Share News

అపోహల నుంచే డేటా సెంటర్లపై భయాలు!

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:05 AM

విశాఖలో గూగుల్‌తోపాటు కొన్ని ప్రసిద్ధ కంపెనీలు కలిసి 6.5 గిగావాట్ల ఏఐ డేటా సెంటర్లను మరో నాలుగేళ్లలో ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ విషయమై కొన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి! విశాఖలో నీటి కొరత...

అపోహల నుంచే డేటా సెంటర్లపై భయాలు!

విశాఖలో గూగుల్‌తోపాటు కొన్ని ప్రసిద్ధ కంపెనీలు కలిసి 6.5 గిగావాట్ల ఏఐ డేటా సెంటర్లను మరో నాలుగేళ్లలో ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ విషయమై కొన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి! విశాఖలో నీటి కొరత వస్తుందని, కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, పర్యావరణ సమస్యలు వస్తాయని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే డేటా సెంటర్ల ఏర్పాటులో కొత్తగా వచ్చిన మార్పులను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తుగా తీసుకుంటున్న జాగ్రత్తలను గమనించకుండా వీరంతా ఈ వాదనలు చేస్తున్నారు.

అమెరికాతో పాటు యూరప్‌లోని నెదర్లాండ్, ఐర్లాండ్ దేశాలలో ప్రజలకు అందిస్తున్న విద్యుత్ గ్రిడ్ నుంచి విద్యుత్‌ను, ప్రజా అవసరాలకు ఉపయోగించే నీరు నుంచి నీటిని డేటా సెంటర్లకు వాడటం వల్ల సమస్యలు తలెత్తాయి. అదే నార్దిక్ దేశాలైన నార్వే, ఐస్‌లాండ్ లాంటి దేశాలు వంద శాతం పవన, జల విద్యుత్‌ను వాడుకొని విజయవంతమైన గ్రీన్ డేటా హబ్‌లుగా మారాయి. మన ఏపీ కూడా అదేవిధంగా గ్రీన్ డేటా హబ్‌గా మారబోతోంది.

సోలార్, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ ముందంజలో ఉంది. ఇప్పటికే 9.5 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం ఏపీకి ఉన్న ప్రత్యేక అనుకూలతల కారణంగా సోలార్ విద్యుత్ 38 గిగావాట్లు, పవన విద్యుత్ 44 గిగావాట్లు, పంప్డ్ స్టోరేజీ 42 గిగావాట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అంటే మొత్తం 124 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే శక్తి ఏపీకి ఉంది. కానీ విశాఖలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లకు కావాల్సింది కేవలం 6.5 గిగావాట్ల విద్యుత్ మాత్రమే. డేటా సెంటర్ల నిర్మాణం దశల వారీగా 2028 అక్టోబర్ నుంచి 2031 వరకు జరుగుతుంది. దీనికి తగ్గట్లు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేలా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది.

2028 నాటికి ఏపీలో అదనంగా 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతోంది. కానీ 2028 నాటికి ఏపీలో 2 గిగావాట్ల డేటా సెంటర్లు మాత్రమే పనిచేయడం ప్రారంభిస్తాయి. వాటి వినియోగానికి పోనూ 16 గిగావాట్ల అదనపు విద్యుత్ ఉంటుంది. అదే 6.5 గిగావాట్ల డేటా సెంటర్లు మొత్తం ఆపరేషన్‌లోకి వచ్చే నాటికి ఏపీలో 35 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ రెడీగా ఉంటుంది. డేటా సెంటర్ల విద్యుత్‌ను ఆయా కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ గ్రిడ్ నుంచి కాకుండా గ్రీన్ ఎనర్జీ కంపెనీల నుంచి నేరుగా కొనుక్కునేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ప్రజలకు, ఇతర ఇండస్ట్రీలకు రాష్ట్ర ప్రభుత్వ గ్రిడ్ నుంచి అందే విద్యుత్‌లో ఒక్క యూనిట్ కూడా డేటా సెంటర్లకు వెళ్లదు.


