అధికారపీఠం కోసం వివేకహీన వ్యూహం!
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:48 AM
అమెరికాలో గత కొన్నేళ్లుగా శ్వేత జాత్యాహంకారం పెరుగుతూపోతోంది. దీనికి ముఖ్య కారణం ఆర్థిక అసమానత్వం పెరిగిపోవడమూ, దానివల్ల సామాన్య అమెరికన్ల జీవనం కష్టమవడమూ. ఈ అసంతృప్తిని...
అమెరికాలో గత కొన్నేళ్లుగా శ్వేత జాత్యాహంకారం పెరుగుతూపోతోంది. దీనికి ముఖ్య కారణం ఆర్థిక అసమానత్వం పెరిగిపోవడమూ, దానివల్ల సామాన్య అమెరికన్ల జీవనం కష్టమవడమూ. ఈ అసంతృప్తిని ట్రంప్ లాంటి వాళ్లు తమ రాజకీయ ప్రయోజనానికి వాడుకున్నారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చినవాళ్లు, అమెరికన్ల ఉద్యోగాలను దొంగిలిస్తున్నారనీ, ప్రభుత్వ నిధుల్ని దోచుకుంటున్నారనీ, ట్రంపూ అతని అనుచరులూ వలసదారుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టారు. ట్రంప్ మొదటి పదవీకాలంలో ఈ వివక్ష నల్లజాతీయుల మీదా, లాటిన్ అమెరికా వారి మీదా, అరబ్ సంతతికి చెందిన వారి మీదా ముఖ్య లక్ష్యంగా సాగింది. అమెరికాలో ఉన్న కొంతమంది భారతీయులు, ఇది తమకు లాభదాయకమని భావించి, ‘ఇండియన్స్ ఫర్ ట్రంప్’ అని సంఘాలు మొదలెట్టి ‘లాటిన్ అమెరికా నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని మీరు దేశంలోంచి తరిమేయండి. ఇండియా నుంచి చట్టబద్ధంగా వలస వచ్చిన మాలాంటి వాళ్లకు గ్రీన్‌కార్డులు వేగంగా ఇవ్వండి’ అని అడగడమూ, ట్రంప్ కోసం ఎన్నికల్లో ప్రచారం చేయడమూ, విరాళాలివ్వడమూ చేశారు.
ఇలాంటి వాతావరణంలో, ట్రంపునకు చెందిన రిపబ్లికన్ పార్టీ తరఫున రాజకీయాల్లోకి దిగిన వ్యక్తి, వివేక్ రామస్వామి అనే రెండో తరం భారతీయుడు (ఇండియా నుంచి వలస వచ్చిన తల్లిదండ్రులకు అమెరికాలో పుట్టిన వ్యక్తి). ఈ వివేక్ రామస్వామి చాలా చిన్న వయసులోనే కొన్ని అనుమానాస్పద పద్ధతుల ద్వారా కొన్ని వందల మిలియన్ డాలర్లు గడించినట్టు ఆరోపణలున్నాయి. క్లినికల్ పరీక్షల్లో విఫలమైన ఒక మందుకు హక్కులు సంపాదించి, దానికి పెద్ద మార్పులేమీ చేయకుండానే ఆ మందును మెరుగుపరిచామనీ, ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుందనీ ప్రకటించి... కంపెనీ షేర్లను ఎక్కువ ధరలకు అమ్ముకుని, కొన్ని వందల మిలియన్ల డాలర్లు గడించినట్టు చెబుతారు. నిజానికి ఆ మందుకీ, మొదటి మందుకీ పెద్దగా తేడా లేకపోవడం వల్ల రెండోసారి క్లినికల్ పరీక్షలో కూడా విఫలం కావడం, వివేక్ మాటలు నమ్మి కంపెనీ షేర్లు కొన్నవాళ్లు నష్టపోవడమూ జరిగిందని భోగట్టా. దీన్ని చాలామంది మోసంగా పరిగణిస్తారు, అమెరికా ప్రస్తుత చట్టాల ప్రకారం ఇది నేరం కాకపోయినా!
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం వివేక్ బరిలోకి దిగగలిగింది అలా సంపాయించిన డబ్బు బలంతోనేనని అంటుంటారు. పేరుకు అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోటీ పడినప్పటికీ, ట్రంప్ తనను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవాలనే ధ్యేయంతోనే వివేక్ ప్రచారం జరిగింది. 2023లో మొదటి రిపబ్లికన్ డిబేట్లో ట్రంప్‌ను ‘ఇరవై ఒకటో శతాబ్దపు అతిగొప్ప అధ్యక్షుడి’గా వివేక్ అభివర్ణించగా, ట్రంప్ నుంచి తిరిగి వివేక్కూ ప్రశంసలు అందాయి. ట్రంప్ అడుగులకు మడుగులొత్తినట్టు వ్యవహరించినా, చివరికి ట్రంప్ వివేక్ని ఉపాధ్యక్షుడిగా ఎంచుకోలేదు. ఆఖరికి పదవిలోకి వచ్చిన తరువాత మంత్రి పదవి కూడా ఇవ్వలేదు!
