మావోయిస్టులు ఏం సాధించారు?
ABN , Publish Date - May 02 , 2026 | 12:37 AM
దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఏమీ లేవని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష అనంతరం ప్రకటించింది. దీనితో మార్చి 31లోపు ఆపరేషన్ కగార్ ద్వారా వామపక్ష తీవ్రవాదాన్ని..
దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఏమీ లేవని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష అనంతరం ప్రకటించింది. దీనితో మార్చి 31లోపు ఆపరేషన్ కగార్ ద్వారా వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామన్న కేంద్రం ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసినట్టయింది. ఆ విధంగా భారతదేశంలో ఐదున్నర దశాబ్దాల పాటు కొనసాగిన వామపక్ష తీవ్రవాదం తుడిచిపెట్టుకుపోయింది. 1967లో నక్సల్బరీలో ప్రారంభమై అబూజ్‌మడ్ అడవుల్లో అంతం అయ్యే వరకు, తమ లక్ష్యాలపై స్పష్టత లేక, ఆచరణ సాధ్యం కాని పిడివాద సిద్ధాంతంతో రాజీపడి వందలాది మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి, ప్రాణాలు చేతబట్టుకుని రాజ్యానికి లొంగిపోయారు.
కమ్యూనిస్టులు తమను తాము సామాజిక అవసరంగా భావించడం అతిపెద్ద తప్పు. ఈ భావనతోనే కాలంతో పనిలేకుండా తిరుగుబాట్లు చేసుకుంటూ పోయారు. ఆ తిరుగుబాట్లు అణగారిన వర్గాల కోసమేనంటూ కొన్నాళ్ల పాటు మొత్తం సమాజాన్ని నమ్మించారు. తమ సమస్యలు పరిష్కారమైనా కాకపోయినా, విముక్తి కోసం హింసను మార్గంగా అటవీ ప్రాంతవాసులు ఇప్పుడు అంగీకరించడం లేదు. అభివృద్ధి అనేది రాజ్యం వేసుకున్న ముసుగు మాత్రమే అన్న మావోయిస్టుల వితండవాదాన్ని పటాపంచలు చేస్తూ వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేక రహదారుల పథకం ద్వారా 17,589 కి.మీ రోడ్లు; 10,644 మొబైల్ టవర్లు నిర్మాణం అయ్యాయి. దశాబ్దాలుగా ప్రభుత్వం అంటే తెలియని ప్రాంతంలో టెలికాం, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ ప్రతి రాజకీయ ప్రశ్నకూ సమాధానం ఇవ్వకపోవచ్చు. కానీ రాజకీయ వాదనల ప్రాతిపదికను మార్చాయి. ఇక తరం మార్పు కూడా మావోయిస్టుల ఉద్యమాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మావోయిస్టుల ప్రభావిత జిల్లాల్లో 48 పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు, 61 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, 258 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించబడ్డాయి. ప్రభుత్వ వ్యవస్థల నిర్మాణం ద్వారా ఈ ప్రాంతాల్లో గణనీయ మార్పులు వచ్చాయి. అలాగే, బలమైన ప్రజాస్వామ్య భావన ప్రజల్లో క్రమంగా వేళ్లూనుకోవటం కూడా మావోయిస్టుల భావజాల క్షీణతకు దీర్ఘకాలిక కారణంగా కనిపిస్తుంది. ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ భారత ప్రజాస్వామ్యం స్వాతంత్ర్యం తర్వాత మావోయిస్టులు ఊహించినదానికంటే వేగంగా ప్రజామోదాన్ని పొందింది.
ఒక గెరిల్లా ఉద్యమం ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా నిలబడగలదు. అయితే దాని వద్ద ప్రజలను నమ్మించగల సైద్ధాంతికత ఉండాలి. తిరుగుబాటు సాహిత్యం అంతా కూడా గిరిజన యువతను కేవలం పాతతరం నాటి త్యాగం చేసే వర్గాలుగానే గుర్తిస్తూ, వారిని ఆ బాటలోనే బంధించి ఉంచాలని కోరుకుంది. కానీ యువత ముందుకు మరిన్ని అవకాశాలు రావటంతో యువతలో మావోయిజం పట్ల తిరుగుబాటు ప్రారంభమైంది. చివరకు మావోయిస్టులకు రక్షణ ఇచ్చిన గిరిజన వర్గాలే వారిని మట్టుబెట్టేందుకు ప్రభుత్వ సాయుధ దళాలను ఆహ్వానించాయి.
లొంగిపోయిన మాజీ నక్సలైట్లు కూడా కాలానుగుణంగా మారకపోవటమే తమ పతనానికి కారణం అని బహిరంగంగానే ప్రకటించి తప్పును అంగీకరించారు. కానీ ఇప్పటికీ తమ మూల సిద్ధాంతంలోనే తప్పు ఉన్నదన్న వాస్తవాన్ని వారు అంగీకరించలేకపోతున్నారు. ఆచరణ సాధ్యంకాని కార్ల్‌మార్క్స్ సిద్ధాంతంలోని శాస్త్రీయతను ప్రశ్నిస్తే వితండవాదం తప్ప అర్థవంతంగా చర్చించలేని పరిస్థితి ఉంది. అడవుల్లో ఉన్న మావోయిస్టులు ఇక తమ ప్రాణాలకు ముప్పు తప్పదన్న వాస్తవాన్ని గ్రహించి లొంగిపోతామంటే కూడా మైదాన ప్రాంతాల్లోని అర్బన్ నక్సలైట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికీ చాలామంది అర్బన్ నక్సలైట్లు.. లొంగిపోయిన నక్సలైట్ల కంటే చాలా యాక్టివ్‌గా లొంగుబాటును వ్యతిరేకిస్తూ హింసను ప్రేరేపిస్తున్నారు. దీన్ని కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. ఇప్పుడు అర్బన్ నక్సలైట్ల అణచివేతపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. తుపాకీ యుద్ధాల్లో ఓడిన మావోయిస్టు పార్టీ భవిష్యత్తు వాదనల్లో నిలబడి గెలవాలంటే పార్లమెంటరీ పద్ధతిలో ముందుకు సాగాలి.
డా. దొంతగాని వీరబాబు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