Share News

చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు

ABN , Publish Date - Mar 01 , 2026 | 07:36 AM

పెనుప్రమాదం జరిగిన బాణసంచా తయారీ కేంద్రం వద్దకు చేరుకునే దారిలేదు. కనుచూపు మేర పొలాలు, ఎటుచూసినా మోకాలు లోతు బురద.

చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు

  • సకాలంలోనే చేరిన ఫైర్‌ వాహనాలు, అంబులెన్స్‌లు

  • కానీ, ముందుకెళ్లే దారి లేక నిస్సహాయంగా

  • ఎటుచూసినా పొలాలు, బురద

  • సకాలంలోనే చేరిన ఫైర్‌ వాహనాలు, అంబులెన్స్‌లు

  • కానీ, ముందుకెళ్లే దారి లేక నిస్సహాయంగా..

  • అతికష్టం మీద పేలుడు స్థలికి..

  • అప్పటికే చాలామంది సజీవ దహనం

సామర్లకోట/పిఠాపురం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): పెనుప్రమాదం జరిగిన బాణసంచా తయారీ కేంద్రం వద్దకు చేరుకునే దారిలేదు. కనుచూపు మేర పొలాలు, ఎటుచూసినా మోకాలు లోతు బురద. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు సకాలంలోనే ఘటనాస్థలికి చేరుకున్నా ముందుకెళ్లే దారి కనిపించలేదు. దీంతో నిస్సహాయంగా చాలాసేపు నిలిచిపోయాయి. ఎట్టకేలకు అవరోధాలు దాటుకుని అక్కడకు వెళ్లేసరికే ఘోరం జరిగిపోయింది. ప్రమాదంలో చిక్కుకున్నవారిలో సగానికి పైగా సజీవ దహనమయ్యారు. ఒకవేళ అక్కడికి నేరుగా చేరుకునే దారి ఉంటే భారీ ప్రాణనష్టం ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించి కాపాడుకునే అవకాశం ఉండేది. పొలాల మధ్యలో బాణసంచా తయారీ కేంద్రం ఉండడం, చుట్టుపక్కల బురదమయంగా ఉండడంతో సహాయక చర్యలను వెంటనే చేపట్టడం కష్టంగా మారింది. బాణాసంచా తయారీ కేంద్రంలో రెండు గంటలకు పైగా పేలుళ్లు కొనసాగాయి. దీంతో ఎవరూ సంఘటనా స్థలానికి చేరుకోలేకపోయారు. స్థానికులు పేలుడు ధ్వనులు విని అక్కడకు చేరుకున్నారు. వీరు ఎవరూ అడుగు ముందుకు వేయలేకపోయారు. అగ్నిమాపక యంత్రాలు అక్కడకొచ్చినా ప్రమాద స్థలానికి చేరుకోలేకపోయాయి. స్థానికులు, ఫైర్‌ సిబ్బంది చొరవ తీసుకుని అక్కడకు వెళ్లేసరికి మంటల్లో పలువురు సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో కాలిపోయి తీవ్రంగా గాయపడ్డవారిని పంట పొలాల మీదుగా అతి కష్టం మీదుగా ఆస్పత్రులకు తరలించారు. ఈ తరలింపు ప్రక్రియ సాగుతుండగా మృతదేహాలు ఎగిరిపడడంతో వాటిని వెతకడం కోసం ఫైర్‌, పోలీసు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సమీపంలోని కాలువల్లో మృతదేహాల బాగాలు పడ్డాయి.


మా తల్లి ఎక్కడో..?.. కుమార్తెల రోదన

బాణసంచా తయారీ కేంద్రంలో పనికి వెళ్లిన తమ తల్లి నూకళ్ల దేవి ఆచూకీ తెలియడం లేదంటూ సంఘటనా స్థలం వద్ద ఆమె ఇద్దరు కూతుళ్ల రోదన అందరినీ కలచివేసింది. భోజనం పూర్తయిందని, ఇప్పుడు మళ్లీ లోపలకు వెళ్తున్నట్లు తమ తల్లి ఫోన్‌ చేసిందని, కొంత సమయానికే పేలుళ్లు జరిగినట్లు ఫోన్‌ వచ్చిందని కూతుళ్లు తెలిపారు. కాగా ప్రమాద సమయంలో కొందరు భోజనానికి వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడినట్లు చెబుతున్నారు.

ఎలా అనుమతించారు?

బాణసంచా తయారీ కేంద్రం నిర్వాహకుడిపై గతంలోనే విమర్శలు వచ్చాయి. ఆయన నడుపుతున్న మరో కేంద్రంలో కొంతకాలం క్రితం ప్రమాదం జరిగింది. అటువంటప్పుడు ఆయనను తిరిగి బాణసంచా తయారీకి ఎలా అనుమతించారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా దీపావళి సమయంలో భారీగా బాణసంచా తయారీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంత భారీగా బాణసంచా ఎందుకు తయారు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ కేంద్రం నుంచి హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు కూడా సరుకు పంపుతారని చెబుతున్నారు. 2గంటలకు పైగా పేలుళ్లు జరిగాయంటే ఎంత భారీస్థాయిలో నిల్వ ఉంచారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, మార్చి 31వరకూ ఈ తయారీ కేంద్రానికి అనుమతులు ఉన్నాయని చెప్తున్న అధికారులు అక్కడ అన్ని నిబంధనలు పాటించారా అనే విషయాన్ని చెప్పలేకపోతున్నారు. గతంలో ఇదే వేట్లపాలెంలో ప్రమాదం జరిగి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది రాయవరం వద్ద జరిగిన ప్రమాదంలో పలువురు మరణించారు. అయినా సరైన తనిఖీలు చేయకపోవడం, ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి చేయడం మినహా మిగిలిన సమయాల్లో పట్టించుకోకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - Mar 01 , 2026 | 07:38 AM