ప్రత్యామ్నాయ సౌందర్యశాస్త్రం
ABN , Publish Date - Sep 14 , 2026 | 02:49 AM
కాలం మారినా సమాజం మారినా తరాలు మారినా సాహిత్యాన్ని చూసే చూపు కూడా మారినా, కొన్ని పుస్తకాలు పాతబడవు. వాటిలోని ప్రశ్నలు ప్రతి కొత్త కాలంలో కొత్త అర్థంతో మన ముందుకు...
వెంటాడే కలాలు
కాలం మారినా సమాజం మారినా తరాలు మారినా సాహిత్యాన్ని చూసే చూపు కూడా మారినా, కొన్ని పుస్తకాలు పాతబడవు. వాటిలోని ప్రశ్నలు ప్రతి కొత్త కాలంలో కొత్త అర్థంతో మన ముందుకు వస్తూనే ఉంటాయి. పాతికేళ్ళక్రితం వెలువడిన ‘వెంటాడే కలాలు – వెనుకబడిన కులాలు’ అలాంటి సంకలనం. ఇది జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో 2001లో వెలువడింది. దీని ప్రాధాన్యం కేవలం బీసీ జీవితాలను సాహిత్యంలోకి తీసుకురావడంలో లేదు. ఆ జీవితాలు కవిత్వంగా మారినప్పుడు ఏమి మారింది– అనుభవం మాత్రమేనా? భాష, రూపం, ప్రతీక, దేహ బోధ, శబ్దం, కవితా స్వరం కూడా మారాయా? అనే ప్రశ్నను ముందుకు తీసుకురావడంలో ఉంది.
సాహిత్యం గుర్తించే అనుభవాల పరిధిని, వాటిని వ్యక్తీకరించే భాషా–రూపాల పరిధిని, వాటిని విలువైనవిగా భావించే ప్రమాణాల పరిధిని విస్తరించడాన్ని ప్రత్యామ్నాయ సౌందర్య శాస్త్ర ప్రతిపాదనకు మూలంగా భావిస్తే– అలాంటి ప్రతిపాదన ఈ ‘వెంటాడే కలాలు – వెనుకబడిన కులాలు’ సంకలనంలో జరిగిందని గమనిస్తాం. కవితలోకి వచ్చిన అనుభవం భాషను మార్చితే, కొత్త ప్రతీకను నిర్మిస్తే, పాత రూపాన్ని పునర్నిర్మిస్తే, శబ్దానికి కొత్త అర్థం ఇస్తే, దేహాన్ని కొత్త దృష్టితో చూపిస్తే, మౌఖికతను సాహిత్య భాషగా నిలబెడితే, ఒక సాధారణ వస్తువును సామాజిక జ్ఞాపకంగా మార్చితే, అక్కడ సౌందర్య విస్తరణకు అవకాశం ఏర్పడుతుంది. ఈ విస్తరణ ఈ సంకలనంలో మూడు స్థాయిల్లో జరుగుతుంది. మొదటిది వస్తు విస్తరణ– ఇంతవరకు అంచున ఉన్న వృత్తులు, శ్రమలు, జీవన అనుభవాలు కవితా వస్తువులుగా ప్రవేశించాయి. రెండోది రూపాత్మక విస్తరణ– ఆ అనుభవాలు పాత కవితా రూపాల్లో మాత్రమే కాకుండా సంభాషణ, పత్రరూపం, మౌఖిక పలుకు, వస్తు ప్రతీక, శబ్ద నిర్మాణం వంటి భిన్న పద్ధతుల్లో వ్యక్తమయ్యాయి. మూడోది ప్రమాణాత్మక విస్తరణ– ఒకప్పుడు సాహిత్యానికి తక్కువగా పరిగణించబడిన భాష, దేహం, వస్తువు, శబ్దం, అనుభవం కూడా సౌందర్యాన్ని నిర్మించగలవని నిరూపించాయి.
