Share News

డేటా సెంటర్లకు తాగు నీరు.. ఒక దుష్ప్రచారమే!

ABN , Publish Date - Sep 01 , 2026 | 01:45 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రేపు పాయకరావుపేట వద్ద జరుగనున్న ‘జలహారతి’ కార్యక్రమం ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల కాబోతున్నాయి. ఒకవైపు ఇలా పోలవరం...

డేటా సెంటర్లకు తాగు నీరు.. ఒక దుష్ప్రచారమే!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రేపు పాయకరావుపేట వద్ద జరుగనున్న ‘జలహారతి’ కార్యక్రమం ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల కాబోతున్నాయి. ఒకవైపు ఇలా పోలవరం కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర ముఖద్వారాన్ని తాకుతుంటే, మరోవైపు ఈ నీటి వినియోగంపై దుష్ప్రచారం పెచ్చుమీరుతున్నది. విశాఖపట్నం నగరవాసులకు దక్కాల్సిన మంచినీటిని ఈ డేటా సెంటర్లు తోడేస్తాయన్నది ఈ ప్రచారం సారాంశం.

కానీ, శాసనసభలో ఐటీ మంత్రి లోకేశ్‌ ఇచ్చిన అధికారిక సమాచారం, క్షేత్రస్థాయి ఇంజనీరింగ్ డేటాను పరిశీలిస్తే, ఈ ఆరోపణలన్నీ అవగాహనా రాహిత్యంతో చేస్తున్నవేనని తెలుస్తుంది. విశాఖపట్నం ప్రజల మున్సిపల్ తాగునీటి సరఫరా వ్యవస్థకు, గూగుల్ డేటా సెంటర్లకు వాడే నీటి వ్యవస్థకు సాంకేతికంగా కానీ, భౌతికంగా కానీ ఎటువంటి సంబంధమూ లేదు. విశాఖపట్నం ప్రజల కోసం కేటాయించిన ఒక్క నీటి చుక్కను కూడా ప్రభుత్వం పరిశ్రమలకు మళ్లించదని మంత్రి లోకేశ్‌ స్పష్టంగా చెప్పారు.

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా విశాఖ–అనకాపల్లి ప్రాంతానికి అందుబాటులోకి వచ్చే మొత్తం 23.44 టీఎంసీల నీటిలో ప్రభుత్వం స్పష్టమైన విభజనను అమలు చేస్తోంది. గ్రేటర్ విశాఖపట్నం, పరిసర పట్టణాల్లోని ఇళ్లకు వాడే మంచినీటి కోసం 12 టీఎంసీలు కేటాయించారు. ఈ కోటాను పరిశ్రమలకు మళ్లించడం అసాధ్యం. గూగుల్, అదానీ ఏఐ డేటా సెంటర్ల పూర్తి స్థాయి వినియోగానికి కావలసిన 3.5 టీఎంసీలతో కలుపుకుని, పారిశ్రామిక కారిడార్ అవసరాలకు మొత్తం 4 టీఎంసీలు కేటాయించారు. ఇక అనకాపల్లి, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 7.44 టీఎంసీలు కేటాయించారు. ప్రతి ఏడాది సముద్రంలో వృథాగా కలిసే 3,000 టీఎంసీల గోదావరి జలాల నుంచే ఈ కేటాయింపులు జరుగుతున్నాయి తప్ప, రైతుల కోసమో, నగరవాసుల కోసమో కేటాయించిన నీటిని ప్రభుత్వం తీసుకోవడం లేదు.


గూగుల్, అదానీ డేటా సెంటర్ల కోసం నిర్మించే నీటి లైన్లు మిగతా వాటితో పూర్తిగా సంబంధం లేకుండా ఉంటాయి. నగరంలో ఇళ్ళకు నీటిని సరఫరా చేసే మున్సిపల్ పైప్‌లైన్లకు, గ్రేటర్ జీవీఎంసీ నిర్వహించే తాగునీటి రిజర్వాయర్లకు ఈ పారిశ్రామిక పైప్‌లైన్లతో ఎలాంటి కనెక్షన్‌ ఉండదు. కాబట్టి డేటా సెంటర్లు ఎంత నీటిని వినియోగించినా అది నగరవాసుల తాగునీటి సరఫరాపై ఎటువంటి ప్రభావాన్నీ చూపించదు.

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఈ ప్రాంతానికి నీటిని తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో సుమారు రూ.1,050కోట్లు ఖర్చు చేసి, కాలువ నిర్మాణంలో ఉన్న అనేక అడ్డంకులను తొలగించింది. 181.99కి.మీ పొడవైన ఈ ఎడమ ప్రధాన కాలువలో మట్టి తవ్వకం పనులు దాదాపు పూర్తయ్యాయి. కాలువ ద్వారా ఇప్పటికే తూర్పు గోదావరి, పిఠాపురం పరిసర ప్రాంతాలకు నీరు ప్రవహిస్తోంది. అనకాపల్లి వద్దకు చేరుకొనే ఈ జలాల నుంచే ఒకవైపు వ్యవసాయ భూములకు సాగునీరు, మరోవైపు పరిశ్రమలకు ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా నీటి తరలింపు జరుగుతుంది.

