కవి పండిత బాలకుడు
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:17 AM
తెలుగులో రాసేవాళ్ళతో, చదివేవాళ్ళతో సంభాషణ కోసం ఉవ్విళ్ళూరేవారు వేలూరి వెంకటేశ్వరరావు గారు. అలా కవులు కూచుని హస్కు కొట్టుకోడాన్ని ఆయన Tête–à–tête అనేవారు. 1992లో ఒక వేసంగి. అట్లాంటాలోన..
వేలూరి వేంకటేశ్వరరావు (1938–2026)
తెలుగులో రాసేవాళ్ళతో, చదివేవాళ్ళతో సంభాషణ కోసం ఉవ్విళ్ళూరేవారు వేలూరి వెంకటేశ్వరరావు గారు. అలా కవులు కూచుని హస్కు కొట్టుకోడాన్ని ఆయన Tête–à–tête అనేవారు. 1992లో ఒక వేసంగి. అట్లాంటాలోన పెమ్మరాజు వేణు గోపాలరావుగారు ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు. నన్ను ‘‘ఏఁవండీ రండి... వేలూర్ని కేకేస్తాను! రండి!!’’ అని పిలిచేరు. వాళ్ళిద్దరూ అలా కేకేస్తే నేను లొట్టలేసుకుంటూ చాల దూరం డ్రైవ్ చేసుకుని వెళ్ళేను. కెరొలీనా, జార్జియా పీచ్ పళ్ళ దుకాణాలు, Gasoline 1$ అనే హోర్డింగ్‌లు దాటుకుంటూ. వేణుగోపాలరావు గారింట్లో పెరడు, నడవాలు బొమ్మరిళ్ళలా కళాత్మకంగా తీర్చిదిద్దుకున్నారు. ఆయన అప్పట్లో కవులందరివీ ఒక్కో కవిత తీసుకుని సంకలనంగా వేసేరు– మచ్చు తునకలు అని కాబోలు. ఆ పుస్తకం బల్ల మీద పెట్టుకుని వేలూరి గారు భోజనాల బల్ల మీద Tête– à–têteకి సిద్ధంగా కూర్చున్నారు. ఆయన సైన్సదీ చాల చదువుకున్నారు, కాని ఆయనకి నిజంగా ఇష్టమైన శాస్త్రం సామాన్య శాస్త్రం కాదు, సాహిత్య శాస్త్రం. అరవైలనాటి ఆంధ్ర యూనివర్శిటీ, అబ్బూరి, తిలక్, శ్రీశ్రీ ఇవన్నీ ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నారు. ఆ రోజు భోంచేస్తూ ‘‘అన్నం తినేటప్పుడు ఏ సమయంలో ‘ఇంక చాలు!’ అనుకుని లేవాలో అది... అది చాల కష్టం!’’ అని చెప్పేరు. ఆయనకి నిజంగా ఇష్టమైన భోజనం, ‘ఇంక చాలు!’ అని ఎలా ఎప్పుడనుకోవాలో తెలీకుండా భోంచేసే విందు సాహిత్యం. అంటే కాయితాల మీద పేజీల్లో, ఒకర్నొకరు కేకేసుకునీ, Tête–à–têteలలోనూ ఆబగా జుర్రుకునేది. అప్పటికింకా ఇంటర్నెట్, వెబ్ అని ఏఁవీ లేవు.
ఇంట్లో వేణుగోపాలరావుగారు ఒక్కరే ఉన్నారు. చెస్ లాంటి ఆటలు ఆడేవాళ్ళు, పేకాడేవాళ్ళు, చిన్నపిల్లలూ ఇంటికెవరొచ్చినా ‘‘రా! ఒకెత్తు వేద్దాం?!’’ అని సతాయిస్తారు కదా. వేలూరి వ్యవహారం అంతా అలాగే ఉండేది ‘‘రండి! కవిత్వం గురించీ, రైటర్స్ గురించీ మాట్లాడుకుందాం!’’ అని కవ్విస్తున్నట్టు, కాలు దువ్వుతున్నట్టూ. కవి తిలక్ గురించి చాలా చెప్పేరు. తిలక్ అంటే పారవశ్యంలా ఉండేది నాకు. అవన్నీ అడిగడిగి, నోరెళ్ళబెట్టుకుని విన్నాను. ఆయన ఎవర్నీ ఊరకే ఉండనిచ్చేవారు కాదు. సంభాషణ ఏ మాత్రం ఆగినా ‘‘ఊఁ ఇంకేంటండీ చెప్పండి..?’’ అని చర్చని ఎగసనదోసేవారు. అది వివాదం అయితే ఆయనకి మరింత ప్రీతి. పేరుమోసినవాళ్ళు, రకరకాల బులుపులు, ప్రలోభాలున్న మనుషుల్ని గురించి నిక్కచ్చిగా ఎత్తిపొడుస్తూ నవ్వించేవారు. అలాగే ఆయన గౌరవించే మనుషులు, వాళ్ళ వ్యాసంగాల గురించి విశేషంగా పొగుడుతూ చెప్పేవారు. సంభాషణ అంటే వాదం, ప్రతివాదమున్నూ. అటుంచి ఆయన ఒక బాణం వేస్తే, ఇట్నుంచి మనం ఒక ప్రతిబాణం వెయ్యాలి. చర్చ ఇలా ‘‘రగడ రగడ రగడం! కానీరా జగడ జగడ జగడం!!’’ లాగ రంజుగా రాజుకోవాలి. కాఫీలవీ రప్పిస్తూ, పదిమందిమీ నవ్వు మొహాలు పెట్టుకుని వింటూ, అంటూ తింటూ వినోదిస్తూ, సాహితీ ప్రపంచపు మనుషులు, పుస్తకాల నిజాల నిగ్గుతేల్చటం ఇది ఆయనకి ప్రియమైన విందు భోజనం. సైంటిష్ట్, మార్క్సిష్ట్, ఎన్నారై సాహితీ దిగ్గజం ఇలాంటి గుర్తింపులు ఎన్నున్నా ఆయన మౌలికంగా ఇలా అమర్త్య సేన్ గారు చెప్పినలాంటి ఫక్తు రసవాది, ఇంకా ప్రతివాది భయంకరుడు – Argumentative Indian. ఆ తరవాత 1998లోనేమో, టెక్సస్ లోనో ఎక్కడో తెలుగు సభల్లో ఆయనతో, నారాయణరావు గారితో కలిసి నడుస్తూ భోజనాల కోసం వెతుక్కున్నామని గుర్తొస్తోంది.
ఆయనలో సాహిత్య కాంక్ష ఇంత ప్రబలంగా ఎందుకు వేళ్ళూనుకుందో అర్థం చేసుకోవాలంటే ఆయనకు చిన్నతాతగారైన వేలూరి శివరామ శాస్త్రి గారి చరిత్రని, ఆయన కుటుంబ నేపథ్యాన్నీ చదువుకుంటే బోధపడుతుందేమో. శివరామ శాస్త్రి గారు గొప్ప కవి, మహా పండితుడు. కవులకీ కవులకీ వాగ్యుద్ధాలు జరిగే సత్తెకాలపు రోజుల్లో ఆయన తమ గురువులు తిరుపతి వేంకట కవుల తరపున ఎగస్పార్టీ (కొప్పరపు) కవుల మీద ‘బస్తీ మే సవాల్!’ లాంటి కవిత్వ బాణాలు ప్రయోగించి రంగ ప్రవేశం చేసేరనీ, విస్తృతంగా శతావధానాలు చేసేరనీ చరిత్ర. వస్తుతః సాధువు, పరమ కారుణ్యమూర్తి అయిన శివరామశాస్త్రి గారినే రెచ్చగొట్టగలిగిన ఇలాంటి రసకందాయమైన సాహిత్య వాతావరణం, కుటుంబ నేపథ్యాల ప్రభావం ఒకవైపు, ఈ పాత వాగ్వైభవాల వాసనల్ని, పద్ధతుల్నీ చాదస్తమని గ్రహించుకుని, తమ సాంస్కృతిక వారసత్వం సమస్తాన్నీ ‘బ్రాహ్మినిజం’ అని తిరస్కరించి, అవమానిస్తూ వచ్చిన కొత్త కాలపు శాస్త్రీయ దృక్పథం, సామ్యవాదం, ఆధునిక విద్యల ప్రభావం ఇంకొకవైపు వేంకటేశ్వర రావు గారిని చెరొకవైపూ లాగుతూ ప్రభావితం చేసి ఉంటాయి. ఈ పెనుగులాటలో మార్క్సే గెలిచాడు. వ్యక్తిత్వం అంటే మనం పెరిగి పెద్దయ్యేక కావల్సినవి నాలుగూ ఎంచుకొని బాహ్యంగా ప్రకటించుకోగలిగినది మాత్రమే కాదు. బాల్యం నుండి మనకంటూ ఏ వ్యక్తిత్వమూ ఇంకా ఏర్పడని రోజుల్లో మన అనుభవాలు, విన్నవి చూసినవీ అనుభవించినవీ ఇవన్నీ మన వ్యక్తిత్వాల్ని, ప్రవర్తననూ విశేషంగా, తప్పనిసరిగా ప్రభావితం చేస్తాయి.
