Share News

ఇథనాల్‌పై రాహుల్‌గాంధీ చెప్పిందీ పట్టదా?

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:07 AM

కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2021లో తీసుకువచ్చిన E20 విధానానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఇథనాల్ పరిశ్రమలు వస్తున్నాయి.

ఇథనాల్‌పై రాహుల్‌గాంధీ చెప్పిందీ పట్టదా?

ఇప్పటికే ఎల్‌నినో కారణంగా ప్రజలు తాగునీటికే ఇబ్బందులు పడుతున్నారు. రానున్న జూలై వరకూ గడ్డు పరిస్థితులు ఉంటాయని ప్రభుత్వమే చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ఒక్కోటి రోజుకు 50 లక్షల లీటర్ల చొప్పున నీటిని వాడుకునే రెండు ఇథనాల్ కంపెనీలకు నల్లగొండ జిల్లాలో అనుమతులు ఇవ్వబోవడం న్యాయమా?

కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2021లో తీసుకువచ్చిన E20 విధానానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఇథనాల్ పరిశ్రమలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పరిపాలనా కాలంలో, నాటి కరోనా సమయాన్ని ఉపయోగించుకుని, కేంద్రం ఇచ్చిన మినహాయింపు మేరకు, ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణా చేయకుండా అనేక ఇథనాల్ పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వివిధ జిల్లాలలో మొత్తం 30 ఇథనాల్ పరిశ్రమలు అలా అనుమతులు పొందాయి.

2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్, గద్వాల జిల్లా పెద ధనవాడలలో ఇథనాల్ కంపెనీలకు ఇచ్చిన అనుమతులను స్థానిక ప్రజల వ్యతిరేకత కారణంగా నిర్మాణ దశలోనే రద్దు చేసింది. 2025 మధ్యలో వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఒక కంపెనీ ముందుకు వచ్చినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది. స్థానిక ప్రజలు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించడంతో, ఆ కంపెనీ యాజమాన్యం తమ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నాం అని పబ్లిక్ హియరింగ్‌లోనే ప్రకటించింది. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఒక సానుకూల అభిప్రాయాన్ని కలిగించాయి.


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు ఇథనాల్ పరిశ్రమ జల, వాయు కాలుష్యాలకు కారణమవుతుండడంతో స్థానిక ప్రజలు సంవత్సర కాలం ఉద్యమాలు సాగించారు. ఆ ఉద్యమాలకు అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఆ ఉద్యమాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్బంధంగా అణచివేసింది. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఆ పరిశ్రమ అలా కొనసాగుతూనే ఉంది. దాని కాలుష్యంపై ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసినా, గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంతేగాక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో కామారెడ్డి, సిద్దిపేట, నారాయణపేట, సూర్యాపేట జిల్లాలలో అనుమతులు పొందిన మరో ఆరు ఇథనాల్ పరిశ్రమలు కూడా ఉత్పత్తి ప్రారంభించి, ఇప్పటికే స్థానికంగా తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఘన వ్యర్థాలను చుట్టూ పొలాల్లో పారబోస్తున్నాయి. ద్రవ వ్యర్థాలను నదుల్లోకీ, వాగుల్లోకీ వదులుతున్నాయి. ఫలితంగా స్థానికంగా భూగర్భ జలాలు, నదులు, వాగులు పాడవుతున్నాయి. వాయుకాలుష్యం, దుర్వాసనల వల్ల స్థానికంగా ప్రజలకు నివసించలేని స్థితి ఏర్పడింది. ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆ పరిశ్రమల చుట్టూ ఉన్న పంట పొలాలలో దిగుబడులు పడిపోతున్నాయి. ఆ పొలాల్లో పని చేయడానికి వ్యవసాయ కూలీలు రావడం లేదు. ఆయా గ్రామాల యువకులకు తమ అమ్మాయినిచ్చి పెళ్లిచేయడానికి కూడా తల్లిదండ్రులు వెనుకాడుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.


‘ఇథనాల్ ఉత్పత్తికి ప్రభుత్వం ఇస్తున్న భారీ సబ్సిడీలు, రాయితీలు సామాన్య చెరుకు లేదా మొక్కజొన్న రైతులకు చేరడం లేదు. అవి కేవలం అధికార పార్టీకి సన్నిహితులైన కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల యాజమాన్యంలోని డిస్టిలరీలకు మాత్రమే లాభం చేకూరుస్తున్నాయి’ అని గత ఏడాది స్వయంగా రాహుల్‌గాంధీ ప్రకటించారు. ‘ఆహార ధాన్యాలను ఇంధన తయారీకి మళ్లించడం వల్ల భవిష్యత్తులో ఆహార భద్రతకు ముప్పు కలుగుతుంది, పర్యావరణ నిబంధనలను సడలించి డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వడం వల్ల స్థానిక జల వనరులు కలుషితమవుతున్నాయి’ అని కూడా ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో ఇథనాల్‌ కంపెనీ యాజమాన్యాలు కాలుష్యం విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తున్నా ఇక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే, ఈ అంశంలో రాహుల్ వైఖరికి భిన్నమైన వైఖరిని ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్నదని అనుకోవాల్సి వస్తుంది. మోదీ, కేసీఆర్ పంథాలోనే ఇథనాల్ కంపెనీల యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని భావించాల్సి వస్తుంది.

పైపెచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నల్లగొండ జిల్లాలో మరో రెండు ఇథనాల్ పరిశ్రమల నిర్మాణానికి సహకారం అందిస్తున్నది. అడవి దేవులపల్లి మండలం, ముదిమాణిక్యం గ్రామంలో ఇథనాల్ కంపెనీ గతంలో పొందిన అనుమతులతో, ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, వేగంగా నిర్మాణ పనులను ప్రారంభించడానికి సిద్ధపడుతున్నది. ఈ కంపెనీ యాజమాన్యం ఇప్పటికే కృష్ణా జిల్లా గండేపల్లిలో ఒక ఇథనాల్ కంపెనీని నిర్వహిస్తూ కాలుష్యాన్ని వెదజల్లుతున్నది.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దామరచర్ల మండలం వీర్లపాలెంలో కొత్త ఇథనాల్ కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనపై నవంబర్ 20న పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నది. ఒక లీటరు ఇథనాల్ తయారీకి కనీసం 8 లీటర్ల నీరు అవసరం. ఈ పరిశ్రమ కోసం రోజుకు 50లక్షల లీటర్ల నీరు అవసరమని దాని పర్యావరణ ప్రభావ నివేదికలో పేర్కొన్నారు.


అందులో పరిశ్రమ నుంచి వెలువడే విష రసాయనాల ప్రస్తావనే లేదు. పైగా చట్టవిరుద్ధంగా రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా కృష్ణానది నుంచి పైప్‌లైన్ ద్వారా నీళ్లు తెస్తామని పేర్కొన్నారు. నీళ్లకు అత్యంత ఇబ్బంది పడుతున్న మన రాష్ట్రంలో ఇంతటి భారీ నీటి అవసరమున్న ఇథనాల్ కంపెనీలకు అనుమతి ఇవ్వటం కోసం పబ్లిక్ హియరింగ్ నిర్వహించడానికి మించిన అన్యాయం ఏముంటుంది? ఇక తెలంగాణ రాష్ట్రానికి కాలుష్య కారక ఇథనాల్ పరిశ్రమలు రావులే అని ప్రజలు అనుకుంటున్న సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం ఇథనాల్ కంపెనీల ఏర్పాటుకు అనుగుణంగా అడుగులు వేయడం ఆందోళనకరం.

ఇప్పటికే ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో ప్రజలు తాగునీటికే ఇబ్బందులు పడుతున్నారు. 2026 వానాకాలంలో లక్షల ఎకరాలలో పంటలు ఎండి, దిగుబడులు తగ్గి, రైతులు తీవ్రంగా నష్టపోయారు. 365 మండలాలలో కరువు పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వమే నివేదిక ఇచ్చింది. రానున్న జూలై వరకూ గడ్డు పరిస్థితులు ఉంటాయనీ, విద్యుత్తు, నీరు పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం కూడా ప్రచారం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఒక్కోటి రోజుకు ‍50 లక్షల లీటర్ల చొప్పున నీటిని వాడుకునే రెండు ఇథనాల్ కంపెనీలకు నల్లగొండ జిల్లాలో అనుమతులు ఇవ్వబోవడం న్యాయమా?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇథనాల్ పరిశ్రమల విషయంలో ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. తాజాగా నల్లగొండ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు కోసం తలపెట్టిన పబ్లిక్ హియరింగ్‌ను రద్దు చేయాలి. రాష్ట్రంలో ఇథనాల్ పరిశ్రమలకు ఇప్పటికే ఇచ్చిన అనుమతులన్నిటినీ వెనక్కు తీసుకోవాలి. కాలుష్యం వెదజల్లుతున్న ఇథనాల్ పరిశ్రమలను పూర్తిగా మూసేయాలి.

కన్నెగంటి రవి

తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ

ఇవి కూడా చదవండి..

ట్రైన్ డ్రైవర్ క్యాబిన్‌లోకి వెళ్లేందుకు యువతి యత్నం.. ఘటనపై ఆర్పీఎఫ్‌ విచారణ

‘అక్వాన్’ తుపాను: 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 31 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల మోహరింపు

Updated Date - Nov 20 , 2026 | 01:30 AM