విశాఖ సదస్సు: రాష్ట్ర భవితకు నవారంభం!
ABN , Publish Date - Nov 18 , 2026 | 03:14 AM
ప్రవాసాంధ్రుడిగా విదేశాల్లో ఎన్నో అంతర్జాతీయ వ్యాపార సదస్సులు, పెట్టుబడిదారుల సమావేశాలు, సాంకేతిక ప్రదర్శనలు చూసే అవకాశం నాకు కలిగింది. కానీ నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో...
ప్రవాసాంధ్రుడిగా విదేశాల్లో ఎన్నో అంతర్జాతీయ వ్యాపార సదస్సులు, పెట్టుబడిదారుల సమావేశాలు, సాంకేతిక ప్రదర్శనలు చూసే అవకాశం నాకు కలిగింది. కానీ నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన 31వ ‘కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ (సీఐఐ) భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నప్పుడు కలిగిన అనుభూతి మాత్రం ప్రత్యేకం. నాకు అక్కడ కనిపించింది కేవలం పెట్టుబడుల కోసం జరుగుతున్న సమావేశం కాదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పెట్టుబడుల పటంలో తనదైన స్థానం సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక గొప్ప ప్రయత్నం. 109 అవగాహన ఒప్పందాలు, రూ.9,02,434 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు, రెండు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాల అంచనా... ఇవి నిజంగా ఆశాజనకమైన సంఖ్యలు.
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం, విద్య, ఐటీ అని ప్రధానంగా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, డ్రోన్లు వంటి భవిష్యత్తును నిర్ణయించే రంగాల గురించి అంతర్జాతీయ వేదికపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాకెట్ ఇంజిన్లు, ఉపగ్రహాలు, ఏరోస్పేస్ తయారీ, రక్షణ సాంకేతికత వంటి రంగాల్లో మన రాష్ట్రానికి అవకాశాలు రావడం ఒక ముఖ్యమైన పరిణామం. అలాగే క్వాంటం టెక్నాలజీకి ప్రత్యేక విధానంతో ముందడుగు వేస్తున్న తొలి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండటం గర్వకారణం.
ప్రపంచం ఏ దిశగా వెళ్తోందో తెలుసుకుని, ఆ మార్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అవకాశాలు వెతకడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రత్యేకత. మరోవైపు నారా లోకేశ్... పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, సాంకేతిక రంగ ప్రతినిధులను ప్రోత్సహిస్తున్న విధానం కూడా ఆకట్టుకుంది. చంద్రబాబు దూరదృష్టి, లోకేశ్ సాంకేతిక దృక్పథం, ప్రజల పట్ల పవన్ కల్యాణ్ నిబద్ధత– ఈ మూడు కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంచి అవకాశాన్ని సృష్టిస్తున్నాయి.
అమెరికా, రష్యా, జపాన్, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల దౌత్య ప్రతినిధులతో జరిగిన సమావేశాలు, చర్చల్లో నాకు స్పష్టంగా కనిపించిన విషయం ఒక్కటే– ప్రపంచంతో సంబంధాలు పెంచుకోవడమంటే కేవలం పెద్ద కంపెనీలను ఆహ్వానించడం కాదు; మన రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు, విద్యార్థులు, స్టార్టప్‌లు అంతర్జాతీయ అవకాశాలను అందుకునేలా చేయడం కూడా.
విదేశీ పెట్టుబడులు మన రాష్ట్రానికి రావాలి. అదే సమయంలో మన రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు విదేశీ మార్కెట్లకు చేరాలి. మన యువత ప్రపంచస్థాయి పరిశ్రమలతో కలిసి పనిచేయాలి. మన గ్రామాల్లోని చిన్న పరిశ్రమలు కూడా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో భాగం కావాలి. అప్పుడే ఈ అంతర్జాతీయ భాగస్వామ్యాలకు నిజమైన అర్థం ఉంటుంది. ఒప్పందాల మీద సంతకం చేయడం ప్రారంభం మాత్రమే. అవి పరిశ్రమలుగా మారాలి. పరిశ్రమలు ఉద్యోగాలను సృష్టించాలి. ఆ ఉద్యోగాలు మన యువత జీవితాలను మార్చాలి. ప్రతి ఒప్పందానికి స్పష్టమైన కార్యాచరణ, నిర్ణీత కాలపరిమితి, నిరంతర పర్యవేక్షణ ఉండాలి. పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు త్వరగా రావాలి. అలాగే పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలను మన విద్యాసంస్థలు ముందుగానే అభివృద్ధి చేయాలి. ఆంధ్రప్రదేశ్‌కు అవకాశాల కొరత లేదు. మన దగ్గర ప్రతిభావంతులైన యువత ఉన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు, నిపుణులు ఉన్నారు. వీటన్నింటినీ ఒకే దిశగా నడిపించగలిగితే ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు. విశాఖలో నేను చూసింది రేపటి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండగలదో అని. ప్రపంచం ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం మొదలుపెట్టింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిదీ!
అశోక్‌బాబు కొల్లా
ప్రవాసాంధ్రుడు, పారిశ్రామికవేత్త
ఈ వార్తలనూ చదవండి:
వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!