Share News

విజయ్‌ విజయంలో పాఠాలు, హెచ్చరికలు!

ABN , Publish Date - May 09 , 2026 | 01:33 AM

ప్రజాస్వామ్యంలో ఎంత బలముందో ఎన్నికల ఫలితాల రోజు మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు అద్భుతాలు జరగవచ్చు. అసోం, పశ్చిమ బంగ, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి (యూటీ) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు...

విజయ్‌ విజయంలో పాఠాలు, హెచ్చరికలు!

ప్రజాస్వామ్యంలో ఎంత బలముందో ఎన్నికల ఫలితాల రోజు మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు అద్భుతాలు జరగవచ్చు. అసోం, పశ్చిమ బంగ, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి (యూటీ) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ బలాన్ని, అద్భుతాన్ని మన ముందు ఆవిష్కరించాయి. ఈ ఐదు అసెంబ్లీల తాజా ఎన్నికల్లో దిగ్భ్రాంతిని, ఆశ్చర్యాన్ని ఎక్కువగా కలిగించినది తమిళనాడు ప్రజా తీర్పు. రెండు బలమైన పార్టీలు పాతుకుపోయినప్పుడు, అవి ఎంతో కొంత కొంత మంచి చేస్తున్నప్పుడు.. వాటిని ఇంటికి పంపించేసి కొత్తపార్టీని అధికారంలోకి తీసుకురావటం మన దేశ పరిస్థితుల్లో దాదాపు అసాధ్యం. కానీ, తమిళనాడు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో అదే జరిగింది. ద్రవిడ పార్టీల మూస రాజకీయానికి గండిపడింది. ప్రస్తుతమున్న రాజకీయం కొనసాగటం సాధ్యం కాదు, ప్రజలు ఎప్పుడైనా ప్రభుత్వాల జాతకాలను తారుమారు చేయవచ్చు, కొత్త నేతలను, కొత్త పార్టీలనూ తీసుకురావచ్చు.. అన్నది తమిళ ప్రజల తీర్పులోని నిష్కర్ష. ఇది మంచి సంకేతం. అలాంటి హెచ్చరిక లేకపోతే పాతుకుపోయిన పార్టీలు తాము తప్ప ప్రజలకు ఇంకెవరూ గతిలేరని భావించే అవకాశముంది. దాన్నుంచి బయటపడటానికి ఇది మంచి అవకాశం. ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఎలాంటి మార్పులు తేవాలి, ప్రజల్లో అసంతృప్తిని ఏ రకంగా తొలగించాలి ఇత్యాది అంశాలపై పార్టీలు ఇకనైనా దృష్టి పెడితే మంచిది.

కానీ తమిళ ప్రజాతీర్పులో ప్రమాద ఘంటిక కూడా ఉంది. మంచి పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడుతున్న పార్టీలను తిరస్కరించి కొత్త పార్టీకి పట్టం గట్టారంటే.. క్షణాల్లో మార్పు రావాలన్న కోరిక ప్రజల్లో కనిపిస్తోంది. ఈ సోషల్ మీడియా యుగంలో తమ జీవితాల్లోనూ అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తుంది. వెంటనే మార్పు జరగాలనే కాంక్షతో, తొందరపాటుతో, ఆకాంక్షలు త్వరితంగా నెరవేరటంలేదనే అసంతృప్తితో గనక ఎన్నికల్లో ఓట్లు వేయటానికి ప్రజలు సిద్ధపడితే– దేశంలో అస్థిరత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి.. ఒకపక్కన అవకాశం, మరోపక్కన ప్రమాదం. దీన్ని కొంచెం లోతుగా అధ్యయనం చేసి పాఠాలు నేర్చుకోవాలి. తమిళనాడులో మైనారిటీలు– క్రైస్తవులు, ముస్లింలు– దాదాపు అందరూ విజయ్ పార్టీకి ఓటు వేశారు. అదే విధంగా 20 శాతంగా ఉన్న దళితులూ విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే)కి ఓటు వేసినట్లు అంచనా. సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్న తమిళనాడులో ప్రజలు ఇలా ఓటు వేయటంపై మనం వెంటనే మేలుకోనట్లయితే, మన రాజకీయంలో ఉన్న పొరపాట్లు సవరించుకోనట్లయితే.. మూల్యం చెల్లించుకోకతప్పదు. రాజకీయ పార్టీలు, అందులోనూ సాంప్రదాయ రాజకీయ పార్టీలు – జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని మిత్రపక్షాలు కావచ్చు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఇతర పార్టీలు కావచ్చు– యధాలాపంగా ఈ పరిణామాన్ని తీసుకోకూడదు. సమాజంలో అట్టడుగున ఏం జరుగుతున్నదో గమనించాలి.