కృష్ణ కర్ణామృతం లోని శ్లోకం ఒకటి. యశోద చిన్ని కృష్ణుణ్ణి జోకొడుతూ రామకథ చెప్తుంది: ‘‘రామో నామ బభూవ, హుం, తదబలా సీతేతి, హుం’’ అని మొదలౌతుంది. ఆ కథ వింటూ ఊ కొడుతూ నిద్రపోతున్న వాడల్లా కృష్ణుడు– సీతాపహరణం, రావణుడి ప్రసక్తి వచ్చే సరికి ఉలిక్కిపడి దిగ్గున లేచి ‘లక్ష్మణా! నా విల్లెక్కడ? ఏదీ, ఏదీ తే?!’ అని లేస్తాడు. లీలాశుకుడు నాలుగే పాదాల్లో ఇంత కథనూ చిత్రించిన పద్ధతి చాల మనోహరంగా ఉంటుంది. ఈ శ్లోకమంటే వేలూరి చెవి కోసుకునేవారు, ఇష్టంగా వర్ణించేవారు.
2010లో అనుకుంటాను. అట్లాంటాలో వాళ్ళింటికెళ్ళేను. ఏమీ మాట్లాడలేననీ పాట పాడతానని అనంటే సరే పాడండి అన్నారు. ప్రయాగ రంగదాసు కృతి రామ రామయనరాదా అనుంది, అది పాడేను. నవ్వుకుని ఉంటారు, ‘ఇలా దేవుడి పాటలా పాడుకుంటున్నాడు!’ అని. నాతో ఏమీ అనలేదు. తను పెంచుకుంటున్న మిరప మొక్కల్ని చూపించేరు. ఆయన, శాంతి గారు నేను వెళ్తుంటే మళ్ళీ రావాలి నాల్రోజులుండాలి అని పదే పదే చెప్పేరు. 2012లోన వాళ్ళిద్దరూ హైదరాబాద్ వచ్చేరు. వాళ్ళిల్లు ఒక కొసన, మేము ఇంకో కొసన. నేనే వెళ్ళి తీసుకొచ్చేను.
నా గాండీవం అప్పటికే విరిగిపోయి చాన్నాళ్ళయ్యింది. ఆయన వాక్ప్రవాహానికి నేను ఊఁ కొడుతున్నాను, హుం, హుం అని. మధ్య మధ్యలో మా పనమ్మాయి ఎలా వండుతోందోనని ఓ చూపు చూసుకుంటూ. తను ఆ కూర ఎలా చెయ్యాలో తెలీక నన్నడుగుతుంటే నేను ఎలా చెయ్యాలో చూపించొచ్చి కూర్చుని మళ్ళీ ఊఁ కొడుతుంటే ఆయన కళ్ళు మెరుస్తూ, ఒళ్ళంతా కదుల్తూ చాల నవ్వేరు. శాంతిగారికి తలనొప్పి ఆరోజంతా. నేను మాత్తర్లు తెచ్చిచ్చేను. ఆ తరవాత ఊరు చూట్టానికెళ్ళేము. యూనివర్శిటీ అంతా తిప్పుతూ ఇక్కడ మీరు పాఠాలు చెప్పొచ్చు అనంటే ఆయన అన్యమనస్కంగా ‘ఆఁ చూద్దాం లెండి!’ అన్నారు.
ఆయనకి ఫిజిక్స్ మీద లేదు. కవిత్వం, కథల మీదనే ఉన్నాది. నేనేం అడగకుండానే ఆయనే తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు ‘‘నా శక్తి కొద్దీ రాసినా, ఎంతగా ప్రయత్నం చేసినా, ఇంకా చాలదూ అది కాదూ అంటే... if all of that isn't enough, then... then what else am I supposed to do?’’ అని అన్నారు. నేనేమీ అనకుండానే ఆయన ఎందుకలా చెప్పుకున్నారా అనుకున్నాను. అది లోలోతుల్లోని ధనుర్ధారి తనమీద తనే ఎక్కుపెట్టుకున్న బాణం. మార్క్సిజం, పరమాణు భౌతిక శాస్త్రం, సాహితీ సమాజం, ప్రవాస జీవితపు దుఃఖం, ఎన్నారై పెద్దరికం, మనందరికీ తప్పనిసరైన సాంఘిక మర్యాదా ఇన్ని బరువు దొంతర్ల కింద నలుగుతున్న కవి పండిత బాలకుని అభినివేశపు ఆక్రందన, జన్మాంతర సౌహృద. ఏ లోపలి నూతుల్లోంచో ఏకాంతంలో ప్రతిధ్వనిస్తున్నట్లు. ప్రతిగా ఏ కేకా వెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోయేను. ‘‘సరే బై అండీ! వెళ్ళొస్తాం నమస్తే అండీ!!’’ అనే శలవు తీసుకున్నాను.
ఆయన చాల చమత్కారంగా మాట్లాడేవారు. మాటకారితనంతో మెత్తగా చురకలు పెట్టేవారు. సాహిత్యం గురించి, రాసి చదివే మనుషులు, పుస్తకాల్ని గురించిన ఆసక్తి, ఆపేక్ష ఆయనకు చివరివరకూ ఏమాత్రం వన్నెతగ్గకుండా ప్రకాశిస్తూనే వచ్చేయి. నాకు ఆ ఆసక్తి, ఆపేక్ష క్రమంగా క్షీణిస్తూ వచ్చి, చివరికి పదాలు, వాక్యాలు చెప్పే ఏ కథా, ఏ అనుభూతీ, ఎలాంటి సత్యమూ అక్కర్లేదు, ఒద్దుగాక ఒద్దని కొడిగట్టిపోయింది. ఇది ఆయన్ని నొప్పించింది అనుకుంటాను. చాల రకాలుగా ‘కేకేస్తూ’, కబుర్లు పెడుతూ, కవ్విస్తూ వచ్చేరు. పడుకున్నాడో పోయేడో తెలీని కవిని తట్టి లేపి, ఉత్సాహపరచే ప్రయత్నం చాల చేసేరు. కాని నేను ప్రతిగా ఏమీ అనలేకుండా గమ్మునుండిపోయేను. ఇది ఆయన్నేకాదు, నేను స్నేహితుణ్ణని అనుకున్న మంచి మనుషులెందర్నో నిరాశ పరుస్తూనే వచ్చింది. నేను ఇంక నిండా ములిగినవాడికి చలేఁవిటన్నట్టు ఊరుకున్నాను. 2019 ప్రాంతాల్లోన తన కవితల పుస్తకం ‘అవ్యయ’ కాపీ పంపించేరు. నేనేమీ అనలేకపోతే మళ్ళీ ఇంకొకటి పంపించేరు. ఏదైనా అనవయ్యా?! అని కవ్వించటం కాదు, బతిమాలుతున్నట్టే. కేలిఫోర్నియా వచ్చి చుక్కా శ్రీనివాస్ దగ్గర నా నెంబర్ తీసుకుని ఫోన్ చేసేరు. ‘‘ఊఁ..ఏంటండీ?’’ అని. గొంతులో ఇది వరకటి అల్లరి లేదు. రిటైరైన తర్వాత పెన్షనర్ని అని, చాలు, హాయిగా... అనీ ఇలాగ. రమ్మనమన్నారు. నేను వెళ్ళి దొంగ నమస్కారాలు పెట్టినా ఆయనకీ, ఎవరికీ ఏ ప్రయోజనమూ లేదని గమ్మునే ఉండిపోయేను. ఆయనకి చాన్నాళ్ళుగా ఆశ్చర్యం, అపనమ్మకంలా ఉండేది అనుకుంటాను. ‘ఏదో ఒకటీ రాసి, చేసీ చూపించవయ్యా! ఈ పలవరింతలేంటి?’ అని. What a terribel waste! అన్నట్టూ.
టచ్చిలో ఉండమని మా అమ్మే నన్నడగటం మానుకుంది. టచ్ మీ నాట్ కూడా ఒక మొక్కే కదా! ఊరికే మూసుకునుండటం అమర్యాద కాదు అని, అది ఒక్కళ్ళం మనతో మనమే ఆడుకునే Tête–à–tête లాంటిదనీ ఆయనకి మాటల్లో ఎలా చెప్పటం? మౌనం భగవాన్ పదస్పర్శ. నిరంతరాయంగా నెత్తి మీదనే పెట్టుకుని పడుంటే అది ప్రేమకు, గౌరవానికీ, సృజనకూ పరాకాష్ఠ. భాష వలన కలిగే దుఃఖాన్ని కడిగే శాంతి అది అని వేలూరికి ఇప్పుడింక ఎలాగ?
కనకప్రసాద్ సరిపల్లి
ఇవి కూడా చదవండి:
భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..
భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్