ప్రభుత్వం గూగుల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలకు ప్రజాధనంతో ఉచితంగా నీటి మౌలిక వసతులను కల్పిస్తోందనే ఆరోపణ పూర్తిగా వాస్తవదూరం. పోలవరం ప్రధాన ప్రాజెక్టు మౌలిక వసతులను ప్రభుత్వం పూర్తి చేస్తున్నప్పటికీ, ఈ కాలువ నుంచి తార్లవాడ, అడవివరం, రాంబిల్లి వంటి డేటా సెంటర్ కారిడార్ క్యాంపస్‌లకు నీటిని తీసుకెళ్లే బల్క్ ఇన్–టేక్, ప్రాజెక్టు అంతర్గత మౌలిక సదుపాయాల వ్యయాన్ని రాష్ట్ర పారిశ్రామిక కేటాయింపుల విధానాలకు, ఆయా సంస్థలతో చేసుకున్న ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే చేపడుతున్నారు. దీని ద్వారా సాధారణ పన్ను చెల్లింపుదారులపైన గానీ, నగర మున్సిపల్ నిధులపైన గానీ ఎలాంటి అనవసర భారమూ పడదు.


ఇక డేటా సెంటర్లు నీటిని తాగేస్తాయన్న ప్రచారం కూడా నిజం కాదు. ఐటీ, పర్యావరణ నిబంధనల ప్రకారం, గూగుల్ వంటి సంస్థలు అత్యంత అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తున్నాయి. వారు వాడే క్లోజ్డ్–లూప్ ఎయిర్–కూలింగ్ టెక్నాలజీల వల్ల ఇతర భారీ పరిశ్రమలతో పోలిస్తే నీటి వాడకం అత్యంత తక్కువ. విశాఖపట్నం ఐటీ కారిడార్ దాని గరిష్ఠ సామర్థ్యమైన 6.5 గిగావాట్లకు చేరుకున్నప్పుడు మాత్రమే డేటా సెంటర్లకు ఏటా 3.0 నుంచి 3.5 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ఏటా గోదావరి నుంచి సముద్రంలో వృథాగా కలిసే 3 వేల టీఎంసీల జలాలతో పోలిస్తే ఇది కేవలం 0.1శాతం మాత్రమే.

డేటా సెంటర్ల నిర్మాణంలోని ప్రస్తుత దశలో అతి తక్కువ నీరు సరిపోతుంది. 2028–29 నాటికి ఫేజ్ 1 ప్రారంభ సమయానికి సర్వర్ల కమిషనింగ్ మొదలైనప్పుడే అసలు నీటి వాడకం ప్రారంభమవుతుంది. అంటే, నగరానికి శాశ్వత తాగునీటి పైప్‌లైన్లు పూర్తయిన తర్వాతే డేటా సెంటర్ల వాడకం క్రమంగా పెరుగుతుంది.

మరోపక్క గూగుల్ సంస్థ కూడా 2030 నాటికి వాటర్ పాజిటివ్ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అంటే, వినియోగించే నీటి కంటే ఎక్కువ నీటిని స్థానిక భూ గర్భజలాల పునరుద్ధరణ ద్వారా, రీసైక్లింగ్‌ ద్వారా, చెరువుల పునరుజ్జీవనం ద్వారా తిరిగి సమాజానికి అందిస్తుందన్నమాట. పరిశ్రమల కోసం కేటాయించిన 4 టీఎంసీల కోటాకు అదనంగా, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను, 100 ఎంఎల్డీ సామర్థ్యంతో ప్రతిపాదించిన సముద్రపు నీటి శుద్ధీకరణ ప్లాంట్లను ప్రత్యామ్నాయ వనరులుగా డాటా సెంటర్లకు ఉపయోగిస్తారు. దీనివల్ల వేసవిలో కూడా నగరానికి అందే మంచి నీటి నిల్వల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా పరిశ్రమలకు మళ్లించాల్సిన అవసరం ఉండదు.

విశాఖ తీర ప్రాంతంలో చేపడుతున్న ఆందోళనలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవీ లేదా సమాచార లోపం వల్ల చేస్తున్నవి. విశాఖపట్నంలో ప్రస్తుతం రోజువారీ నీటి డిమాండ్ 480 మిలియన్ లీటర్లు కాగా, సరఫరా 410 మిలియన్ లీటర్లు మాత్రమే. ఈ పాత కొరతను సాకుగా చూపిస్తూ, ‘మనం డేటాను తాగలేం’ వంటి ఆకర్షణీయమైన నినాదాలతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. అంతా పారదర్శకమైన విధానాల ద్వారాను, స్పష్టమైన చట్టబద్ధమైన కేటాయింపుల మార్గంలోను జరుగుతున్నప్పుడు విపక్షాల అసత్య ప్రచారాలను పక్కన పెట్టాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ సాంకేతిక విప్లవాన్ని స్వాగతించాలి.

నీలాయపాలెం విజయ్‌కుమార్

జాతీయ అధికార ప్రతినిధి– తెలుగుదేశం పార్టీ

ఇవి కూడా చదవండి..

ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..

భారత్, బంగ్లాదేశ్ సిరీస్‪పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!

ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి

Updated Date - Sep 01 , 2026 | 01:45 AM