ఈ సంకలనంలో ఇరవై మూడు మంది బీసీ కవులు, కవయిత్రులు అట్టడుగు కులాల శ్రమైక జీవన సంస్కృతిని, వారి ఆత్మకథనాత్మక అనుభవాలను కొత్త కవితా వస్తువులుగా స్వీకరించారు. అంబటి వెంకన్న, అనిశెట్టి రజిత, బాణాల శ్రీనివాసరావు, బెల్లి యాదయ్య, జి. విజయలక్ష్మి, జూలూరు గౌరీశంకర్, నాళేశ్వరం శంకరం, ప్రసాదమూర్తి, సీతారాం వంటి కవులు తమ కలాల ద్వారా సరికొత్త జీవిత దృశ్యాలను పాఠకుల ముందుంచారు. స్వర్ణకార–కమ్మరుల కొలిమి సెగలు, గొర్రెల కాపరుల మందల పయనం, నాయీ బ్రాహ్మణుల నిత్య క్షవరం, చేనేత మగ్గాల సంక్షోభం, దేవదాసీ–కళావంతుల సామాజిక ఆర్తి వంటి విభిన్న కులవృత్తుల సంక్లిష్ట వాస్తవాలు ఇందులో ఆవిష్కృతమవుతాయి.
తెలుగు సాహిత్యంలో శ్రమ, పేదరికం, అసమానత, అట్టడుగు జీవితం మొదటిసారి బీసీ సాహిత్యం వల్లనే కనిపించాయని ఇక్కడ చెప్పటం లేదు. ఆ అనుభవాలకు తెలుగు సాహిత్యంలో ముందే స్థానం ఉంది. ‘వెంటాడే కలాలు’ ప్రత్యేకత బీసీ వృత్తి–జీవన అనుభవం తనదైన భాష, వస్తు ప్రపంచం, శారీరక అనుభవం, వృత్తి జ్ఞానం, కుటుంబస్మృతి, కుల సంబంధం వంటి అంశాలతో కవితా నిర్మాణాన్ని ఎలా ప్రభావితం చేసిందో చూడటంలో ఉంది. అనుభవం కొత్తది కావడం కంటే, ఆ అనుభవం కళాత్మకంగా ఎలా రూపాంతరం చెందిందన్నదే ఇక్కడ విమర్శ చేయవలసిన అంశం.
సీతారాం ‘రెజ్యూమ్’ కవిత అధికారిక బయోడేటా నమూనాను స్వీకరిస్తూ ‘చిరునామా: అవమానం/ ఆత్మన్యూనత’, ‘కులం: మంగలి’ వంటి వివరాలను పేరుస్తుంది. ఆ విధంగా అర్హత, గుర్తింపు అనే ఆధునిక భావనలను అది నిలదీస్తుంది. కాగితపు ధ్రువపత్రాలే అర్హతను నిర్ణయిస్తాయనే వ్యవస్థకు ఎదురుగా, కులవ్యవస్థ మిగిల్చిన గాయాల అనుభవ పత్రాన్నే పాఠకుల ముందుంచడం ఈ కవిత ప్రధానంగా చేసిన కళాత్మక పని. మరీ ముఖ్యంగా, ‘రెజ్యూమ్’ అనే అధికారిక పత్రరూపాన్ని కవితగా ఉపయోగించడం ద్వారా కవి విషయాన్ని మాత్రమే మార్చలేదు, రూపాన్నే మార్చాడు.
అనిశెట్టి రజిత రచించిన ‘దొర్సానీ ఓ దొర్సానీ’ కవితలో దేహబోధ మరో ముఖ్యమైన సౌందర్య విస్తరణగా కనిపిస్తుంది. సాధారణంగా దేహబోధ అంటే తన శరీరం పట్ల ఉండే అవగాహన. ఇక్కడ మాత్రం దేహబోధ అంటే శరీరంపై, శరీరంలో, శరీరం ద్వారా వ్యక్తమయ్యే జీవనానుభవాన్ని సౌందర్యానుభవంగా గుర్తించే దృష్టి. ‘ఇన్నొద్దులు నువు కాలుకింద బెడితే/ నీ అరికాల్లకు నొప్పయితదని నా అరచేతుల్ని పర్సిన’ అనే వ్యక్తీకరణలో అరచేతులు కేవలం శరీరంలోని ఒక భాగంగా కనిపించవు, అవి ఒక స్త్రీ జీవితంలో పేరుకున్న శ్రమ, బాధ, అవమానం, వర్గ–కుల దోపిడీ అనుభవాలకు గుర్తులుగా నిలుస్తాయి. శరీరంపై పడిన గాయాలు శరీరంలోనే మిగిలిపోకుండా కవితలో భావంగా మారతాయి. ఇక్కడ దేహం బయటి నుంచి చూసే అలంకార రూపం కాదు, లోపల నుంచి మాట్లాడే జీవితం. అందువల్ల ఇక్కడ సౌందర్యం దేహం బాహ్య ఆకృతిలో కాక, ఆ దేహం మోసిన అనుభవంలో, ‘నా ఆత్మగవురం మర్లబడి / నెత్తురు బొట్లై రాలుతున్న నా కన్నీల్ల సాచ్చిగా’ అన్న ఆత్మగౌరవ ప్రకటనలో కనిపిస్తుంది.