పొరుగు శ్రీలంకలో అలా సరైన సమయంలో గమనించకపోవటం వల్ల ఆ దేశంలో ఏం జరిగిందో చూశాం. ఆ దేశ ప్రజలు ప్రధాన పార్టీలు రెండిటినీ తిరస్కరించి జనతా విముక్తి పెరముణ (జేవీపీ) నేత అనూర కుమార దిస్సనాయకేను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా, నేపాల్‌లో బాలేంద్రషా. పెద్ద విప్లవంలా పరిణామాలు జరిగాక, అన్ని ప్రధాన పార్టీలనూ ఇంటికి పంపించేసి కొత్తగా వచ్చిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ వేదిక ద్వారా బాలేంద్రషాని ప్రధానమంత్రిని చేశారు. తమిళనాడులోనూ ఆ రకమైన భావజాలం కొంత కనిపిస్తుంది. కానీ అక్కడి పరిస్థితులు వేరు. శ్రీలంకలోగానీ, నేపాల్‌లోగానీ ప్రధాన పార్టీలు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాయి. ఉప్పెనలా ప్రజలు తిరగబడ్డాక జరిగిన ఎన్నికల్లో కొత్త పార్టీలొచ్చాయి. తమిళనాడులో పరిస్థితి అది కాదు. దేశంలోనే సమర్థ పాలన నందిస్తున్నారు, ఆర్థిక ప్రగతి బాగా ఉంది అనుకున్నా తిరస్కరించారంటే.. ప్రజలు చాలావేగంగా జీవితాల్లో మార్పు రావాలని కోరుకోవటం ప్రస్ఫుటమవుతోంది. ప్రజలకు నచ్చచెప్పగలగాలి, మార్పు అంత వేగంగా జరగకపోవచ్చని తెలియచెప్పాలి. అధికారాన్ని వికేంద్రీకరించి, ప్రజలకు భాగస్వామ్యం కల్పించగలగాలి. ఇక ఓట్లకు విజయ్‌ పార్టీ డబ్బులు పంచినట్లు దాఖలాలు లేవు. మిగతా దక్షిణాది రాష్ట్రాలలో కేరళం మినహాయిస్తే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో వలే తమిళనాడులోని పార్టీలూ పుష్కలంగా డబ్బు పంచుతున్నాయి. డబ్బులున్నవారికే ఎన్నికల్లో సీట్లు ఇస్తున్నాయి. విజయ్ పార్టీ అలా కాదు. డబ్బుల ప్రభావం లేకుండా విజయం సాధించిందని చెబుతున్నారు. ఇది ఆలోచించదగ్గ అంశం. ఆహ్వానించదగ్గ పరిణామం.

చిరంజీవి, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ లాంటి వారికి దక్కని విజయం విజయ్ పార్టీకే ఎలా దక్కిందో మనకు తెలుసు అనుకుంటే, మనల్ని మనం మోసం చేసుకోవటమే అవుతుంది. పాతుకుపోయిన పార్టీలు బలంగా ఉన్నప్పుడు, రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నప్పుడు, మూడవ పార్టీకి మన ఎన్నికల వ్యవస్థలో స్థానం చాలా తక్కువ. కాబట్టి, మూడో పార్టీ గెలవలేక పోవడం ఆశ్చర్యమేమీ కాదు. ఎన్నికల సమయంలో సమాచారం ప్రకారం.. టీవీకే ఒక ప్రభావశీల పార్టీగా ఉంటుందిగానీ, ఎన్నికల్లో గెలిచే స్థాయి దానికి ఉండదని భావించాను. అసలు ప్రధాన పార్టీలనే పక్కనపెట్టి టీవీకే విజయం సాధించే అవకాశం వస్తుందని ఊహించలేదు. సకల జీవన రంగాలలో మార్పు వేగంగా రావాలనే ప్రజల ఆరాటానికి టీవీకే సంచలన విజయం ఒక సంకేతం. సాంప్రదాయ రాజకీయాలు ఉన్నవి ఉన్నట్లు కొనసాగిస్తే, అంటే, డబ్బు, కులం వంటివి తప్ప.. సామర్థ్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటం, మౌలిక మార్పులు తేవటం మాకు అనవసరం అనే రకంగా వ్యవహరిస్తే– ఇక కాలం చెల్లినట్లే. అయితే అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడకుండా, మనం కచ్చితంగా ఇది ఏ స్థాయిలో మార్పు అనేది చెప్పలేం.


ఆర్థిక ప్రగతి, పారిశ్రామికీకరణతోపాటు పట్టణీకరణ అధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. పట్టణీకరణ అధికంగా ఉన్న చోట ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, సంపద సృష్టి ఉంటాయి. అందువల్ల, రాజకీయంలో కొంత పరిణతికి అవకాశముంటుంది. మరి అలాంటి రాష్ట్రంలో ప్రజలు మరింత వేగంగా మార్పును కోరుకుంటున్నారు!. ముఖ్యంగా యువత, దళితులు, మైనారిటీలు, అట్టడుగువర్గాలు శీఘ్ర మార్పు కోరుతున్నాయి. అంత అద్భుతాన్ని కేవలం రోజుల్లో చేసే శక్తి ఎవరికీ లేదు. లాటరీలో మీకు అర్జంటుగా డబ్బులొస్తే కోటీశ్వరులు కావచ్చు గానీ, అకస్మాత్తుగా అందరినీ మిలియనీర్లను చేసే శక్తి ఎవరికీ లేదు. ఆర్థిక ప్రగతి రావాలంటే సమాజం కష్టపడవలసిందే. క్రమక్రమంగా మాత్రమే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దానికి ప్రజల్ని తయారుచేయాలి. మార్పు సాధనలో భాగస్వాముల్ని చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లోని ‘అమ్మ ఒడి’తో సహా దక్షిణాదిన ఇతర రాష్ట్రాల్లోని సంక్షేమ పథకాలన్నిటినీ గుదిగుచ్చి కాస్త అటూఇటుగా తమిళనాడులో టీవీకే కొత్తగా ప్రకటించింది. అదేవిధంగా, మహిళలకు తలసరి నెలకు రూ.2500, పుట్టిన బిడ్డకు ఉంగరం, పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 8 గ్రాముల బంగారం, నిరుద్యోగభృతి వంటివి ఉన్నాయి. తమిళనాడులో సంక్షేమ పథకాలను చాలాకాలంగా డీఎంకే, ఏఐడీఎంకే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. తాయిలాలను ఇస్తున్నా, ప్రస్తుత సాంప్రదాయ రాజకీయం మీద విరక్తిని ప్రజలు ప్రదర్శించారు.


బలంగా పాతుకుపోయిన సాంప్రదాయ పార్టీలు తమ అహంకారాన్ని ఇకనైనా వీడాలి. పాతపద్ధతుల్ని కొనసాగిస్తూ ప్రజలు తమను కాదని ఎక్కడికి పోతారులే అనుకుంటే.. ప్రమాదానికి, అస్థిరత్వానికి దారితీయవచ్చు. ఏ మార్పుని ఎందుకు తీసుకురావాలి అనే శోధన పార్టీల్లో చిత్తశుద్ధితో జరగాలి. డీఎంకే, ఏఐఏడీఎంకేపై ఇంత వ్యతిరేకత ఉందన్న సంగతి ఎన్నికల ముందు ఎవరూ గమనించలేదు. అయితే ఆ రెండు పార్టీలూ తుడిచిపెట్టుకుపోలేదు. డీఎంకే, అన్నాడీఎంకే కంటే టీవీకే కొంత ఎక్కువగా 30శాతానికి పైగా సాధించింది. కచ్చితంగా ఈ దేశంలో మనకు తెలియనిది జరుగుతోంది. ప్రజాస్వామ్యం అన్నా, ప్రజలు అన్నా, ఎన్నికలు అన్నా మనకు గౌరవం పెరగాలి. రెండో కంటికి తెలియకుండా, ఎవరూ ఊహించకుండా, ప్రజలు ఇంత నిశ్శబ్దంగా, డబ్బును, సాంప్రదాయ రాజకీయాన్ని పక్కనపెట్టి ఓట్లు వేస్తారని ఎవరూ ఊహించివుండరు. అంటే, ప్రజలకి ఎన్నికలనాడు ఎంతో బలముంది. అభిలషించిన మార్పుని పూర్తి శాంతియుతంగా, ఏ హింస లేకుండా, నిశ్శబ్దంగా ప్రజలు సాధించగలుగుతున్నారటానికి తమిళనాడు గొప్ప ఉదాహరణ. అదేవిధంగా, అసంతృప్తి, శరవేగంగా మార్పు రావాలనే కోర్కె ఉంది. శరవేగంగా అంత మార్పు తేవటం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో దళితులు, యువతకు ఎలా భాగస్వామ్యం కల్పించాలి, వారి అసంతృప్తికి, ఆకాంక్షలకు ఎలా వ్యక్తీకరణను ఇవ్వాలి, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని ఎలా సాధించాలి?.. అనేవి రాజకీయ వ్యవస్థ పట్టించుకోవాల్సి ఉంది. నిజమైన ప్రజాస్వామ్యంతో అధికార వికేంద్రీకరణ, అందులో ప్రజలకు భాగస్వామ్యం కల్పించటానికి విజయ్ తన సంచలన విజయాన్ని ఉపయోగించగలిగితే తమిళనాడుకి, దేశానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.

డాక్టర్ జయప్రకాష్ నారాయణ్

లోక్‌సత్తా వ్యవస్థాపకులు

ఇవి కూడా చదవండి...

పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం

Updated Date - May 09 , 2026 | 01:33 AM