డేటా సెంటర్లను పాత ఏసీ కూలింగ్ విధానంలో కూల్ చేస్తే అత్యధికంగా నీరు అవసరమవుతుంది. మొదట్లో అమెరికా, యూరప్‌లోని కొన్ని దేశాలు ఈ విధానాన్ని పాటించబట్టే సమస్యలు వచ్చాయి. కానీ ప్రస్తుతం గూగుల్‌తో పాటు అన్ని సంస్థలు డైరెక్ట్ టూ చిప్ కూలింగ్ సిస్టమ్‌ను వాడుతున్నాయి. ఈ విధానం కోసం ప్రజలు ఉపయోగించే మంచినీళ్లను కాకుండా సముద్రపు ఉప్పు నీటిని మంచినీటిగా మార్చి వాడతారు. విశాఖలోనూ ఇదే విధంగా సముద్రం ఒడ్డున మొదటి దశలో 100 ఎం.ఎల్.డి సామర్థ్యంతో డీశాలినేషన్ ప్లాంట్‌ను 2028 నాటికి నిర్మించబోతున్నారు. 2028 నాటికి ఏర్పాటయ్యే రెండు గిగావాట్ల డేటా సెంటర్లకు 50 నుంచి 55 ఎం.ఎల్.డి నీరు మాత్రమే అవసరమవుతుంది. కానీ అప్పటికి 100 ఎం.ఎల్.డి ప్లాంట్ సిద్ధంగా ఉంటుంది. మొత్తం 6.5 గిగావాట్ డేటా సెంటర్లకు రోజుకు 160 ఎం.ఎల్.డి నీరు అవసరమవుతుంది. అప్పటికల్లా మరో 100 ఎం.ఎల్.డి ప్లాంట్ కట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

డేటా సెంటర్లు రాత్రి పూట పెద్ద శబ్దాలను పుట్టిస్తాయని, ఈ శబ్దాలు 1.5 కిలోమీటర్ల దాకా కూడా వినిపిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత కాలపు కూలింగ్ సిస్టమ్స్ వాడితేనే ఈ రకమైన శబ్దం వస్తుంది. కానీ ప్రస్తుత పర్యావరణ నిబంధనల ప్రకారం డేటా సెంటర్లు వాటి కాంపౌండ్ వాల్ దాటి బయటకు వచ్చే శబ్దాన్ని రాత్రి వేళల్లో 45 డెసిబెల్స్‌కు పరిమితం చేయాలి. వారు నిర్మించే శబ్దాన్ని నిరోధించే గోడలు, సైలెన్సర్లు 80–90 డెసిబెల్స్ ఉన్న యంత్రాల శబ్దాన్ని కేవలం వంద మీటర్ల లోపే 45 డెసిబెల్స్‌కి తగ్గించేస్తాయి. సరిహద్దు వద్దే 45 డెసిబెల్స్‌కి పడిపోయిన శబ్దం, అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించేసరికి గాలిలో కలిసిపోయి 20 నుంచి 25 డెసిబెల్స్‌కి పడిపోతుంది. ఇది మనం గుసగుసలాడుకునే శబ్దం లేదా లైబ్రరీలో ఉండే నిశ్శబ్దం కంటే తక్కువ! విశాఖలో నిర్మించే డేటా సెంటర్లు ప్రజా నివాసాలకు 1.5కి.మీ నుంచి 4కి.మీ దూరంగా ఉన్నాయి. డేటా సెంటర్ల శబ్దాలతో ఇబ్బంది అనే సమస్య ఉత్పన్నం కాదు. అయితే పర్యావరణ నిబంధనల ప్రకారం డేటా సెంటర్లు నిర్మించేలా ప్రభుత్వం పర్యవేక్షించాలి.

గమిడి శ్రీనివాస్

ఇవీ చదవండి:

ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు

ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్‌ రైల్ ప్లాన్

Updated Date - Jul 09 , 2026 | 04:05 AM