Share News

యాభై ఏళ్ల గాన జ్వాల!

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:40 AM

విమలక్క పాట 50 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో ప్రజాకళా జాతర జరగనున్నది. ఈ కార్యక్రమంలో 50 గంటలు ఏకధాటిగా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనుండడం విశేషం. ఈ...

యాభై ఏళ్ల గాన జ్వాల!

విమలక్క పాట 50 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో ప్రజాకళా జాతర జరగనున్నది. ఈ కార్యక్రమంలో 50 గంటలు ఏకధాటిగా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనుండడం విశేషం. ఈ యాభై గంటల్లో ప్రగతిశీల ఆటపాటలతో పాటు ఆదివాసీ, జానపద ప్రదర్శనల కార్యక్రమాలు తోడవుతున్నాయి. కానూరి తాత (కానూరి వెంకటేశ్వరరావు) కాలం నుంచి ప్రజా బాణీలు తీసుకుంది అరుణోదయ. ఈ సంస్థ నుంచి వెలువడిన వేలాది పాటలు, వందలాది కళారూపాల ప్రదర్శనలు జానపదం పునాది మీదుగా రూపొందాయి.

విమలక్క తండ్రి బండ్రు నర్సింహులు నాటి తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. నాలుగేళ్ల వయసు నుంచే విమలను ఉద్యమ సమావేశాలకు తీసుకొని పోయేవారాయన. అలా ఉద్యమ పాటలకు ఆమె ఆకర్షితురాలైంది. 1976లో అమరవీరుల స్తూపం ఆవిష్కరణ రోజున జరిగిన కార్యక్రమంలో విమలక్కను స్టూల్ మీదకెక్కెంచి పాడించారు. ఆమె గొంతులో జనం పాట పండి పరిపక్వమైంది. ఆ చిన్నారి గొంతెత్తి పాడుతుంటే జనం చప్పట్ల వర్షం కురిపించేవారు. మరికొందరు జారిన కన్నీటి బొట్లను తుడుచుకునేవారు. ఆమె గొంతులో కదలాడే ఆర్ద్రత, విషాదం శ్రోతలను విచలితం చేసేది. అలా బాల గాయని పెద్దల పాటల్ని పాడి మెప్పించింది. తల్లిదండ్రుల సహకారం తోడై పాటల రాణిగా నిలిచింది. నర్సింహులు తన భుజాలనే ఆమెకు వేదిక చేశారు. ప్రజల కోరిక మేరకు వేదికలపై ఎత్తు పెంచవలసి వచ్చేది. ‘పిల్ల చిన్నదైనా, గొంతు పెద్దదిరా!’ అనుకునేవారు.

సాంస్కృతిక రంగంలో పనిచేస్తూనే విమలక్క గాయనిగా పేరు తెచ్చుకుంది. 1981లో అరుణోదయ రాష్ట్రస్థాయి జనరల్ కౌన్సిల్‌లో కార్యవర్గ సభ్యురాలిగా ఎన్నికయింది. కానూరి తాత, అరుణోదయ రామారావు అధ్యక్ష కార్యదర్శులుగా ఉండేవారు. ఆ రకంగా ఆమె సాంస్కృతిక సారథిగా ఎదిగింది. ఈ అనుభవమే అరుణోదయలో ఎన్ని చీలికలు వచ్చినా కాపాడుకున్నది. పార్టీలో అప్పటికే పనిచేస్తున్న అమర్‌ (మిత్ర) కోరిక మేరకు ఇద్దరూ 1985లో ఒక్కటయ్యారు. మిత్రది పాట. విమలక్కది గానం. మిత్ర రాసిన వందలాది పాటలకు ఆమె మొదటి శ్రోత, గాయని.

అప్పటికే వంగపండు, గద్దర్, సంజీవ్, సంధ్య మొదలైన వారు పాటల ప్రభంజనం సృష్టించారు. విమలక్క తనదైన స్వరాన్ని సరిచేసుకుని దొరలపై, దోపిడీలపై, ఆధిపత్యాలపై గురిపెట్టింది. పాటకు సరికొత్త గొంతుకనిచ్చింది. మిత్ర పాటల గని లోంచి సరికొత్త భాస్వరం పుట్టించింది. చాలామంది ఉద్యమ అవసరాల పాటలు పాడుతున్న వేళ, సామాజిక పెత్తందారీ ఆధిపత్యాలపై రాగాలతో సాంస్కృతిక యుద్ధం ప్రకటించింది. ఆ గాన ప్రవాహం మొత్తం సమాజాన్ని ఒక కుదుపు కుదిపింది.


