బెంగాల్‌లో విజయంకోసం ముస్లిం ఓట్ల తొలగింపు
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:30 AM
గత పది నెలలుగా దేశంలోని పలు రాష్ట్రాలలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అక్కడి పౌరుల ఓటు హక్కును హరించి వేస్తున్నది. నాలుగు నెలల కింద పశ్చిమబెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది....
గత పది నెలలుగా దేశంలోని పలు రాష్ట్రాలలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అక్కడి పౌరుల ఓటు హక్కును హరించి వేస్తున్నది. నాలుగు నెలల కింద పశ్చిమబెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది. ఎస్ఐఆర్ కంటే ముందు పశ్చిమబెంగాల్ మొత్తం ఓటర్లు 7.66 కోట్లు. తొలి విడత ఎస్ఐఆర్ తర్వాత 16 డిసెంబర్ 2025న ఎన్నికల సంఘం తొలి ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా విడుదల తర్వాత 58 లక్షల మంది తమ ఓట్లను కోల్పోయారు. ఎన్యుమరేషన్ ఫారం సరైన సమయంలో అందక, సరియైన ధ్రువపత్రాలు సమర్పించడానికి సమయం సరిపోక, 2003 ఓటరు లిస్టులో పూర్వీకుల పేరు మ్యాచ్ కాక... ఇలాంటి కారణాలతో వీరంతా ఓట్లు కోల్పోయారు. వీరందరూ బూత్ లెవెల్‌లో ఎన్నికల అధికారి ముందు హియరింగ్‌కు హాజరై ఎన్యుమరేషన్ ఫారంతో పాటు సరైన ధ్రువపత్రాలు సమర్పించారు. ఏప్రిల్ 6, 2026న ఎన్నికల కమిషన్ తుది జాబితాను ప్రకటించింది. ఈ తుది జాబితాలో మొత్తం ఏకంగా 91 లక్షలమంది తమ ఓట్లను కోల్పోయారు. ఈ భారీ సంఖ్య దేశంలోని ప్రజాస్వామికవాదులకు ఆందోళన కలిగిస్తున్నది.
ఈ 91 లక్షల ఓట్లలో 27 లక్షల ఓటర్లను ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ (తార్కిక వ్యత్యాసాలు) కేటగిరీ కింద చేర్చారు. బెంగాల్ మొత్తం ఓటర్లలో వీరు దాదాపు 5 శాతం. వీరికి అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీలు చేసుకోవడానికి ఎన్నికల సంఘం కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఇచ్చింది. రెండు రోజులలో వీరు తమ పౌరసత్వాన్ని నిరూపించుకొని, ఓటు హక్కును ఎలా సాధించుకొంటారు? పశ్చిమబెంగాల్‌లో ఏప్రిల్ 23న జరిగే తొలి విడత ఎన్నికల్లో వీరు ఓటు వేయడం అసాధ్యం. పశ్చిమబెంగాల్‌లో ఎలాగైనా గెలవాలని బీజేపీ చేస్తున్న కుయుక్తులకు ఇది నిదర్శనమని, ఎన్నికల సంఘం బీజేపీ ఏజెంటుగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.
‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ కేటగిరీ కింద ఓట్లు కోల్పోయిన 27 లక్షలలో మెజార్టీ ఓటర్లు ముస్లింలు ఉన్నారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. పశ్చిమబెంగాల్ మొత్తం జనాభాలో ముస్లింలు 30శాతం. వీరంతా తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు. వీరి ఓట్లు బీజేపీకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి వీరిని లక్ష్యంగా చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ముస్లింలు మెజారిటీగా ఉన్న ముర్షిదాబాద్, మాల్దా తదితర నాలుగు జిల్లాల్లో భారీగా ముస్లింల ఓట్లను తొలగించారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు 26 శాతం. ఆ నియోజకవర్గంలో తొలగించిన ఓట్లలో 95 శాతం ఓట్లు ముస్లింలవే. 2021లో మమతా బెనర్జీ అక్కడి నుంచి పోటీ చేసి 1956 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలిచారు. ఈ నియోజకవర్గం బంగ్లాదేశ్ బార్డర్‌లో కూడా లేదు. అయినా ఇంత భారీగా ముస్లింల ఓట్లు తొలగించడం, ఎస్ఐఆర్ ప్రక్రియలో కొన్ని వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారన్న అనుమానానికి బలం చేకూరుస్తున్నది. ఎస్ఐఆర్ వల్ల కేవలం ముస్లింల ఓట్లే కాదు, పేదలు ముఖ్యంగా మహిళలు, ప్రముఖుల ఓట్లు కూడా గల్లంతవుతున్నాయి. గత ఏడాది జూలై 10 నుంచి సుప్రీంకోర్టులో ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరుగుతున్నది. జనవరి 2026లో విచారణలు ముగిశాయి. కానీ నేటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ రాజ్యాంగ నిబంధనలకు లోబడి జరుగుతున్నదా లేదా అన్నది సుప్రీంకోర్టు తేల్చలేదు. దీంతో కోట్లాదిమంది పౌరుల ఓటు హక్కు ప్రమాదంలో పడుతున్నది. ఇక పౌరుల ఓటు హక్కును ఎవరు కాపాడగలరు? అందుకే తెలంగాణలో జరిగే ఎస్ఐఆర్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీయేతర పార్టీలు, పౌరసమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
సలీమ్ పాషా
తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ జేఏసీ చైర్మన్
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని మృతదేహం
వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు