ఆధునిక యుగపు ప్రాచీన కథకుడు
ABN , Publish Date - Oct 26 , 2026 | 02:34 AM
రాయడం మొదలుపెట్టిన కొత్తలో నాకో సమస్య ఎదురైంది: ఎలా రాయాలి? అంటే పేపర్ మీద చేత్తో రాయాలా? లేక కంప్యూటర్లో టైప్ చెయ్యాలా? ఆలోచనా ప్రవాహాన్ని అక్షరాల్లోకి మార్చి లిపిబద్ధం చేసే ఆ ప్రక్రియకి...
రాయడం మొదలుపెట్టిన కొత్తలో నాకో సమస్య ఎదురైంది: ఎలా రాయాలి? అంటే పేపర్ మీద చేత్తో రాయాలా? లేక కంప్యూటర్లో టైప్ చెయ్యాలా? ఆలోచనా ప్రవాహాన్ని అక్షరాల్లోకి మార్చి లిపిబద్ధం చేసే ఆ ప్రక్రియకి చేతిరాత సులువా? టైపింగ్ సులువా? – ఇవన్నీ ఈరోజుకీ, అంటే మూడు నవలలు రాసి ప్రచురించిన తర్వాత కూడా, నాకు అప్పుడప్పుడూ వచ్చే ఆలోచనలు.
పేపర్ వాడకం మన దేశంలో మొదలవడానికి ముందు, అందంగా కత్తిరించుకున్న తాటాకుల మీద రాసేవాళ్ళని మనకి తెలుసు. అప్పట్లో కావ్యాలూ, ప్రబంధాలూ కవులు తమ శిష్యులకి చెప్తుంటే, శిష్యులు ఆ వాగ్ధారని అంతే వేగంగా గంటంతో తాటాకుల మీద అక్షరాలుగా రాసేవాళ్ళు. మరి వాటికి కాపీలు తీయాలంటే? కొందరు నెత్తిన తాటాకుల పుస్తకాలు పట్టుకుని ఊర్లు తిరుగుతూ, ఇళ్లలో పాడైన పాత గ్రంథాలు ఏవైనా ఉంటే ప్రతులు రాసి పెడతాం అనేవాళ్ళంట. వాళ్ళని వ్రాయసకాళ్ళు అనేవాళ్ళు.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, విశ్వనాథ సత్యనారాయణ గారు తన రచనలన్నీ ఎవరికో నెరేట్ చేస్తుంటే, వాళ్ళు రాసినవేనట. అంటే మన ప్రాచీన కవుల పద్ధతి అన్నమాట.
కొంతకాలంగా విశ్వనాథ నవలలు వరసగా చదువుతున్నాను. వందా రెండువందల పేజీల నవలలే కాదు, ‘వేయి పడగలు’ లాంటి మహా ఉద్గ్రంథాలను మనసులో అక్షరీకరించి, నోటితో చెప్తుంటే ఎవరో రాసిపెట్టడం అనే ఆ ప్రాచీన ప్రక్రియ నేటి ‘Gen Z’ రచయితగా నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన రచనలు చదువుతుంటే ఆయన ఆ తిక్కన, ఎర్రన, పోతన్న, పెద్దన్న పరంపరలోనివారే అనిపించింది. Modern world's classical storyteller (ఆధునిక యుగపు ప్రాచీన కథకుడు).
వర్తమానంలో విశ్వనాథ స్థానం ఏమిటి అన్నదానికి ఉదాహారణ, ఈమధ్య రచయిత్రి అపర్ణ తోట సంపాదకత్వంలో వచ్చిన ‘అదే ప్రేమ’ అనే క్వియర్ కథా సంకలనంలో మొదటి కథ ఆయన రాసిన ‘భావనాసిద్ధి’ కావడం.
కథ మొదలుపెట్టడానికి ఒక ఎత్తుగడ కావాలి. పాఠకుడిని హుక్ చేసే ఒక ట్రిక్– ఒక సంఘటన, ఒక వాక్యం, ఒక దృశ్యం, ఇలా ఏదైనా... విశ్వనాథ వారి నవలల్లో ఇప్పటిదాకా నేను చదివిన ‘హ హ హు హు’, ‘మిహిరకులుడు’, ‘పులిముగ్గు’, ‘చెలియలికట్ట’, ‘బాణావతి’ నవలల్లో అది క్లియర్‌గా కనిపిస్తుంది. లండన్ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో రెక్కలుతెగి పడిన ఓ గంధర్వుడు కావొచ్చు; విద్య నేర్పిన గురువుగారితో తనలోని శాడిజమ్ను వివరించే రాకుమారుడు కావొచ్చు; ముందుకాళ్ళు పులివి, వెనకాళ్లు మనిషివి అయిన ఓ విచిత్ర జీవిని అన్వేషించడం కావచ్చు – అన్నీ అద్భుతమైన ఎత్తుగడలు. (ఆయనకి ఇంగ్లీషు సినిమాలు చూసే అలవాటు ఉందని ఎవరో చెప్పారు. బహుశా, వాటి ప్రభావం కొంత ఉందేమో.)
తెలుగు సాహిత్యం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు కచ్చితంగా చదవాల్సిన రచన ‘హ హ హు హు’. అది చదువున్నప్పుడు అక్కడక్కడా జోనథన్ స్విఫ్ట్ ‘గలివర్ ట్రావెల్స్’ గుర్తొచ్చింది. అలాగే ఇంగ్లీష్ ఏనిమేషన్ కామెడీ సిరీస్ ‘బోజాక్ హార్స్‌మ్యాన్’ కూడా గుర్తొచ్చింది. అందులో కూడా గుర్రం తలతో ఉండే ఒక మనిషి క్యారెక్టర్ ఉంటుంది. ఈ నవలలోనూ ఒకచోట horse man అనే మాట వస్తుంది. కొంతకాలం క్రితం ‘హ హ హు హు’ను వెల్చేరు నారాయణరావు ఇంగ్లీషులో అనువాదం చేశారు.
దీని తర్వాత నేను చదివిన నవల ‘మిహిరకులుడు’. ఇంత భీకర బీభత్స జుగుప్సాకరమైన కథని ఒక ఛాందస సనాతన సంప్రదాయవాది, ఊహించి రాశాడా అనే ఆలోచనతో ఆశ్చర్యపోతూ చదివాను. ఇప్పుడు మనం సినిమాల్లో ట్రెండ్ లాగా చూస్తున్న gory action drama లాంటి కథని ఆయన ఆ కాలంలోనే ఊహించి రాయడం, చదువుతూ ఆయన్ను నిందాస్తుతి చేస్తూనే ఉన్నాను. మధ్యమధ్య కొన్ని వాక్యాలు చాలా నచ్చాయి. ఉదాహరణకు, ‘‘మానవుని యొక్క మనస్సు పుండువంటిది. పుండు మానినట్లుండును. లోన పచ్చిగానే యుండును. నిముసములో మరల పుండగును. లేదా లోన సలపరింత యుండును. అందుచేత క్రొత్తక్రూరకర్మ కలిగినపుడు వ్యాధి తిరుగ బెట్టినట్లుండును.’’
విశ్వనాథ నేపాల రాజవంశ నవలలు, కాశ్మీర రాజవంశ నవలలు పేరుతో కొన్ని వరస నవలలు రాసారు. నేను చదివిన తర్వాతి నవల ‘పులిమ్రుగ్గు’ మగధ రాజవంశ నవలల్లోనిది. కానీ వీటికి ఆయన పురాణ వైరి గ్రంథమాల అని పేరు పెట్టారు. ఈ సిరీస్‌లో 12 నవలలు రాసారు. పురాణవైరి గ్రంథమాలలో, ఎనిమిదవ నవల ‘పులిమ్రుగ్గు’. ఈ నవల చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వీటిని చారిత్రక నవలలుగా అస్సలు పరిగణించకూడదు. చారిత్రక వ్యక్తుల పేర్లు పెట్టి తనకి నచ్చిన కథ రాసుకున్నారాయన. అచ్చంగా మధిర సుబ్బన్న దీక్షితులు కాశీమజిలీ కథల్లాగే. వాటిని ఎలా చదువుతామో, వీటిని కూడా అలాగే చదవాలి. ఈ కథలో నాకు బాగా నచ్చింది. ఆయన ఊహాశక్తి. అలాగే మనిషిలో ఉండే అనేక వికారాలు, విపరీతాలు, వాసనలు ఆయన పైపైనే అయినా ముట్టుకునే ప్రయత్నం చేశారు. మనిషికి ఉండే అనేక వికారాలలో animal fetish ఒకటి. దానిని ఈ నవలలో ప్రధానాంశంగా తీసుకోవడం, కథని ఒక థ్రిల్లర్ లాగా నడిపించడం ఈ నవల ప్రత్యేకత. ఇక ఆయన మార్కు ధర్మాధర్మ వ్యాఖ్యానాలు, విశ్లేషణలు... కొంచెం ఓపిగ్గా భరించాలి.
