చలసాని ప్రసాద్ వర్ధంతి–విరసం సదస్సు
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:30 AM
అంతరంగమున అందరం మానవులమేనని చలసాని ప్రసాద్ నమ్మారు. ఉత్తరాంధ్రలోని సహజ నదులంత సుందరమైన, అందరినీ తనలో కలుపుకొన్న ఈ భావనను సైతం మానవుల సుదీర్ఘకలగా అసమ సమాజం...
అంతరంగమున అందరం మానవులమేనని చలసాని ప్రసాద్ నమ్మారు. ఉత్తరాంధ్రలోని సహజ నదులంత సుందరమైన, అందరినీ తనలో కలుపుకొన్న ఈ భావనను సైతం మానవుల సుదీర్ఘకలగా అసమ సమాజం మార్చివేసింది. బెత్తం లేని చదువులు ఆయన కన్న మరో కల. వలస కాలపు విద్యా వ్యవస్థను మానవీకరించాలని చలసాని ప్రసాద్ కోరుకున్నారు. కానీ, హరిత, నీలి, సాంకేతిక విప్లవాల గురించి ఊదరగొట్టిన గత ప్రభుత్వాల నుంచి హిందుత్వ విషం పాఠ్య పుస్తకాల్లో నింపుతున్న మోదీ ప్రభుత్వం వరకు.. ఏదీ విద్యపై గట్టిగా ఖర్చు పెట్టిన దాఖలా లేదు. కేంద్ర ప్రభుత్వ విద్యా బడ్జెట్ ఈ ఏడాది కేవలం 8.2శాతం. విద్యా బడ్జెట్ తగినంత లేనప్పుడు సమాజానికి ఉండే జ్ఞాన, సాంకేతిక అవసరాలను తీర్చగల రీసెర్చ్ వ్యవస్థలు కొత్తగా రావు. పాలకుల నిర్లక్షానికి ఇంతే ప్రమాదకర రీతిలో గురవుతున్న రంగం పర్యావరణం. కృష్ణా, గోదావరి నీళ్లు తాగిన చలసాని ప్రసాద్, ఆ నదులు ప్రవహించిన ప్రాంతాలన్నింటినీ తనవిగా చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండు కాదు.. ఐదు రాష్ట్రాలు చేయాలని ఆయన అనేవారు. వికేంద్రీకరణ అనే ప్రజాస్వామిక సూత్రం ఆధారంగా పాలమూరు, ఉత్తర తెలంగాణ, రాయలసీమ, పల్నాడుతో పాటు ఉత్తరాంధ్రకు కూడా ఆయన ప్రత్యేక రాష్ట్రం కోరేవారు. అయితే అధికారాన్ని, అభివృద్ధిని కేంద్రీకృతం చేసిన పాలకుల వైఖరితో బాగా దెబ్బతినిపోతోంది పర్యావరణమే. అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ అని చెబుతూ... పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలను మాత్రం ప్రభుత్వం విడుదల చేయడం లేదు. భూసేకరణ జరుగుతున్న ప్రాంతాలు కృష్ణా నదీ పరివాహకంలో, నీటి తావులతో నిండిన 29 గ్రామాల పరిధిలో ఉన్నాయి. రాజధాని నిర్మాణాల కోసం కొండవీటి వాగు సహజ ప్రవాహాన్ని మళ్లిస్తున్నారు. దీనివల్ల ప్రకృతిపై పడే ప్రభావం గురించిన అంచనాపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి. అప్పుడే క్యాపిటల్ గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీలోకి వస్తుంది. ఆ మాటకొస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పర్యావరణంపై పాలసీ అనేదే లేదు. అమరావతితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న ప్రకృతి విధ్వంసం, చలసాని ప్రసాద్ ప్రేమించిన మనిషితనం మాయం కావడం.. రెండూ భిన్నం కాదు.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోయాయి. ఈ స్థితిలో రైతులను ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. మంచిదే. కానీ, లక్షల గ్యాలన్ల నీరు అవసరమైన డేటా సెంటర్లను మాత్రం ఉత్తరాంధ్రకు వరుసగా ప్రకటిస్తోంది. మనకు తెలిసి ఇప్పటికి మూడు తెరపైకి వచ్చాయి. మరో 13 సెంటర్లు ప్రతిపాదన దశలో ఉన్నాయని చెబుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం గురించి ప్రజలను హెచ్చరిస్తూ... ఇన్ని డేటా సెంటర్లకు నీళ్లు ఎక్కడ నుంచి ప్రభుత్వం ఇస్తుందని పర్యావరణ వాదులు అడుగుతున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం పూర్తిచేసి ఎడమ కాలువ నుంచి ఒక టీఎంసీ జలాలను డేటా సెంటర్లకు ఇస్తామని మంత్రి లోకేశ్ సెలవిస్తున్నారు. లోకేశ్ అంచనాలు తప్పి అప్పటికీ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఈ సెంటర్లకు నీళ్లు ఎక్కడి నుంచి తరలిస్తారు? ఈ జలాలను ఆధారం చేసుకునే అధిక నీటి వినియోగం అవసరమైన డేటా సెంటర్లు, రసాయన పరిశ్రమలను, సోలార్ ప్లాంట్లను ఉత్తరాంధ్రకు తీసుకువస్తున్నారు. దీన్నంతా అభివృద్ధి అని ఊదరగొడుతున్నారు. ఉత్తరాంధ్ర ఎన్నడూ లేనంతగా పర్యావరణ ముప్పును చవిచూస్తోంది. ఈ మొత్తం క్రమాన్ని స్పష్టమైన సామ్రాజ్యవాద అనుకూల, పర్యావరణ వ్యతిరేక దృక్పథంతో పనిచేస్తున్న పాలకుల పాలసీల వైపు నుంచి అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో విరసం వ్యవస్థాపక నాయకుడు చలసాని ప్రసాద్ 11వ వర్ధంతి సందర్భంగా విశాఖ పౌర గ్రంథాలయంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు సదస్సు నిర్వహిస్తున్నాం. అరసవిల్లి కృష్ణ అధ్యక్ష ప్రసంగం చేస్తారు. ‘ఉత్తరాంధ్రలో డేటా సెంటర్లు – ప్రమాదంలో పర్యావరణం’ అంశంపై సుధ, (హెచ్ఆర్ఎఫ్) ‘పర్యావరణం–మార్క్సిజం’పై రివేరా ప్రసంగిస్తారు.
విప్లవ రచయితల సంఘం (విరసం)
ఇవి కూడా చదవండి
మీరు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటున్నారా? కేబినెట్ మంత్రులకు ప్రధాని ప్రశ్న
ఐపీఎల్‌లో కోహ్లీతో హ్యాండ్‌షేక్ వివాదం.. స్పందించిన ట్రావిస్ హెడ్