ఇప్పుడు వివేక్ ఈ నవంబరు నెలలో జరగబోయే ఎన్నికల్లో ఓహియో రాష్ట్ర గవర్నరు పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి. ఈ ఎన్నికల్లో వివేక్ ప్రత్యర్థి... డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి ‘ఏమీ యాక్టన్’. యాక్టన్ చిన్న వయసులోనే చాలా కష్టాలు పడింది. పిల్లల వైద్యంలో ఎం.డి చేసి, తరవాత ఓహియో యూనివర్సిటీలో ప్రొఫెసరుగానూ, ఓహియో రాష్ట్ర ఆరోగ్య శాఖకు డైరెక్టరుగానూ పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ఈ మధ్య వెలువడుతున్న సర్వేలు వివేక్ బాగా వెనకబడినట్టు చూపిస్తున్నాయి. ఉదాహరణకు అక్టోబర్ 15–18 తేదీల మధ్య జరిపిన మారిస్ట్ పోల్ ప్రకారం, 50శాతం మంది ఓటర్లు యాక్టన్కు అనుకూలంగానూ, 43శాతం వివేక్‌కు అనుకూలంగానూ ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో వివేక్ నుంచి ఆఖరి ప్రయత్నంగా ఒక టీవీ ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనలో వృద్ధురాలయిన యాక్టన్ తల్లి... తన కూతురు అబద్ధాలకోరు అనీ, తన జీవితమంతా అబద్ధాలాడుతూనే గడిపిందనీ, అబద్ధాలు చెప్పే అలవాటు నుంచి కోలుకోవడానికి ఆమెకే సహాయం అవసరమనీ, ఓహియో ప్రజలకు సహాయం చేసే పరిస్థితిలో తన కూతురు యాక్టన్ లేద’నీ చెప్పినట్టు ఆ వీడియోలో ఉంది.
ఈ ప్రకటన వీడియో వచ్చిన వెంటనే యాక్టన్ గురించి అప్పటిదాకా ఏమీ తెలియని వారికి చాలా విషయాలు తెలిసి వచ్చాయి. అసలు యాక్టన్కు పన్నెండేళ్ల వయసు నుంచే తల్లితో ఎటువంటి సంబంధమూ లేదు. ఆమె తొమ్మిది నుంచి పన్నెండేళ్ల వయసు వచ్చే వరకూ తన సవతి తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన విషయం అప్పట్లోనే ఆధారాలతో సహా కోర్టుదాకా వెళ్లింది. కోర్టు యాక్టన్నూ, ఆమె తమ్ముడినీ తల్లి కస్టడీ నుంచి విడిపించి, సొంత తండ్రికి అప్పగించింది. కోర్టులో క్రిమినల్ కేసు జరుగుతూ ఉండగానే యాక్టన్ తల్లి, తన కొత్త రేపిస్టు భర్తతో సహా రాష్ట్రం వదిలి పారిపోయింది. తరవాతి కాలంలో కొన్ని క్రిమినల్ కేసుల్లో వాళ్లిద్దరూ దోషులుగా కూడా తేలారు.
సహజంగానే మీడియాలోనూ జనాలలోనూ ఈ ప్రకటనపై చాలా అసహ్యం వ్యక్తమవుతోంది. వివేక్ పార్టీకే చెందిన చాలామంది ఆ ప్రకటనను ఖండించారు. ఉదాహరణకు భారత సంతతికి చెందిన ఇంకో రిపబ్లికన్ నిక్కీహేలీ అన్న మాటలు: ‘‘వివేక్ చెడ్డవాడు. ప్రతిసారీ అతను ఈ తప్పుడు పనులతో తప్పించుకుపోవడం దురదృష్టకరం’’. ఇంకొక రిపబ్లికన్ కాంగ్రెస్ మెంబర్ నాన్సీమేస్ అన్న మాటలు: ‘‘ఈ ఎన్నికల సీజన్ అంతట్లోనూ ఇది అత్యంత సిగ్గుచేటయిన, అసహ్యకరమైన, అభ్యంతరకరమైన ప్రకటన’’. అందరూ వివేక్ విడుదల చేసిన అబద్ధపు ప్రకటనను ఖండించినా, కేవలం అమెరికా అధ్యక్షుడు ట్రంపూ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాత్రం వివేక్‌ను సమర్థించుకొచ్చారు. ఆ ప్రకటనను ఆపు చేయవలసిన అవసరం లేదన్నారు! ఎన్నికల్లో గెలిచే అవకాశం కోసం తాను ఎంతకైనా దిగజారటానికి సిద్ధమని నిరూపించేలా ఉంది వివేక్ ప్రవర్తన.
ఎంతటి వివేకహీనమైన వ్యూహం వివేక్ రామస్వామిది! ఇంతగా దిగజారినా ఓహియో ప్రజలు వివేక్‌ను ఎన్నుకుంటారా? ఏమో! చాలా రేప్ ఆరోపణలు ఉన్న ట్రంప్‌నే ఒకటి కాదు, రెండుసార్లు అమెరికా మెజారిటీ ఓటర్లు ఎన్నుకోలేదా? రేప్, హత్యారోపణలు ఉన్న వ్యక్తిని ప్రస్తుతం ఇండియాలో ఒక రాష్ట్ర గవర్నరుగా నియమించినా జనాలలో ఏమన్నా వ్యతిరేకత కనిపిస్తోందా? ఓహియో ప్రజలు ఈ సందర్భంలో కొంచెం విచక్షణ చూపిస్తారని ఆశిద్దాం.
వి.ఎస్.రవి
శాండియాగో, కాలిఫోర్నియా
ఈ వార్తలనూ చదవండి:
బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్
’ఫర్జీ’ వెబ్‌సిరీస్ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు