Share News

కాలంతోపాటు  మారుతూనే ఉన్నాం!

ABN , Publish Date - Oct 19 , 2026 | 05:19 AM

విప్ల‌వ ర‌చయితల సంఘానికి (విరసం) కాలం చెల్లిందని విక్టర్ విజయ్‌కుమార్ రాశారు (వివిధ, 21.09.2026). విరసం ఏర్ప‌డిన‌ కొత్తల్లో సాహిత్యంలోకి నక్సలైట్లు జొరబడ్డారని, ఆ సంస్థను నిషేధించాలని...

కాలంతోపాటు  మారుతూనే ఉన్నాం!

విప్ల‌వ ర‌చయితల సంఘానికి (విరసం) కాలం చెల్లిందని విక్టర్ విజయ్‌కుమార్ రాశారు (వివిధ, 21.09.2026). విరసం ఏర్ప‌డిన‌ కొత్తల్లో సాహిత్యంలోకి నక్సలైట్లు జొరబడ్డారని, ఆ సంస్థను నిషేధించాలని విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహ శాస్త్రి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు ఏ మర్యాద అడ్డు వచ్చిందో, లేక మరీ అలా అంటే తన ఉదారవాద మేధో ముసుగు తొలగిపోతుందనుకున్నారో తెలియదుగానీ విజయ్‌కుమార్ ఆ మాట అనలేదు. కానీ సంస్థను రద్దు చేసుకోమని, రెండేళ్ల విరామం ప్రకటించమని విరసానికి సలహా ఇచ్చారు.

విరసానిది కాల దోషం పట్టని భవిష్యత్ నిర్మాణ ప్రయత్నం. ఈ ప్రయాణంలో తన స్వీయ విమర్శను ప్రచురించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన గురించి పరిశీలకులు ఏమనుకుంటున్నదీ చాలాసార్లు బహిరంగంగానే అడిగి తెలుసుకున్నది. వాటితో తన కార్యాచరణను మెరుగుపరుచుకున్నది. విప్లవానికి నష్టం చేసే సూచనలను చర్చించి పక్కన పెట్టింది.

ప్రస్తుతం విప్లవోద్యమం తాత్కాలికంగా ఓడిపోయింది. ఇది మన కాలానికి కొత్త పరిస్థితి. కానీ, చరిత్ర చెప్పే గుణపాఠాలు నేర్వకుండా చరిత్రను మార్చే సృజనాత్మక, మానవీయ, ప్రజాస్వామిక కృషికి మానవాళి పూనుకోలేదు. ఈ క్రమ మంతటా మానవ ఆవిష్కరణలు, సాహిత్యం, కళలు వర్గపోరాట శాస్త్రంలో సంలీనమవుతుంటాయి. తన కాలానికి విరసం ఈ చెమటచుక్కల మేధో సంచిత జ్ఞానానికి వారసురాలు. దీన్ని వదిలేయడమంటే కాడి పడేసి తన దారి తను చూసుకోవడమే. విరసం ఈ పని చేయకపోవడమే విజయ్‌కుమార్‌కు కంటగింపు.

ఈ మేధో వాతావరణం అర్థం కాకుంటే, విరసంపై దాడుల స్వభావం గ్రహించలేం. విప్లవ రాజకీయాల అవసరాన్ని తిరస్కరించడమే ఇలాంటివాళ్ల అసలు ఉద్దేశం. విరసం సాహిత్య కృషి లేదన్నది విజయ్‌ కుమార్‌ విమర్శా? అయితే వర్గపోరాట రూపాల నూతన వ్యక్తీకరణలుగా ఆనాటి భూషణం ‘కొండగాలి’, అల్లం రాజయ్య ‘కొలిమంటుకున్నది’ నుంచి ఇప్పటి పాణి ‘అనేక వైపుల’, నల్లూరి రుక్మిణి ‘చుక్క పొడుపు’ దాకా నవలలు, కథలు చదవాలి. సమాజ గమనాలనూ, జీవన సంక్షోభాలనూ, ధిక్కార ఆచరణలనూ విప్లవ సాహిత్యం ఎట్లా చిత్రిస్తున్నదో చదివి చర్చిస్తే చాలా మంచిది. విరసం పత్రికలతో సహా ఈ సాహిత్యమంతా పబ్లిక్ డొమైన్‌లో ఉన్నదే. ‘వియ్యుక్క’ కథలు ఇంగ్లీష్‌లోకి అనువాదమయ్యాయి. త్వరలో లాటిన్, ఇతర విదేశీ భాషలలోకి వెళుతున్నాయి. మిగతా విరసం ప్రచురణలు ఇంగ్లీషు, హిందీ, పంజాబీ, ఒడియా, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ బాషాల్లోకి అనువాదం అయ్యాయి. విప్లవోద్యమ రచయితలు, విరసం సభ్యులు విప్లవ సాహిత్యోద్యమంలో భాగం.


మార్క్సిస్టు- లెనినిస్టు రాజకీయాలకు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలతో ప్రాచుర్యం కల్పించిన సాయిబాబా కవిత్వాన్ని, విరసం పూర్వ కార్యదర్శి కళ్యాణరావు నవలను ముందుపెట్టి ఆ రాజకీయాలపైనే విజయ్‌కుమార్ దాడికి దిగారు. పైగా సామ్రాజ్యవాదం అనే పదమే ఇష్టపడలేదు. దళిత, ఇతర అస్తిత్వాలను విరసానికి పోటీ పెట్టాలని ప్రయాస పడ్డారు. ‘‘బ్రాహ్మణీయ’’ అనే పదం కరపత్రంలో మూడుసార్లే మేం వాడామనేది ఆయన విమర్శ. గత పదేళ్లుగా బ్రాహ్మణీయ హిందూత్వ భావజాల వ్యతిరేక వ్యూహాన్ని సాహిత్య, ఐక్యసంఘటనా రంగంలో నిర్మించే పనిలో విరసం ఉంది. ఇది కులం, పితృస్వామ్యం, సనాతన ధర్మం, బ్రాహ్మణీయ పునాదులపై నిర్మాణమైన ఫాసిజం. కార్పొరేట్ పెట్టుబడి అవసరాలు తీర్చడానికి వచ్చిన ఫాసిజం. ఇది బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం అనీ, కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం అనీ విరసం సూత్రీకరించింది.

యూరప్ కంటే ఇండియా నిర్దిష్టత చాలా విషయాల్లో భిన్నం. ఇక్కడ భూస్వామ్యానికి కులం ఉంది. అది మతానికి, సంస్కృతికే పరిమితం కాదు. దళారీ, నిరంకుశ బూర్జువాతో కలిసి సామ్రాజ్యవాద ప్రయోజనాలకోసం ఇక్కడ కుల భూస్వామ్యం పని చేస్తోంది. అర్ధ భూస్వామ్య స్వభావం ఇది. పాత భూస్వామ్యం ఇప్పుడు లేకపోవచ్చుగాని, కుల భూస్వామ్య లక్షణాలతో కొత్త పెత్తందారులు గ్రామాల్లో తిష్ట వేసుకున్నారు. కార్పొరేట్, సామ్రాజ్యవాద పరిభాషలో పోస్టు మోడ్నరిజంతో పెనువేసుకుని మాట్లాడుతున్న వాళ్లు పట్టణాల్లో తయారయ్యారు. ఒక పక్క ఫాసిస్టులు ఆచరణలో రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోంటే, ఇంకో పక్క సిద్ధాంత రంగంలో రాజ్యాంగవాదం ప్రబలింది. ఫాసిజానికి వ్యతిరేకంగా ఉదారవాద, పీడిత అస్తిత్వ శక్తులతో కలిసి పని చేస్తూనే, రాజ్యాంగవాదాన్ని సిద్ధాంత స్థాయిలో విరసం ఎదుర్కొంటోంది. అధికారం ఒకేచోట కేంద్రీకృతం కావడం, అతివాద జాతీయవాదం, మనుషుల కంటే దేశం గొప్ప అనే భావజాలమే ఫాసిజం అని విజయ్‌కుమార్ అంటున్నారు. కానీ మన దేశంలో ఫాసిజం అంత స్వల్పమైంది కాదు. ఏది తోస్తే అదే ఫాసిజం అంటే కుదరదు. ఫాసిజం బారి నుంచి సమాజాన్ని, ముస్లిం తదితర సమూహాలను బైటపడేయడానికి ఈ ఆలోచనలు పనికి రావు.

విజయ్‌కుమార్‌కు ఇష్టం లేకపోవచ్చుగాని ప్రభుత్వ విధానాల ద్వారా దళారీ బూర్జువా అనే మాట సమకాలీనంగా ప్రజల అనుభవంలోకి వచ్చింది. సామ్రాజ్యవాదుల ప్రయోజనాలతోపాటు తన ప్రయోజనాలూ తీర్చుకొనే వర్గంగా అది ఎదిగింది. భూస్వామ్యం, దళారీ, బూర్జువా వంటి మాటలకు కాలం చెల్లిపోయిందంటే ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి హానీ తలపెట్టడమే. మారుతున్న సామ్రాజ్యవాద వ్యూహాలకు తగినట్లు సేవ చేస్తున్న దళారీ బ్యురాక్రటిక్ శక్తులను గుర్తించకపోతే భారత పెట్టుబడిదారీ విధానం అర్థం కాదు. కులం అర్థం కాదు. మరే పీడిత అస్తిత్వం అర్థం కాదు. కొత్త కార్మిక సంపుటి గిగ్ వర్కర్ల ప్రస్తావన విక్టర్ విజయ్‌కుమార్ సరిగ్గానే చేశారు. కానీ, ఆయన ఛీత్కరించే వర్గపోరాట సిద్ధాంతాన్ని, అదనపు విలువ సిద్ధాంతాన్ని ఈ అన్ని మార్పులూ రుజువు చేస్తున్నాయి. ఈ కార్మికుల అనుభవాలను సాహిత్యంలోకి తేవాల్సి ఉంది.

రివేరా

ఈ వార్తలూ చదవండి

దుర్గాపూజలో తొక్కిసలాట.. 17 మంది మృతి

రాత్రి నూడిల్స్‌ తిని.. తెల్లారేలోపు శవాలుగా..!

Updated Date - Oct 19 , 2026 | 05:19 AM