన్నిటినీ కాలరాయడానికి సిద్ధపడుతుంది 300శాతం లాభం ఉంటే అది ఏ నేరం చేయడానికీ సంకోచించదు. ఏ ప్రమాదావకాశానికీ వెనుదీయదు, దాని యజమానికి ఉరిశిక్ష పడే అవకాశానికి కూడా.’’
బి.ఆర్.బాపూజీ
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్
టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్