ఏది ఉత్తమ రచన?
ABN , Publish Date - Mar 02 , 2026 | 05:46 AM
ఒక రచన ఉత్తమమైనది లేదా ప్రశస్తమైనది అనిపించుకో వాలంటే అందులో సాహితీ విలువలు, ఈస్తటిక్ ప్రమాణం ఉన్నత స్థాయిలో వుండాలని మనం నిర్ద్వందంగా అంగీకరిస్తాం. ఈ విలువలు, ప్రమాణాలను ఆబ్జెక్టివ్ కోణంలోంచి...
ఒక రచన ఉత్తమమైనది లేదా ప్రశస్తమైనది అనిపించుకో వాలంటే అందులో సాహితీ విలువలు, ఈస్తటిక్ ప్రమాణం ఉన్నత స్థాయిలో వుండాలని మనం నిర్ద్వందంగా అంగీకరిస్తాం. ఈ విలువలు, ప్రమాణాలను ఆబ్జెక్టివ్ కోణంలోంచి అంచనా వేయడానికి రచనని ఎలా పరిశీలించాలి అన్నప్పుడు, ముఖ్యంగా ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రసిద్ధ విమర్శకులన్నారు. అవి: 1) కళాత్మకత. పాఠకుని భావోద్వేగ అనుభవాన్ని గాఢతరం చేసే విధంగా రచయిత/ కవి భాషను వినూత్నంగా లేక కవితాత్మకంగా వాడాడా – అంటే, ఇమేజరీ, మెటాఫర్లు, రిథం వంటివి వినియోగించాడా? 2) శైలి. భావాల వ్యక్తీకరణలో, రచనా పద్ధతిలో వినియోగించిన డిక్షన్ విలక్షణంగా ఉన్నదా? శక్తివంతమైన శైలి రచయిత ప్రత్యేక ‘వాయిస్’ని సూచిస్తుంది, రచనని గుర్తుండిపోయేలా చేస్తుంది. 3) మేధోపరమైన విలువ. జీవిత మౌలిక సత్యాల గురించి రచన పాఠకునిలో ఆలోచనలను రేకెత్తిస్తున్నదా? పాత భావాలను సవాలు చేసి, చుట్టూ సమాజం పట్ల, మానవ స్వభావం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని కల్పించేదిగా రచన వుండాలి. 4) సూచ్యార్థ గాఢత. వాచ్యార్థాన్ని మించి లోతైన అర్థాలు స్ఫురింప జేసే విధంగా రచన ఉన్నదా? నిర్దిష్ట అనుభూతులను రేకెత్తించి, జ్ఞాపకాలను తట్టి లేపి, పాఠకుడిని ఒక మూడ్‌లోకి తీసుకెళ్లే విధంగా ప్రతీకలు, మెటాఫర్లు ఉన్న భాష ఈస్తెటిక్‌గా గొప్ప ప్రభావాన్ని కలగజేస్తుంది. 5) విశ్వజనీనత. గేథే నియమం ‘The particular is ever subordinate to the universal, and the universal must ever adapt to the particular’ ప్రకారం రచన ఎప్పటికీ ప్రాసంగికంగా నిలిచేదేనా, సార్వకాలిక మానవ సమస్యలకు (ప్రేమ, మరణం, సంఘర్షణ... మొదలైనవాటికి) సంబంధించినదేనా? వస్తువు వివిధ కాలాలకు, సంస్కృతులకు, జాతులకు, జెండర్ లకు వర్తించేదిగా ఉన్నదా? 6) ప్రేరణాత్మక విలువ. పాఠకుడి ఉన్నతీకరణకు, పరివర్తనకు దోహదపడగల నైతిక, ఆధ్యాత్మిక, లేదా మనోవైజ్ఞానిక లోచూపు రచనలో వున్నదా? స్ఫూర్తివంతమైన రచన గొప్ప ఆలోచనలు రేకెత్తించి జీవిత లక్ష్యానికి స్పష్టతనిస్తుంది. 7) పునఃపఠనీయత. మళ్ళీ మళ్ళీ చదివించే గుణం రచనలో వుందా? వస్తురూపాల విలక్షణత, సాహిత్యవిలువల కారణంగా కొన్ని రచనలు దశాబ్దాలు గడిచినా గుర్తుండిపోతాయి, మళ్ళా చదవాలనిపిస్తాయి.
