Viksit Bharat Shiksha Bill 2025: రాష్ట్రాల హక్కులను కాలరాసే విద్యాబిల్లు
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:25 AM
విద్యారంగంలో సంస్కరణలు చేపడతామని చెబుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్–2025’ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ద్వారా ఉన్నత విద్యపై కేంద్రం తన నియంత్రణ...
విద్యారంగంలో సంస్కరణలు చేపడతామని చెబుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్–2025’ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ద్వారా ఉన్నత విద్యపై కేంద్రం తన నియంత్రణ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, రాష్ట్రాల హక్కులను కాలరాయడమే. యూనివర్సిటీల అభివృద్ధి కోసం ఏర్పడిన యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈలను రద్దు చేసి, వీటిని హెచ్‌ఈసీఐ పేరుతో ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా విద్య కేంద్రీకరణకు కేంద్రం పాల్పడుతోంది. అంతేకాదు, ఈ బిల్లుతో విద్య కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ చేస్తూనే, ‘జ్ఞాన వ్యవస్థ’ పేరుతో తన హిందూత్వ ఎజెండాను దేశంలో అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ బిల్లును పరిశీలిస్తే అందులోని అంశాలైన ‘వికసిత్ భారత్ వినియమన్ పరిషత్ (నియంత్రణ), వికసిత్ భారత్ శిక్షా గుణవత్ పరిషత్ (అక్రిడేషన్), వికసిత్ భారత్ శిక్షా మానక్ పరిషత్ (ప్రమాణాలు)...’ వంటి పదాల వినియోగం కూడా విద్య కాషాయీకరణను తెలియజేస్తోంది. ప్రస్తుతం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లును ప్రతిపక్షాల వ్యతిరేకత కారణంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు. ఈ బిల్లును జేపీసీ క్షుణ్ణంగా సమీక్షించాల్సిన అవసరముంది. రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలకు, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఈ బిల్లు అనుగుణంగా ఉండేలా, ఉన్నత విద్యలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను అరికట్టేలా కేంద్రానికి జేపీసీ తగిన సిఫార్సులు చేయాలి.
మొత్తంగా చూస్తే, ఎన్‌ఈపీ–2020 ఆలోచన పునాది అయితే, ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్–2025’ బిల్లు దాని అమలు కోసం రూపొందించిన నియంత్రణ చట్టం. ఇది విద్యను విముక్తి సాధనంగా కాకుండా, కేంద్రంపై విధేయత పెంపొందించే వ్యవస్థలా మార్చే రాజకీయ ప్రాజెక్టు. ఈ కుట్రను అడ్డుకోకపోతే దేశంలోని విద్యా రంగం ప్రజల చేతుల్లోంచి శాశ్వతంగా జారిపోయే ప్రమాదముంది.
టి.నాగరాజు,
ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
Also Read:
చలికాలం.. ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఇదే
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!