వరంగల్ ముక్కలైనప్పుడు ఏమైందీ స్ఫూర్తి!
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:43 AM
‘వందలేళ్ల వారసత్వం బొగ్గు కోసం బుగ్గి!’ పేరుతో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ రాసిన వ్యాసం (10.10.2026) కేవలం బొగ్గు కోసం వందల ఏళ్ళ చరిత్ర గల రామప్ప దేవాలయాన్ని ప్రమాదంలోకి...
‘వందలేళ్ల వారసత్వం బొగ్గు కోసం బుగ్గి!’ పేరుతో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ రాసిన వ్యాసం (10.10.2026) కేవలం బొగ్గు కోసం వందల ఏళ్ళ చరిత్ర గల రామప్ప దేవాలయాన్ని ప్రమాదంలోకి నెట్టడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనే కాదు, వరంగల్ ఉమ్మడి జిల్లా పౌర సమాజం మొత్తం ఆ ప్రాంతంలో బొగ్గు తవ్వకం నిలిపి వేయాలనీ, కాకతీయుల వారసత్వ సంపదను, రామప్ప దేవాలయాన్ని కాపాడాలనీ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. రామప్ప దేవాలయ పరిరక్షణ కోసం వినోద్‌కుమార్ ప్రజల పక్షాన నిలబడటాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు స్వాగతిస్తారు.
గత ప్రభుత్వ పాలనలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఉమ్మడి జిల్లాను ఆరు జిల్లాలుగా ముక్కలు చేయడాన్నే ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేస్తున్న సందర్భంగా 2016లో కేసీఆర్ వరంగల్ నగరాన్ని వరంగల్ అర్బన్ జిల్లాగాను, చుట్టుపక్కల గ్రామాలను వరంగల్ రూరల్ జిల్లాగాను ప్రకటించి 2021 వరకు పాలన కొనసాగించారు. ఆ ఏడాది మరోసారి వరంగల్ నగర పరిధిని రెండు ముక్కలు చేసి తూర్పు భాగాన్ని వరంగల్ జిల్లాగాను, పడమటి భాగాన్ని హనుమకొండ జిల్లాగాను ప్రకటించారు. తన సామాజిక వర్గ కార్పొరేట్ సంస్థకు మెడికల్ కాలేజీ అనుమతి కోసమే ఇలా వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలుగా విడదీశారు. పది కిలోమీటర్ల దూరంలో రెండు కలెక్టరేట్లను, పోలీసు కార్యాలయాలను ఏర్పాటు చేశారు.
వరంగల్ నగరంలో కాకతీయుల కాలం నాటి వారసత్వం విస్తరించి ఉందని వినోద్‌కుమార్‌కు తెలియనిది కాదు. రామప్ప దేవాలయం, పాకాల, లక్నవరం సరస్సులు, ధర్మసాగరం ఘనపురం భద్రకాళి చెరువులు, వందలాది గొలుసు కట్టు చెరువులు, వేయి స్తంభాల గుడి, శంభుని దేవాలయం... ఇదంతా కాకతీయ వారసత్వంలో భాగమే. వరంగల్లు, హనుమకొండ, కాజీపేట మూడు నగరాలు కలిసి వరంగల్ నగరంగా ఖండాంతరాలలో ప్రసిద్ధి. వరంగల్ హనుమకొండ మధ్యలో నిజాం కాలం నుండి అత్యంత పేరు ప్రతిష్ఠలు కలిగిన, రకరకాల కుటీర పరిశ్రమల్లో ఖైదీలకు శిక్షణ ఇచ్చే వ్యవస్థగా ఎదిగిన, సకల సదుపాయాలతో అభివృద్ధి చెందిన వరంగల్ జైలును కేసీఆర్ ఆదేశాలతో రాత్రికి రాత్రే నేలకూల్చారు. జైలు కూల్చివేత వరంగల్ ప్రజలకే కాక ఉత్తర తెలంగాణ ప్రజలకు కూడా నచ్చలేదు.