బాణాల శ్రీనివాసరావు రచించిన ‘కుంపటి’లో రూపాంతరం మరో స్థాయిలో జరుగుతుంది. ‘పనిముట్లు రకరకాల రాగాలు పలికేవి/ జాతికారు పాడే జావళీలతో/ పట్కారు చేసే పదనిసల లయల్తో/ పట్టెడ మొద్దు అందించే కాంగో మోతల్తో’ అనే వ్యక్తీకరణలో పనిముట్టు ఒక శబ్దవస్తువు నుంచి సంగీతానుభవంగా మారుతుంది. కొలిమి పనిలో వినిపించే మోత, దెబ్బ, చలనం, పునరావృతం– ఇవన్నీ కవి చెవిలో లయగా మారతాయి. సౌందర్యం మృదువైన వాద్యాల నాదంలోనే ఉంటుందని అనుకున్న సంప్రదాయ దృష్టి ఇక్కడ విస్తరిస్తుంది. కంసాలి, కమ్మరి పనిముట్ల శబ్దం కూడా కవితలో సంగీతంగా వినిపించగలదని ‘కుంపటి’ చూపిస్తుంది.
జూలూరు గౌరీశంకర్ రచించిన ‘కొలిమి’లో ‘‘పెద్ద బాడిశ నా చేతి పొడిగింపేకాదు, తరతరాల నాగలికి, నాగరికతకు దీర్ఘకాలిక కొనసాగింపు’’ అనే భావనతో వస్తువు నుంచి ప్రతీకకు కవిత ప్రయాణం మొదలవుతుంది. బాడిశ చేతి పొడిగింపుగా, సృష్టి సాధనంగా, చరిత్రను మోసే ప్రతీకగా మారుతుంది. ఇక్కడ కళాత్మక ప్రక్రియ పనిముట్టు ప్రతీకీకరణ. శిల్పాన్ని చూసే చూపు నుంచి శిల్పాన్ని సృష్టించే సాధనాన్ని చూసే చూపుకు కవిత మారుతుంది.
బెల్లి యాదయ్య ‘పాదాలు’ కవిత శరీరంలోని అట్టడుగు భాగాన్ని కవితా కేంద్రంగా నిలబెడుతుంది. ‘పాదాలు చాలా గొప్పవి’ అనే మాటతో మొదలయ్యే ఆలోచన శరీర భాగాన్ని కేవలం నడవడానికి మాత్రమే ఉన్న అంగంగా చూడదు. నేలను తాకుతూ జీవనం సాగించే మనిషి సమస్త అనుభవాలకు అవి అసలైన వెన్నెముక. ‘‘మురికిని భరిస్తూ ముఖానికి పరిమళాలను జతచేస్తాయి/ పాచిని నాకుతూ నాలుకకు ఫలహారాన్ని అందిస్తాయి/...పాదాల నుంచి పుట్టినందుకు/ చరిత్రహీనున్ని కాదు నేను చరిత్రకారుణ్ని’’ అని కవి ప్రకటించడం ద్వారా సాహిత్యం ఇంతవరకు ఏ దేహాన్ని చూస్తూ వచ్చింది, ఏ భాగాన్ని తక్కువ చేసి వదిలేసింది అనే మౌలిక ప్రశ్న ముందుకు వస్తుంది.
మందరపు హైమవతి రచించిన ‘జ్యూయలరీ షాపు’ కవితలో జీవితం సంప్రదాయ సౌందర్యపు అలంకరణల ద్వారా కాక, శ్రామికుల విధ్వంస అనుభవాల ద్వారా కనిపిస్తుంది. ‘‘వందల చందమామలు/ ఒక్కసారే విరిసిన/ దీపాల వెలుగులో/ ధగధగ మెరిసే షాపు’’ అనే దృశ్యం కేవలం ఒక వైభవోపేత వాతావరణాన్ని చూపించదు, ఆ వెలుగు వెనుక ‘‘అప్పులు తీర్చలేక / ఆత్మహత్య చేసుకొన్న / మా అన్నయ్య శవచిత్రం’’ దాగి ఉందన్న భయానక నిజాన్ని గుర్తుచేస్తుంది. కవితలో వెలుగు ఒక అలంకార దృశ్యంగా నిలవకుండా, దోపిడీకి గురవుతున్న మనుషుల జీవితాలపై పడే చూపుగా మారుతుంది. ఈ కవితలో ప్రత్యామ్నాయ సౌందర్యం కొత్త అలంకరణలను చూపించడంలో లేదు, ఆడంబరాల వెనుక అణగిపోయిన కళాకారుల ‘మట్టిగొట్టుకొన్న వేళ్ళు’ మోసిన విషాదానికే కవితా విలువను ఇవ్వడంలో ఉంది.
జి. విజయలక్ష్మి రచించిన ‘పొదిలో కత్తి’ కవితలో ఒక పనిముట్టు పీడిత స్త్రీ ప్రతిఘటనకు, సాంస్కృతిక ధిక్కారానికి ప్రతీకగా మారుతుంది. ‘పొదిలో కత్తి’ అనే శీర్షికే ఒక అణగారిన కులవృత్తి ప్రపంచాన్ని మన ముందుకు తెస్తుంది. కత్తి ఇక్కడ కేవలం క్షవరం చేసే పనిముట్టు మాత్రమే కాదు, దొరల వెట్టిచాకిరీని, అవమానాలను, కామపు చూపులను ఎదురించి నిలబడే పోరాట సాధనం. ‘‘దొరగాడి దొడ్డిగుమ్మంకాడ/ నీల్ల తొట్టివయ్యావు నువ్వు’’ అంటూ భర్త దాస్యత్వాన్ని ప్రశ్నిస్తూనే, ‘‘పొదిలో కత్తికి మెత్తగా పదునెట్టు/ గడ్డాలు తడిపె గిన్నెలో ఆల్ల రగతం పిండు’’ అని కవిత గర్జిస్తుంది. శ్రమజీవి చేతిలోని వస్తువు తిరుగుబాటు ఆయుధంగా మారిపోతుంది. అందువల్ల ఇక్కడ ప్రత్యామ్నాయ సౌందర్యం పనిముట్టును వర్ణించడంలో లేదు, దాని వెనుక ఉన్న శ్రమను, బహుజన స్త్రీ రగిలించిన చైతన్యాన్ని కవితా ప్రతీకగా మలచడంలో ఉంది.
ఈ కవితలను సమగ్రంగా పరిశీలించినప్పుడు ప్రత్యామ్నాయ సౌందర్యం ఒకే మూసలో తయారవడం లేదని స్పష్టమవుతుంది. కాబట్టి ‘బీసీ సాహిత్యం’ అనే పదాన్ని కేవలం రచయిత కులపరిచయంతో నిర్వచించలేం. అదే సమయంలో కుల నేపథ్యాన్ని పూర్తిగా తొలగించి ‘‘ఇది అందరి మానవ అనుభవమే’’ అని చెప్పడం కూడా సరిపోదు. కులం ఒక సామా జిక అనుభవ నిర్మాణం. వృత్తి, శ్రమ, భాష, కుటుంబం, అవమానం, ఆత్మగౌరవం వంటి వాటి మీద అది ప్రభావం చూపుతుంది. అయితే సాహిత్యపరంగా ముఖ్యమైనది ఆ అనుభవం రచనలో ఏ మార్పును తెచ్చిందన్నది. కవితా రూపం మారిందా? పదజాలం మారిందా? ప్రతీక చిత్రించిన విధానం మారిందా? స్వరం మారిందా? పాఠకుడి దృష్టి మారేలా ఏదైనా కళాత్మక చర్య జరిగిందా? ఈ ప్రశ్నల ద్వారానే బీసీ అనుభవం సాహిత్య నిర్మాణంలో ఎలా పనిచేసిందో గుర్తించవచ్చు.
‘‘కేవలం జీవనానుభవం ఉన్నంత మాత్రాన కవిత్వం అవుతుందా?’’ అనే ప్రశ్నకు సమాధానం స్పష్టంగా ‘కాదు’. అనుభవం ఒక్కటే కవిత్వానికి హామీ కాదు. కవిత్వం అనుభవాన్ని శిల్పంగా మార్చాలి. ఈ సంకలనంలోని ముఖ్యమైన రచనల బలం అక్కడే కనిపిస్తుంది. పత్ర రూపం కవితా రూపమవుతుంది, శబ్దం లయగా మారుతుంది, పనిముట్టు ప్రతీకగా మారు తుంది, దేహం సాక్ష్యంగా మారుతుంది, మౌఖిక భాష కవితా భాషగా మారుతుంది, వస్తువు కుటుంబ–వృత్తి చరి త్రను మోస్తుంది.
ఈ దృష్టిలో ప్రత్యామ్నాయ సౌందర్యం పాత సౌందర్యానికి విరోధంగా తెచ్చిపెట్టిన తాత్కాలిక నినాదం కాదు. ఒక కొత్త జీవితం సాహిత్యంలోకి రావడం మొదటి మార్పు. ఆ జీవితాన్ని వ్యక్తీకరించడానికి కొత్త భాష, కొత్త రూపం, కొత్త ప్రతీక, కొత్త శబ్ద నిర్మాణం అవసరం కావడం రెండో మార్పు. ఆ కొత్త రూపాలకు కూడా సాహిత్య విలువ ఉందని పాఠకుడు అంగీకరించడం మూడో మార్పు. ఈ మూడు మార్పులు కలిసినప్పుడే సౌందర్య విస్తరణ అనే మాటకు తాత్విక అర్థం వస్తుంది.
అందుకే ‘వెంటాడే కలాలు’ను బీసీ జీవితాల ఆవేదనకు సంబంధించిన సంకలనంగా మాత్రమే చదవడం సరిపోదు. దానిని ఒక సిద్ధాంత నినాదాల గ్రంథంగా మాత్రమే చదవడమూ సరిపోదు. ఇది ముందుగా కవితల పుస్తకం. వాటి లోపలే దాని సౌందర్య ప్రతిపాదనలు దాగి ఉన్నాయి. అక్కడి నుంచి మనం సిద్ధాంతాన్ని నిర్మించాలి. కవితల మీద సిద్ధాంతాన్ని రుద్దకూడదు. కవితల్లోని భాష, రూపం, ప్రతీక, శబ్దం, దేహానుభవం, వృత్తి ప్రపంచం– ఇవే సిద్ధాంత నిర్మాణానికి ఆధారాలు కావాలి.
పాతికేళ్ల తర్వాత ఈ పుస్తకాన్ని మళ్లీ తెరవాల్సిన అవసరం కూడా ఇక్కడే ఉంది. ‘ఎవరి జీవితం కవిత్వానికి వస్తుంది?’ అనే ప్రశ్న మాత్రమే కాదు, ‘ఎలాంటి రూపంలో వస్తే దాన్ని కవిత్వంగా గుర్తిస్తాం?’ అనే ప్రశ్న కూడా అడగాలి. ‘ఏ భాష అందమైనది?’ అనే ప్రశ్నతో పాటు ‘ఎవరి మాటను ప్రామాణిక భాషగా పరిగణిస్తాం?’ అన్న ప్రశ్నను కూడా అడగాలి. ‘ఏ దేహం సౌందర్య దేహం?’ అనే ప్రశ్నతో పాటు ‘ఏ దేహం సమాజాన్ని మోస్తుందో మనం చూడగలుగుతున్నామా?’ అనే ప్రశ్నను కూడా వేయాలి. ‘ఏ శబ్దం సంగీతం?’ అనే ప్రశ్నకు సమాధానమిచ్చేటప్పుడు కొలిమి మోతను కూడా వినగలమా! అని ఆలోచించాలి. ‘ఏ వస్తువు కవితా ప్రతీక?’ అని అడిగేటప్పుడు పాదాన్ని, కత్తిని, బాడిశను, చేనేత బట్టల మూటను కూడా చూడగలమా! అని ప్రశ్నించాలి. ఈ ప్రశ్నలు మిగిలినంతకాలం ‘వెంటాడే కలాలు’ పాత పుస్తకం కాదు. అది ఒక కాలాన్ని నమోదు చేసిన సంకలనం మాత్రమే కాదు, సాహిత్యాన్ని చూసే మన ప్రమాణాలను నిరంతరం పరీక్షించే పాఠ్యం.
(‘వెంటాడే కలాలు–వెనుకబడిన కులాలు’ సంకలనం రజతోత్సవ సభ సెప్టెంబరు 20 ఉదయం 10 గంటల నుండి సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో జరుగుతుంది.)
వెంకటరామయ్య గంపా
99586 07789
ఈ వార్తలనూ చదవండి:
బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు
ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!