పాట పాడడం ఒక్కటే సరిపోదు, పాటకు ఆట జత చేయడం ఈ కాలపు అవసరం. పాట వినడం కాదు, దానిని చూడాలి. గద్దర్, వంగపండులది ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. అక్కడ పాట ఒక్కటే కాదు... సంగీతం, నృత్యం, అభినయం అన్నీ కలిసిన ఒక కొత్త కళారూపం. దీనికి విమలక్క మరింత వినూత్నంగా బృందాన్ని చేర్చింది. ఈ బృందంలోని చిన్నలూ పెద్దలూ గానం చేస్తారు. ఒకే రీతి హావభావాలొలికిస్తారు. నృత్యానికి అనువైన అడుగుల్ని వేస్తారు. పాటను కోకిల రాగంగా, అంటుకున్న దివిటీగా, రణభేరిగా రకరకాలుగా మోగించడం ఆమె ప్రత్యేకత. అరుణోదయ అనగానే ఆ కళాబృందం మొత్తం కనిపిస్తుంది. చిన్నతనంలో చేరిన కళాకారులు పెద్దవాళ్లై, చేతుల్లో చిన్నారులతో కనిపిస్తారు. సభా వేదికపై పాటల ఉరుములతో, అడుగుల్లో వీరత్వాన్ని వినిపిస్తారు. దానినొక బ్యాలేలాగా మార్చి శ్రోతల్ని ఉర్రూతలూగిస్తారు.

కళాకారులు, గాయనీ గాయకులు అరుణోదయను అంటిపెట్టుకొని ఉండేలా చేసిన విమలక్క కృషి చెప్పుకోదగినది. ఎన్నోసార్లు పోలీసుల దాడులు జరిగినా నిర్బంధాలకు గురైనా జంకూగొంకూ లేకుండా మునుముందుకే కదం తొక్కారు. పోరాటం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఆ మార్పును స్వాగతించినప్పుడే నిలబడగలం. అప్పుడప్పుడు రాజకీయంగా సెట్‌బ్యాక్‌లు సంభవిస్తాయి, ఒక్కోసారి కోలుకోలేనంత. అప్పుడు ముందుగా సాంస్కృతిక రంగం లేచి నిలబడి రాజకీయ రంగానికి చేయూతనివ్వాలి. అరుణోదయ ఆ పని సమర్థవంతంగా విమలక్క నేతృత్వంలో చేసింది.

అమరత్వ గీతాలను పాడడమే కాదు, పర్యావరణ పరిరక్షణ, బతుకమ్మను ప్రజల పండుగగా మార్చింది. కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రజల తరఫున బరిలో నిలబడింది. అనేక రకాల ప్రజా సమస్యలు ఎదురైనప్పుడు మేమున్నామని గొంగడి వేసి, గోసి పెట్టి అక్కడ ప్రత్యక్షమయ్యేది. కులం, మతం పేరుతో జరిగే దాష్టీకాన్ని అమర్ అక్షరాలుగా రాస్తే, విమలక్క వాటిని శబ్దాలు, రాగాలు, గానాలుగా మార్చి అనేక గొంతుల్లోంచి ఎదురొడ్డింది. తండ్రి వేలు పట్టుకొని తాను వేదికలెక్కినట్లు, కొంతమంది పిల్లల్ని తనతో పాటుగా కళాకారులుగా తీర్చిదిద్దింది. అటు సామాజిక ఒత్తిళ్లు, ఒంటరి జీవన పోరాటం చేస్తూ ‌కళారంగాన్ని తన రెక్కల కింద పొదువుకుని పెద్దక్క అయ్యింది. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలే కాదు... సుమారు 10–15 రాష్ట్రాలలో సాంస్కృతిక పర్యటన చేసింది. వందలాది ప్రదర్శనలు ఇచ్చింది.


50 గంటల ప్రజాకళా జాతర... రాత్రింబవళ్లు నిరంతరాయంగా ప్రజా పాటలు, సంగీతం, నృత్యం, బృంద గానాలతో కొనసాగుతుంది. శ్రమజీవి సాంస్కృతిక రంగానికి అద్దంపట్టే రీతిలో చర్చలు జరుగుతాయి.

ఓటములను చిటికెన వేలుతో తరిమేసిన వ్యక్తులు సమాజానికి ఉదాహరణ కావాలి. వారి కృషి సమాజానికి ఓ దివిటీ. ఈ క్రాంతిలో మరింతమంది వెలుగులోకి రావాలి. 52 ఏళ్ల అరుణోదయ ఒక రికార్డు. అందులో విమలక్క అనుభవం, జీవితం, పోరాటం లిఖించిన పాఠం.

l జయధీర్ తిరుమలరావు

(సెప్టెంబర్‌ 26–28 తేదీలలో హైదరాబాదులోని

ఆర్టీసీ కల్యాణ మండపంలో ‘ప్రజా కళా జాతర’.)

ఈ వార్తలనూ చదవండి:

ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్

కుల వివక్ష ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌కు మాజీ చీఫ్ మద్దతు

Updated Date - Sep 25 , 2026 | 03:40 AM