వెయ్యి మందికి పైగా ఖైదీలను, 400 మంది జైలు ఉద్యోగులను హుటాహుటిన ఇతర ప్రాంతాలకు తరలించారు. 67 ఎకరాల జైలు భూమిని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అత్యధిక వడ్డీ రేటు వద్ద కుదువపెట్టి రూ.1100 కోట్ల అప్పుతో కాంట్రాక్టులూ కమీషన్ల కొరకు వైద్యశాల నిర్మాణం ప్రారంభించారు. వరంగల్‌లో మరో జైలు నిర్మాణం ఈనాటికీ జరగలేదు. ఈ అనాలోచిత చర్యవల్ల ఉత్తర తెలంగాణ ఖైదీలు, రిమాండ్ ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు, జైలు ఉద్యోగులు, వారి పిల్లలు అష్టకష్టాల పాలైనారు. వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలుగా విడగొట్టమనీ, జైలును కూలగొట్టమనీ, అప్పు తెచ్చి దవాఖాన కట్టమనీ నగర ప్రజలు ఏనాడూ మన మాజీ ముఖ్యమంత్రిని కోరలేదు. ఇవన్నీ చేసిన ఆ ముఖ్యమంత్రి ప్రజలు అడిగిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్నూ, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణాన్నీ మాత్రం చేపట్టలేకపోయారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా వరంగల్ ఎదుగుతుందని రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, ఉద్యమకారులు, మేధావులు భావించారు. కానీ నేడు వరంగల్ జిల్లా ఏ అభివృద్ధికీ నోచుకోకపోగా, సిద్దిపేట సిరిసిల్లతో పోలిస్తే మరింత వెనుకబడిపోయింది. ఓరుగల్లు ప్రజలు నిజాం, వారి తొత్తుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో ముందువరుసలో నిలబడ్డారు, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ ముందు నిలిచారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అమలుచేస్తున్న అధికార పార్టీలను మట్టిగరిపించిన సత్తా ఉన్నవారు.
బోయినపల్లి వినోద్‌కుమార్ 2004లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికైనారు. లోక్‌సభ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి ఓటమి పొందిన తర్వాత 2018 నుంచి 2023 వరకు తెలంగాణ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులుగా క్యాబినెట్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. ఇదే కాలంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్ జిల్లా నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. ఈ ఇద్దరూ కాకతీయుల వారసత్వ సంపదపై అవగాహన ఉన్నవారే. వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయ చైతన్యం గురించి తెలిసినవారే.
రామప్ప దేవాలయ వారసత్వ సంపదను కాపాడాల్సిందే. కానీ ఈ జిల్లా నాయకులకు ఇదే స్ఫూర్తి వరంగల్ నగరాన్ని రెండు ముక్కలు చేసినప్పుడూ, జైలును కూల్చిన సందర్భంలోనూ ఉంటే ఎంతో బాగుండేది. కాకతీయ వారసత్వ సంపదకు నిలువుటద్దంగా నిలిచిన ఓరుగల్లు నగరాన్ని రెండు ముక్కలు చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రికి అతి సమీపంగా అధికారాన్ని పొందిన బోయినపల్లి వినోద్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావులు ప్రజల మనోభావాలకు అద్దం పడుతూ కేసీఆర్‌కు నచ్చచెప్పాల్సింది. ఈ ఇద్దరి నాయకుల మౌనం వరంగల్ ప్రజలకు తీరని అన్యాయం చేసింది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ నాయకులు జరిగిన నష్టాన్ని ఎలా నివారిస్తారో మహానగర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని వరంగల్ పౌర సమాజం గుర్తు చేస్తున్నది.
ప్రొ. కూరపాటి వెంకట్‌నారాయణ
ఈ వార్తలనూ చదవండి:
బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్
’ఫర్జీ’ వెబ్‌సిరీస్ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు