Share News

విశ్వనాథ సమగ్ర దర్శనానికి ‘జెన్‌ జీ’ కళ్ళద్దాలు చాలవేమో!

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:22 AM

‘వివిధ’ సాహిత్య వేదికలో యువ రచయిత ప్రసాద్ సూరి కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి నవలలపై చేసిన విశ్లేషణ చదివాను (‘ఆధునిక యుగపు ప్రాచీన కథకుడు: 26.10.2026). విశ్వనాథ వారి...

విశ్వనాథ సమగ్ర దర్శనానికి ‘జెన్‌ జీ’ కళ్ళద్దాలు చాలవేమో!

‘వివిధ’ సాహిత్య వేదికలో యువ రచయిత ప్రసాద్ సూరి కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి నవలలపై చేసిన విశ్లేషణ చదివాను (‘ఆధునిక యుగపు ప్రాచీన కథకుడు: 26.10.2026). విశ్వనాథ వారి రచనా వైభవాన్ని ప్రశంసిస్తూనే, ఆయన దృక్పథాన్ని, భాషను, తాత్వికతను ఆధునిక కొలమానాలతో—ముఖ్యంగా పాశ్చాత్య పాప్-కల్చర్ దృష్టితో—అర్థం చేసుకునే ప్రయత్నం ఆ వ్యాసంలో కనిపించింది. ‘‘చదువుతూ ఆయన్ను నిందాస్తుతి చేస్తూనే ఉన్నాను’’ అని వ్యాసకర్త స్వయంగా చెప్పుకున్నట్లుగానే, ఆ వ్యాసంలో ఒకింత సందిగ్ధత, పాక్షిక అవగాహన కనిపించాయి. ఒక కాలపు రచయితను మరో కాలపు పాఠకుడు అంచనా వేసేటప్పుడు దొర్లే సహజమైన పొరపాట్లను సాహిత్య విమర్శ కోణం నుండి పరిశీలించాలి.

వ్యాసకర్త విశ్వనాథ వారు చెప్తుంటే ఇతరులు రాసేవారని, అది ప్రాచీన వ్రాయసకాళ్ల పద్ధతి అని పేర్కొన్నారు. విశ్వనాథ అనుసరించిన ఉక్తలేఖనం (Dictation) కేవలం పాత పద్ధతిని అనుకరించడం కాదు; అది ఆయన చిత్తైకాగ్రతకు, ధారణా శక్తికి సంబంధించిన అంశం. ‘వేయి పడగలు’ వంటి బృహత్ నవలనైనా, ‘రామాయణ కల్పవృక్షం’ లాంటి మహాకావ్యాన్నైనా మనసులోనే రూపుదిద్దుకుని, ఆశువుగా చెప్పగలగడం వెనుక నిరంతర అభ్యాసం ఉంది. దాన్ని కేవలం ఒక ‘ప్రాచీన టెక్నిక్’గా మాత్రమే చూడటం ఆ రచనా ప్రక్రియ వెనుక ఉన్న మేధోశ్రమను తక్కువగా అంచనా వేయడమే.

విశ్వనాథ నవలా ఎత్తుగడలను మెచ్చుకుంటూ, వాటిని పాఠకుడిని ఆకర్షించే ‘ట్రిక్’ అనడం, ఆయనపై ఇంగ్లీషు సినిమాల ప్రభావం ఉందేమోనని ఊహిం చడం తర్కానికి నిలవదు. విశ్వనాథ వారికి ఆంగ్ల సాహిత్యంతో గాఢమైన పరిచయం ఉన్న మాట వాస్తవమే అయినా, ఆయన కల్పనా శక్తికి ప్రధాన మూలం భారతీయ పురాణేతిహాసాలు, కథాసరిత్సాగరం వంటి ప్రాచీన వాఙ్మయం. వ్యాసకర్త ‘హాహా హూహూ’ నవలను ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ సిరీస్ ‘బోజాక్ హార్స్‌మ్యాన్’తో పోల్చడం ఆ నవల పరిధిని కుదించడమే. ‘హాహా హూహూ’ కేవలం గుర్రం తల ఉన్న మనిషి వింత కథ కాదు; లండన్ వీధుల్లో పడ్డ గంధర్వుడి ద్వారా పాశ్చాత్య భౌతికవాదాన్ని, ఆధునిక విజ్ఞాన శాస్త్రపు పరిమితులను తాత్విక దృష్టితో విమర్శించిన వ్యంగ్య రచన (Philosophical Satire). అంతర్లీనంగా ఉన్న ఈ తాత్విక చర్చను వదిలేసి, కేవలం గుర్రం తల ఆకారాన్ని బట్టి ఒక కార్టూన్ క్యారెక్టర్‌తో పోల్చడం సరికాదు.


అలాగే ‘పులిమ్రుగ్గు’ నవలను ప్రస్తావిస్తూ, ‘‘వీటిని చారిత్రక నవలలుగా అస్సలు పరిగణించకూడదు, తనకి నచ్చిన కథ రాసుకున్నారు, అచ్చంగా కాశీమజిలీ కథల్లాగే చదవాలి’’ అనడం విశ్వనాథ వారి చారిత్రక నవలా నేపథ్యాన్ని విస్మరించడమే. విశ్వనాథ వారు ‘పురాణవైరి గ్రంథమాల’ రాయడానికి ఆ నాటి వలసవాద చరిత్ర రచనా విధానం ఒక ప్రధాన కారణం. బ్రిటిష్ చరిత్రకారులు భారతీయ పురాణాల్లోని రాజవంశాల కాలాన్ని కుదించి రాశారనే బలమైన అభిప్రాయంతో, పురాణాల ఆధారంగా చరిత్రను పునర్నిర్మించాలనే ఉద్దేశంతో ఆయన ఆ నవలలు రాశారు. ఆయన ఎంచుకున్న చారిత్రక ఆధారాలతో మనం ఏకీభవించకపోయినా, ఆ రచనల వెనుక ఒక నిర్దిష్టమైన సైద్ధాంతిక లక్ష్యం ఉందనేది వాస్తవం. ఆయన ధర్మాధర్మ విశ్లేషణలను ‘‘ఓపిగ్గా భరించాలి’’ అనడం నేటి తరం పాఠకుల అభిరుచిలో వచ్చిన మార్పు సూచిస్తుంది. కథా వేగానికి ప్రాధాన్యమిచ్చే ఆధునిక పాఠకులకు ఆ తాత్విక చర్చలు భారంగా అనిపించవచ్చు కానీ, ఆ విశ్లేషణలే విశ్వనాథ రచనా శైలికి ఆధారం.

‘చెలియలికట్ట’ నవలలోని సంభాషణలను ఉటంకిస్తూ, విశ్వనాథ వారు ‘Racial purity’ (జాతి స్వచ్ఛత) గురించి రాశారని వ్యాసకర్త అభిప్రాయపడ్డారు. ఇక్కడ పాశ్చాత్య ప్రపంచంలోని ‘రేసిజం’ (జాతి వివక్ష) అనే భావనను, నాటి భారతీయ సాంప్రదాయంలోని వర్ణ వ్యవస్థ ప్రస్తావనను ఒకే గాటన కట్టడం చారిత్రక తప్పిదమవుతుంది. విశ్వనాథ ఆ నవలలో సంప్రదాయ కుటుంబ వ్యవస్థ, వివాహ బంధం, సంయమనం లేని వ్యక్తిగత స్వేచ్ఛ వల్ల వచ్చే పరిణామాలను తన దృక్కోణం నుండి చర్చించారు. అంతేకాక, ఒక నవలలో పాత్రల స్వభావాన్ని బట్టి వచ్చే సంభాషణలను ఆ నాటి సామాజిక పరిస్థితుల నుండే చూడాలి తప్ప, నేటి సమకాలీన పదజాలంతో (Woke terminology) కొలవడం సాహిత్య విమర్శలో సరైన పద్ధతి కాదు.

‘‘తన రచనలు భవిష్యత్ తరాల వాళ్ళు చదవకుండా గ్రాంథికంలో రాసి ఆయనే జాగ్రత్తపడ్డాడు. వాటిని సులభ వ్యవహారికంలోకి మార్చే ప్రయత్నం వారి వారసులు చేస్తారనైతే అనుకోవడం లేదు’’ అనే వ్యాఖ్యలో రచయిత శైలి పట్ల అసహనం కనిపిస్తోంది. విశ్వనాథ నవలల్లో వాడింది కఠిన గ్రాంథికం కాదు, కథా కాలానికి తగిన గాంభీర్యాన్ని ఇచ్చే ప్రౌఢ వ్యవహారిక శైలి. ఏ రచయితకైనా భాషా శైలి అనేది వారి సొంత ముద్ర. షేక్స్‌పియర్ ఇంగ్లీషు కష్టంగా ఉందని దాన్ని నేటి వాడుక భాషలోకి మార్చితే ఆ నాటకాల గాంభీర్యం దెబ్బతింటుంది. అలాగే విశ్వనాథ వారి వాక్య నిర్మాణంలోనే ఆ పాత్రల జీవం, ఆ కాలానికి చెందిన వాతావరణం ఉంటాయి. పాఠకుడే రచయిత శైలికి అలవాటు పడాలి కానీ, క్లాసిక్ రచనలను సులభ వ్యవహారికంలోకి మార్చాలనుకోవడం ఆ రచనల మూల స్వరూపాన్ని దెబ్బతీయడమే అవుతుంది.


వ్యాసం చివరలో ‘‘ఆయన అంత రచయిత ముందు, తర్వాతా లేరు’’ అంటూనే, ‘‘ఇంకో విశ్వనాథని తట్టుకోవడం కష్టం’’ అని ముగించారు. సంక్లిష్టమైన తాత్విక చర్చల కంటే వేగవంతమైన కథనాన్ని ఇష్టపడే నేటి తరానికి– జీవితాన్ని, ధర్మాన్ని, మానవ స్వభావపు లోతుల్ని తనదైన శైలిలో సుదీర్ఘంగా చర్చించే విశ్వనాథ రచనలు ఒకింత భారంగా అనిపించడం సహజమే.

విశ్వనాథ సత్యనారాయణ గారిని చదవడం అంటే కేవలం పేజీలు తిప్పడం కాదు; అది ఒక భిన్నమైన తాత్విక ప్రపంచంలోకి ప్రవేశించడం. ఆయన సామాజిక, సాంప్రదాయక దృక్పథాలతో నేటి తరం ఏకీభవించకపోవచ్చు.. అయితే, ఆ విమర్శ చేసేటప్పుడు ఆయన సాహిత్య పరిధిని, నాటి చారిత్రక నేపథ్యాన్ని లోతుగా అధ్యయనం చేయాలి.

కోడీహళ్ళి మురళీమోహన్

93916 71256

ఈ వార్తలు కూడా చదవండి

ఓట్‌చోరీపై రాంలీలా మైదాన్‌లో పోరాటం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో 29 తులాల బంగారం మాయం

Updated Date - Nov 02 , 2026 | 02:22 AM