తర్వాత చదివింది ‘చెలియలికట్ట’. చలం ‘మైదానం’ నవలకు కౌంటర్‌గా విశ్వనాథ ఈ నవల రాసారట. స్త్రీ పురుషులు స్వేచ్ఛగా ఏ అడ్డూ అదుపూ లేకుండా జీవితాన్ని మైదానంలా అనుభవించాలి అని చలం రాస్తే, ఎగసిపడే సముద్రానికి కూడా చెలియలికట్ట ఉండాలని లేకపోతే ప్రళయం అయి ముంచెత్తుతుందని పెద్దాయన ఉద్దేశమట. ఈ నవల 1935లో రాసారు. ‘మైదానం’ అంతకుముందే వచ్చి ఉండాలి. చదువుతుంటే, నాకు ‘మైదానం’ కన్నా ఈ కథనమే (narration) ఎక్కువ నచ్చింది. మధ్య మధ్య ఆయన కొన్ని వాదనలు చదవడానికి బాగున్నాయి. ఉదాహరణకి: ‘‘లోకములో జనులెక్కువ మంది మూఢులు. ఆవేశము కొలది పరుల అనుభవము తమదిగా స్వీకరింతురు. ఆవేశము లేకుండ పూర్వుల అనుభవము సంప్రదాయమను పేర స్వీకరించుట తప్పును, తోడి వాని అనుభవము నావేశముతో క్రొత్తయని స్వీకరించుట ఒప్పునునగునో!’’ మరొకటి: ‘‘జీవితము వర్తకము వంటిది. ప్రతిదినము లాభనష్టములు చూచుకొనినచో తెలియదు. ఒక్కొక్కప్పుడు ఏ సంవత్సరమున కా సంవత్సరము లెక్కచూచినను లుగస్తాను కనిపించవచ్చును. పదియేండ్ల మొత్తముమీద నెంత పెట్టుబడి పెట్టితిమో, యెంత తిరిగి వచ్చినదో, యెంత సరుకు మిగిలినదో చూచుకొని లాభనష్టములు తేల్చుకొన వలయును.’’ ఈ నవల చదువుతున్నంతసేపూ నాకు శరత్, ఠాగూర్ గుర్తొచ్చారు. కొన్ని పంటికిందరాళ్లలా తగిలిన మాటలు కూడా ఉన్నాయి:
రంగ– మనమిరువురము బ్రాహ్మణులము. మన సంతానము బ్రాహ్మణులగుదురు.
రత్నా– బంగినపల్లి చెట్టున కాయ కాచును. ఆ కాయలో పురుగు పడినచో దానిని సేవింపరు. వర్ణము వర్ణత్వమాత్ర విశిష్టమై యేమి శోభించును? దానియందు స్వచ్ఛత్వము కూడ నుండవలయును.
– ఆడామగా అన్న గీతలే చెరిగిపోతున్న ఈ కాలంలో racial purity గురించి రాసిన ఈ నవలని ఎలా చూడాలి?
తన రచనలు భవిష్యత్ తరాల వాళ్ళు చదవకుండా గ్రాంథికంలో రాసి ఆయనే జాగ్రత్తపడ్డాడు. వాటిని సులభ వ్యవహారికంలోకి మార్చే ప్రయత్నం వారి వారసులు చేస్తారనైతే అనుకోవడం లేదు.
‘చెలియలికట్ట’ తర్వాత చదివింది ‘బాణావతి’, ఆయనే స్వయంగా చెప్పిన ఆత్మాకథాత్మక దెయ్యాల కథ. ఆయన కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసిన కాలంలో అక్కడి వాతావరణం, తోటి అధ్యాపకులతో హాస్య సంభాషణలు ఇందులో ప్రత్యేక ఆకర్షణ. చదువుతూ అనుకున్నా-– బహుశా ఇది తెలుగులో మొదటి హారర్ నవల ఏమో అని.
విశ్వనాథ రచనలు చదవాలా వద్దా అనేది పాఠకుల ఛాయిస్, కానీ రచనా ప్రక్రియ పట్ల ఆసక్తి ఉన్న నవతరం కచ్చితంగా ఆయన్ని చదవాలి. తెలుగు నవలా సాహిత్యపు స్థాయి ఎంతటిదో ఓ అవగాహన రావాలన్నా ఆయన నవలలు కచ్చితంగా చదవాలి. ఆయన అంత రచయిత తెలుగు సాహిత్యంలో ఆయనకి ముందూ ఆ తర్వాతా, కుడివైపూ లేరు, ఎడమవైపూ లేరు. ఉండకపోవడమే మంచిదేమో! ఇంకో విశ్వనాథని తట్టుకోవడం కష్టం.
ప్రసాద్ సూరి
91336 08072
ఇవి కూడా చదవండి..
ముంబైలో తీవ్ర వాయు కాలుష్యం.. దుమ్ము, వాహనాల పొగ, నిర్మాణ పనులే ప్రధాన కారణాలు..
మామ ఇంట్లో బంగారం కాజేసి థార్ కొన్నాడు.. పూజకు ఆ మామనే ఆహ్వానిస్తే..