కవిత్వంలో ‘ఆబ్స్‌క్యూరిటీ’ ఉండొచ్చునని చెబుతూ తిలక్ ఇలా అన్నాడు: ‘‘పాఠకుడికి నీ అనుభూతి ఆకారం అందాలి, హత్తుకోవాలి. అది ట్రాన్స్‌పరెంట్ చీకటై వుండాలి, నిన్ను పలకరించాలి. కవిత కొత్త అనుభవాల కాంతి పేటికను తెరవాలి, కదిలించాలి.’’ ఇది రష్యన్ ఫార్మలిస్ట్ విక్టర్ ష్కొలోవ్‌స్కీ చెప్పిన ‘అపరిచితీకరణ’కు (defamiliarization) మరో నిర్వచనం. కె. శివారెడ్డి ‘ట్రాఫిక్’ అనే కవితలో, బయటి ట్రాఫిక్‌ను కవి చూస్తోన్న తీరును ‘‘...ఇరానీ హోటల్ నుంచి/ కదలని నీటిమట్టం ట్రాఫిక్ మీద/ చచ్చిన పాము మీద రాళ్ళు విసిరే పిల్లాడిలా/ చూపుల ముక్కల్ని విసురుతూ’’ అని వివరిస్తారు. ఎన్. గోపి ‘సెల్ఫ్ పిటీ’ కవితలో, చేదుజ్ఞాపకాలను మరిచిపోలేనితనాన్ని ‘‘చిన్నతనంలో/ సామాజిక సంక్లిష్టతలో తడిసిన రెక్కలు/ ఇప్పటికీ ఆర్ద్రంగానే వున్నాయి’’ అని వ్యక్తీకరిస్తారు. మరాఠీ–ఆంగ్లకవి అరుణ్ కొలాట్కర్ దీర్ఘ కవిత ‘The Boat Ride’ నిండా ఒక హిప్నాటిక్ నిశ్చలత పరచుకొని ఉంటుంది; విరామచిహ్నాలు లేని ఈ పద్యం ఊహ, వాస్తవికత కలగలసిపోయిన, స్థలకాలాలకు సంబంధించి సాధారణ భావనలు పని చేయడం ఆగిపోయిన, ఒక అధివాస్తవిక ప్రపంచాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది. ఈయనదే మరో కవిత ‘Jejuri’ లోని ఒక ఖండిక ‘The Blue Horse’లో వినసొంపుగా లేని ఒక బిచ్చగత్తె బొంగురు గాత్రం గురించి ఇలా చెబుతాడు: ‘‘The toothless singer/ opens her mouth./ Shorts the circuits/ in her haywire throat./ A shower of sparks/ flies off her half–burnt tongue.’’ (పళ్ళు లేని పాటగత్తె/ నోరు తెరుస్తుంది/ తన గడ్డివాము గొంతుకలో/ షార్ట్ సర్క్యూట్ అయి/ నిప్పురవ్వల జల్లు ఒకటి/ ఆమె సగం కాలిన నాలుక మీదుగా ఎగిరివస్తుంది.) జర్మన్ కవి పాల్ సెలాన్ ‘Fugue of Death’ కవితలో హోలోకాస్ట్ బాధితులు అనుభవించిన క్రూరహింసను, అమానుష దురంతాలను వివరించే క్రమంలో పలు ఆక్జిమోరానిక్ మెటాఫర్లు, ప్రతీకలు వాడతాడు. కొన్ని పాదాలను తెలుగులో ఇలా అనువదించవచ్చు: ‘‘ఉదయపు నల్లని పాలను మేము తాగుతాం, సాయంత్రం కూడా/ చలిగాలుల్లో ఒక గొయ్యి తవ్వుతాం, అందులో ఒకడు ఏ ఆచ్ఛాదనా లేకుండా పడి ఉంటాడు/ .../ ఆ ఇంటిలో ఒక మనిషి ఉంటాడు, అతడు పాములతో ఆడతాడు...’’.
ఒక కోవకి చెందిన కథలు మానవ సంబంధాలను, ప్రత్యేకించి స్త్రీ పురుష సంబంధాలను, మనస్తాత్విక కోణంలో ఆవిష్కరించి, పాఠకుడికి మేధాపరమైన పని కల్పిస్తాయి. ‘గాలివాన’, ‘పడవప్రయాణం’ (పాలగుమ్మి పద్మరాజు), ‘వేలు పిళ్ళై’ (సి. రామచంద్రరావు), ‘మధుర మీనాక్షి’ (ఆర్‌ఎస్ సుదర్శనం)... తదితర తెలుగు కథలు ఇలాంటివే. కథావస్తువు కొట్టొచ్చినట్టుగా కనపడక కథలోనే సంలీనమైన శిల్పానికి మంచి ఉదాహరణ ‘చెడిపోయిన మనిషి’ (కొడవటిగంటి కుటుంబరావు). ఈ కథ తరాన్ని బట్టి ఆలోచనలను మార్చుకోవాల్సిన ఆవశ్యకతను చెప్తుంది. ‘యజ్ఞం’, ‘ఫౌల్ ఫౌల్’, ‘చీకటి’, ‘మనిషి లోపలి విధ్వంసం’, ‘పిపీలికం’... వంటి కథలు మరో రకం వాస్తవికతను, వైరుధ్యాలను కళ్ళ ముందు నిలబెట్టి మనల్ని అశాంతికి గురి చేస్తాయి. అమెరికన్ రచయితలలో రేమండ్ కార్వర్ మినిమలిస్ట్ శైలికి ప్రసిద్ధుడు. నిజమైన అంధత్వం కళ్ళు లేకపోవడం కాదు, మనుషులతో కనెక్ట్ కాలేక, సహానుభూతి చెందక, ఈర్ష్యాసూయలతో ముడుచుకుపోవడమే అనే అంతర్లీన సందేశం ఉన్న ఆయన కథ ‘Cathedral’ మూడు పాత్రల చుట్టూ నడుస్తుంది. అంధుడైన అతిథి సాయంతో కాథేడ్రల్ బొమ్మ గీసిన కథకుడు, ‘‘మనుషులు లేకుండా కాథేడ్రల్ ఎలా పూర్తవుతుంది’’ అన్న అతిథి ప్రశ్నతో తన తప్పు తెలుసుకుంటాడు. రిచర్డ్ కానెల్ కథ ‘The Most Dangerous Game’లో జార్ వంశీకుడైన జెనరల్ జెరాఫ్, తనకు జంతువుల్ని కాదు– మనుషుల్ని వేటాడి చంపడమే నిజమైన సరదా అని తన స్థావరానికి దారి తప్పి వచ్చిన వృత్తి వేటగాడికి చెప్పి, రెచ్చగొట్టి, మరోమార్గం లేకుండా చేసి, అతణ్ణి వేటజంతువు లాగా అడవిలో పరుగు పెట్టిస్తాడు. ఉత్కంత భరితమైన ప్లాట్‌తో సాగిన ఈ కథ చదివాక – సాటి మనుషులతో సంబంధం మరిచిపోయిన వ్యక్తిలో ఇంతటి రాక్షస ప్రవృత్తి గూడు కట్టుకొని ఉంటుందా అని ఆశ్చర్యపోతాం. వియత్నాం యుద్ధ సమయంలో ఒక అమెరికన్ ప్లాటూన్‌లోని సైనికుల ప్రవర్తన, వారి అస్థిర మనస్తాత్విక వైఖరిని చిత్రించిన టిమ్ ఒబ్రియన్ కథ ‘The Things They Carried’లో సైనికులు మోసుకెళ్ళే ఆయుధ, తిండి సామాగ్రితో పాటు, హింస, మరణాల పట్ల వారి మనస్సులలోని బాధ; దయకు, నైతికతకు, మానవత్వానికి చోటులేని యుద్ధచర్యల పట్ల అపరాధ భావన మనకు సూచ్యంగా తెలియవస్తాయి.
ఏ భాషలోనైనా రాజకీయ, ఆర్థిక మార్పులు ప్రేరేపించిన సామాజిక ఉద్యమాలను ఇతివృత్తంగా తీసుకుని సంక్షుభిత కాలాలనాటి జనజీవనాన్ని చిత్రించిన నవలలు ఉత్తమమైనవిగా నిలబడ్డాయి. ఎందుకంటే చారిత్రిక సంధి దశల కల్లోల పరిస్థితులు మనుషుల భావోద్వేగాల సమస్తాన్ని బహిర్గత పరుస్తాయి. సమర్థుడైన రచయిత వాటి నుంచి తన నవల కాన్వాసుకి కావాల్సిన దినుసులు అందుకుంటాడు. తెలుగులో ‘మాలపల్లి’ (ఉన్నవ లక్ష్మీ నారాయణ) నుంచి నేటి వరకు వచ్చిన వేలాది నవలల్లో సాహితీవిలువల కోణంలో చూసినప్పుడు నిలబడేవి బహుశ 30–40 ఉంటాయి. నైజాం పాలన నాటి ఫ్యూడల్ వ్యవస్థలోని తెలంగాణ జన జీవితాన్ని వట్టికోట ఆళ్వారు స్వామి ‘ప్రజల మనిషి’, దాశరథి రంగాచార్య ‘చిల్లర దేవుళ్ళు’ నవలలు చిత్రించాయి. సాయుధ పోరాటం తర్వాతి తెలంగాణ చారిత్రిక, సామాజిక పరిణామాలను అంపశయ్య నవీన్ ‘కాలరేఖలు’ నవల చిత్రించింది. తెలుగు నాట స్వాతంత్ర్యోద్యమ ప్రభావాన్ని, కమ్యూనిస్ట్ భావజాల విస్తరణను మహీధర రామమోహనరావు ‘కొల్లాయి గట్టితేనేమి’, ‘రథచక్రాలు’ నవలలు; స్వాతంత్ర్యపూర్వ, స్వాతంత్ర్యానంతర కాలాల్లో తెలుగు వారి జీవితాన్ని, ఆలోచనా ధోరణిని మూడుతరాలకు చెందిన పలు పాత్రల దృక్కోణంలో ఉప్పల లక్ష్మణరావు ‘అతడు–ఆమె’ నవల చిత్రించాయి.
కొన్ని ప్రత్యేకతల కారణంగా ఆల్ టైమ్ క్లాసిక్స్ అనదగ్గ నవలలు ప్రపంచ సాహిత్యంలో చాలా వున్నాయి. ‘Les Miserables’ (విక్టర్ హ్యూగో) 19వ శతాబ్దపు పూర్వార్ధ భాగంలో మొదటి లూయి పిలిఫ్ పాలనలో ఫ్రాన్స్ పేదవర్గాల జీవితాన్నీ, జూన్ 1832 రాచరిక వ్యతిరేక తిరుగుబాటు ఘటనలను విపులంగా చిత్రిస్తుంది. ఈ బృహత్ నవలలో పూర్వాశ్రమంలో పరిస్థితుల ప్రభావంతో దొంగ అయిన ముఖ్యపాత్ర జీన్ వాల్జీన్, అనేక పరిణామాల అనంతరం మంచి మనిషిగా మారి అందరి మనస్సుల్లో త్యాగమూర్తిగా నిలుస్తాడు. లోకంలోని మంచీ చెడులను, ప్రేమ పగలను, రాగద్వేషాలను ప్రతిబింబించిన ఈ నవలలోని పాత్రలు సహజంగా గోచరిస్తాయి. అక్టోబర్ విప్లవం, ప్రొవిన్షియల్ ప్రభుత్వం, అంతర్యుద్ధం నేపథ్యంలో కల్లోలభరిత సామాజిక, రాజకీయ పరిస్థితులు వ్యక్తుల ప్రమేయం లేకుండానే వాళ్ళ జీవితాలను చిందరవందర చేసినప్పుడు– బతుకు మీద ప్రేమ ఉన్న వ్యక్తులు వైయక్తిక, సామాజిక విలువల నడుమ సమన్వయం సాధించాల్సిన ఆవశ్యకతను రొమాంటిక్‌గా కాకుండా వాస్తవికంగా విడమర్చి చెప్పిన రష్యన్ నవల ‘Dr. Zhivago’ (బోరిస్ పాస్టర్నాక్). ఈ నవల అనేక ఆరాటాల, పోరాటాల మేళవింపుగా సాగి ఆకట్టుకుంటుంది. ఆరు తరాల ఒక కుటుంబ గాథని చెప్పే క్రమంలో కొలంబియా చారిత్రిక, రాజకీయ పరిణామాలు, అక్కడి రాజ్యహింస, సాయుధ తిరుగుబాటులను సమాంతరంగా వివరించిన నవల ‘One Hundred Years of Solitude’ (మార్క్వెజ్). సమకాలీన వాస్తవాలు, ఫాంటసీ కలగలిసిన మ్యాజికల్ రియలిస్ట్ పద్ధతిలో ఈ నవల సాగుతుంది. ఇందులోని వినూత్న రచనా సంవిధానం సాహితీలోకాన్ని ఆకర్షించి, 46 భాషల్లోకి అనువాదమై 50 మిలియన్ కాపీలు అమ్మి ‘గ్రేట్ లాటిన్ అమెరికన్ నవల’గా ఖ్యాతి గడించింది.
ఆలోచనలను, అనుభవాలను, భావాలను అక్షరరూపంలో సృజనాత్మకంగా వ్యక్తీకరించే కళారూపమే సాహిత్యం. కథ, కవిత్వం, నవల, నాటకం... ఏ ప్రక్రియ ఐనా కావొచ్చు– పాఠకుడిని భావోద్వేగపరంగా, మేధోపరంగా కదిలించి, జీవితం గురించి, మానవ అస్తిత్వం గురించి అతని అవగాహనను విస్తారం చేయగల గుణం ఆ రచనకున్న ‘సాహితీ విలువ’. Whole gamut of human emotionsనీ, predicaments నీ... కొత్త కోణంలో, ఆలోచనస్ఫోరకంగా చిత్రించిన ఏ రచన ఐనా నిలబడుతుంది, గుర్తుండిపోతుంది. అదే ఉత్తమ రచన లక్షణం.
ఆడెపు లక్ష్మీపతి
97012 27207
ఇవి కూడా చదవండి
చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు
ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం