Share News

వాఘా.. గుండెలు ఉప్పొంగలేదు!

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:13 AM

చిన్నప్పటి నుంచి మన దేశ సరిహద్దుల గురించి వినీ చదివీ ఒక చరిత్ర విద్యార్థిగా ఉప్పొంగిపోయాను. ఉత్తరాన హిమాలయాలు మంచుతో నిండివుంటాయనీ– కైబర్‌, బోలాన్‌ కనుమల గుండా ఇతర ప్రాంతాల...

వాఘా.. గుండెలు ఉప్పొంగలేదు!

చిన్నప్పటి నుంచి మన దేశ సరిహద్దుల గురించి వినీ చదివీ ఒక చరిత్ర విద్యార్థిగా ఉప్పొంగిపోయాను. ఉత్తరాన హిమాలయాలు మంచుతో నిండివుంటాయనీ– కైబర్‌, బోలాన్‌ కనుమల గుండా ఇతర ప్రాంతాల నుంచి మన దేశంలోకి శతాబ్దాలుగా మానవ సంచారం జరిగిందని చదువుకుని, మాకు మేమే ఉత్తేజితులమయ్యాం. బౌద్ధ భిక్షువులే కాక హర్షుడి కాలం నుంచి హుయన్‌త్సాంగ్‌, అలెగ్జాండర్‌, రాహుల్‌ సాంకృత్యాయన్‌ వంటి ఎందరో మహనీయులు మానవ నాగరికతకు, సంస్కృతికి, చరిత్రకు వారధి కట్టారు. అదంతా మనసులో నిండివుండడంతో డెభ్బై మూడేళ్ల వయసులో పదిమందితో కలిసి హిమాలయాల సందర్శనానికి సాహసంతోనే బయలుదేరాం. వారిలో సగంమంది అరవైలు దాటినవాళ్లు. మిగిలినవాళ్లు యాభైలలో ఉన్న యువకులు.

ఇదంతా దేనికంటే– ఈ వయసులో శ్రీనగర్‌ నుంచి లేహ్‌ మీదుగా నుబ్రావాలి, కృతుంగాపాస్‌, పాన్‌గాంగ్‌ సరస్సుదాకా ఆక్సిజన్‌ లెవల్స్‌తో ఇబ్బంది పడతామని తెలిసి కూడా సాహసించాం. పాన్‌గాంగ్‌ (చైనా సరిహద్దు) నుంచి కార్గిల్‌ (పాకిస్థాన్‌ సరిహద్దు) దాకా ప్రయాణించి అద్భుతమైన పర్వతాలను, మరోవైపు దిగంతాలను తలపించే లోయలను చూస్తూ– ప్రమాదభరితమని తెలిసినా సంతోషంగా గడిపాం.

ఇంత ఆనందంలో చివరి రోజు, చివరి ఘట్టం ఎంత దిగులుగా, నిరాశగా, నిస్పృహగా మిగిలిందంటే– మా పదిహేను రోజుల యాత్రను నీరసపరిచింది. భారతీయులుగా ‘వాఘా’ సరిహద్దు సైనిక కవాతు చూడడం నిజంగా గర్వకారణం. మేమంతా ఎప్పటినుంచో ఆ బోర్డర్‌లో ప్రదర్శించే సైనిక కవాతు గురించి వినివున్నాం. నెట్‌లో చూసి కూడా ఎంతో ఉత్తేజితులం అయివున్నాం. అయితే మేము వెళ్లినరోజు అక్కడి ప్రదర్శన మాకు అత్యంత నిరాశను కలిగించింది. ఈ నెల తొమ్మిదో తేదీ అయిదు గంటలకల్లా ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్నాం. ఆ వేల మందిలో కూర్చునే చోటు దక్కించుకుని ప్రదర్శన కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాం. అయిదున్నరకు ప్రదర్శన ప్రారంభమవుతుందన్నారు, ఆరున్నరకు గానీ ప్రారంభం కాలేదు. అది కూడా ఎంత నిరాశ కలిగించిందో చెప్పలేం. అయిదున్నరకు సందర్శకుల నుంచి– మహిళలను ప్రదర్శన జరిగే చోటుకు పిలిచారు. వారితో జాతీయ జెండా ప్రదర్శింపజేశారు. అంతవరకే అయితే ఫరవాలేదు. కానీ దేశభక్తితో కూడిన పాటలు పెట్టి మహిళలతో చేతులు ఊపుతూ ప్రదర్శన చేయించారు. అదీ పోనీ అనుకుంటే– ఈ చేరిన మహిళలు ఆ కవాతు జరిగే ప్రదేశంలో బతుకమ్మలాడారు. కొందరైతే చేతులు పట్టుకుని ‘ఒప్పుల కుప్ప’ ఆడారు. అది చూస్తూ మాకు ఎంత ఆవేదన కలిగిందో చెప్పలేం.


మహిళలను ప్రతి దానిలో భాగం చేయాలనే కాంక్ష కొద్దీ ఈ మధ్య రథయాత్రలు, దేవుడి ఊరేగింపుల ముందు, కోలాటాలూ వేయించడం– ఇది ఏ సంస్కృతో తెలియదుగానీ దిగువ మధ్యతరగతి స్త్రీలు ఈ ప్రదర్శనలకు ఆలంబన కావడం దురదృష్టం. గుడిలో పూజాకైంకర్యాలు చేసే దేవదాసీలను నిషేధించి– వీధి ఊరేగింపుల్లో భక్తి పేరుతో ఎందుకు వీరిని తెస్తున్నారో అర్థం కావడం లేదు. దానినే సహించలేని సమాజికులుగా ‘వాఘా’ బోర్డర్‌ సైనిక కవాతు సందర్భంగా కూడా మహిళలను ఆ ట్రాక్‌లోకి ఆహ్వానించి ప్రదర్శనను ఇంత పేలవంగా, అగౌరవంగా జరపడం శోచనీయంగా భావిస్తున్నాం. చివరికి నెట్‌లో చూసినపాటి ప్రదర్శన కూడా లేకుండా సైనిక కవాతు ముగించారు. బోర్డర్‌ గేట్లు తీయడం లేదు. ఇరువైపుల సైనికుల కరచాలనం లేదు. ఇదంతా అనకూడదుగానీ ఏదో విన్యాసం కింద తయారయింది.

భారతీయ పౌరులందరికీ దేశభక్తి ఎంతో మహోన్నతమైనది. ఆ మాట తలుచుకుంటే గుండెలు ఉప్పొంగుతాయి. దానికి ప్రతీక అయిన ‘వాఘా బోర్డర్‌’ కవాతును ఆ రోజు అలా చూడటం నాకు ఎంతో బాధాకరంగా అనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిని సరిదిద్దుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

నల్లూరి రుక్మిణి (గుంటూరు)

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 12:13 AM