Share News

నీటి వివాదాలకు సామరస్యమే పరిష్కారం

ABN , Publish Date - Jan 22 , 2026 | 03:57 AM

తెలుగు రాష్ట్రాలు విడిపోయి దశాబ్దం దాటినా నీటి వివాదం మాత్రం ఇంకా సమసిపోలేదు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్– తెలంగాణల మధ్య కొనసాగుతున్న...

నీటి వివాదాలకు సామరస్యమే పరిష్కారం

తెలుగు రాష్ట్రాలు విడిపోయి దశాబ్దం దాటినా నీటి వివాదం మాత్రం ఇంకా సమసిపోలేదు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్– తెలంగాణల మధ్య కొనసాగుతున్న వివాదం చూస్తే, ‘ఇది నిజంగా పరిష్కారం కాని సమస్యేనా?’ అనే ప్రశ్న తలెత్తుతుంది. కృష్ణా నీటి వివాద పరిష్కారానికి చట్టాలున్నాయి, కమిషన్లున్నాయి. బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వంటి బోర్డులు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ... అన్నీ ఉన్నాయి. కానీ, నీటిని రాజకీయ అస్త్రంగా మార్చడంతోనే అసలు సమస్య మొదలవుతోంది.

కృష్ణానది వార్షిక సగటు నీటి లభ్యత 2,578 టీఎంసీలు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల నీటిని కేటాయించారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు (సుమారు 63శాతం), తెలంగాణకు 299 టీఎంసీల(సుమారు 37 శాతం) కేటాయింపులపై, అప్పటి ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు, కేసీఆర్ సమక్షంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఒప్పందం జరిగింది. ఇవి తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే, శాశ్వత కేటాయింపులు కావు. తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అపెక్స్ కౌన్సిల్‌లో సంతకం చేసిన కేసీఆర్, అధికారం దూరమయ్యాక నేడు జల రాజకీయం చేస్తున్నారు. ప్రజల్లో భావోద్వేగాలు, సెంటిమెంటును రగిలించి రాజకీయంగా లబ్ధిపొందాలన్న దురాశతోనే నీటి నిప్పును రాజేస్తున్నారు. చంద్రబాబును బూచిగా చూపుతున్నారు. బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారంతో తామెక్కడ రాజకీయంగా వెనుకబడిపోతామోననే భయంతో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్‌కు వంత పాడుతోంది.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కావాలంటే జూరాల నుంచి వరద నీటిని ఆ ప్రాజెక్టుకు తరలించాలి. అలా అయితే ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదం ఉండదు. కానీ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం నుంచి నీటిని తీసుకుంటామనడంతోనే వివాదం మొదలైంది. తెలంగాణ కొత్త ప్రాజెక్టుల (కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి) ద్వారా ఎగువ ప్రాంతాల్లోనే ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ దిగువన ఉండటంతో, సమయానికి నీరు రాకపోవడం ప్రధాన సమస్య. కృష్ణా డెల్టా రైతాంగంపై దీని ప్రభావం తీవ్రంగా పడుతోంది. గోదావరి నది సగటు నీటి లభ్యత 3,000 టీఎంసీలకు పైగా ఉంది. వాస్తవ వినియోగం కేవలం 1,500 టీఎంసీలకు లోపే. అంటే సగం కంటే ఎక్కువ నీరు సముద్రంలోకి వృథాగా పోతోంది. ఇక్కడే వివాద పరిష్కారానికి కీలక దారి ఉంది. గోదావరి నీటిని సమర్థవంతంగా వినియోగిస్తే కృష్ణాపై ఒత్తిడి తగ్గుతుంది. రాష్ట్రాల మధ్య వివాద తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉంటుంది.


2019లో తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ ఇద్దరూ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సమావేశమై అలై బలై నిర్వహించారు. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువని, అందుకే గోదావరి నీటిని ఉపయోగించుకుని రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల సాగునీటి సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. తాము వేసిన ఈ అడుగు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటూ ముఖ్యమంత్రులిద్దరూ సుద్దులు చెప్పారు!

‘‘నదీ జలాల వివాద పరిష్కారానికి ట్రిబ్యునళ్లకు వెళ్లడం, సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఉండదు’’ అంటూ నాడు కేసీఆర్ జలకథలు చెప్పారు. అంతేకాదు, ‘గోదావరి, కృష్ణా నదుల్లో కలిపి ఏటా దాదాపు 4 వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. ఈ నీళ్లతో రెండు రాష్ట్రాలను సస్యశ్యామలం చేయవచ్చు. వంశధార, నాగావళి, నదుల నీళ్లను కూడా బంగాళాఖాతం పాలు కాకుండా సమర్థంగా వినియోగిస్తే ఉత్తరాంధ్ర వాసుల నీటి కరువు కూడా తీరుతుంది’ అంటూ కేసీఆర్‌ నమ్మబలికారు. నాడు ఆయన చెప్పిన ఆదర్శాలన్నీ ఏమయ్యాయి?!

ప్రస్తుతం తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నాయకులకు రాజకీయ మనుగడ లేదు. ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిలించడమే లక్ష్యంగా వారు జల రాజకీయం చేస్తున్నారు. సముద్రంలోకి వృథాగా పోతున్న జలాలనే నల్లమలకు తీసుకెళ్తుంటే తెలంగాణకు జరిగే నష్టం ఏమిటో అర్థం కావడం లేదు. తెలంగాణలో గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లు కట్టారు. మహారాష్ట్రలో పుట్టిన గోదావరి మొదట తెలంగాణలో, అనంతరం ఏపీలో ప్రవహిస్తూ అంతర్వేది మీదుగా సముద్రంలో కలుస్తుంది. ఏపీలో గోదావరిపై ధవళేశ్వరం మాత్రమే ప్రధాన ప్రాజెక్ట్‌గా ఉంది. ప్రస్తుతం పోలవరం నిర్మాణంలో ఉన్నది. గోదావరి నీళ్లు తరలించడం ద్వారా పల్నాడు, రాయలసీమ, వెలిగొండ, ప్రకాశం ప్రాంతాల ప్రజల సాగునీటి కష్టాలు తీర్చాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి నుంచి 200 టీఎంసీలు నల్లమల ప్రాజెక్టుకు తరలించడం ద్వారా కృష్ణా నీటిపై ఒత్తిడి తగ్గుతుంది. ఆ నీటిని తెలంగాణకు వాడుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని న్యాయపోరాటాల కంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడమే ఉత్తమమని తెలంగాణ, ఏపీలకు సుప్రీంకోర్టు సూచన చేయడం అభినందనీయం. రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. నీటిని రాజకీయ అస్త్రంగా కాకుండా, అభివృద్ధి వనరుగా చూడాలి.

నెల్లూరు దుర్గా ప్రసాద్

టీడీపీ తెలంగాణ ప్రతినిధి

ఇవి కూడా చదవండి

8 యుద్ధాలను ఆపాం.. దావోస్‌లో ట్రంప్ పాతపాట

విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం.. బాధితులను స్టేషన్‌కు పిలిస్తే అధికారులదే బాధ్యత

Updated Date - Jan 22 , 2026 | 03:57 AM