Share News

వివాదమే లక్ష్యంగా ‘వందేమాతరం’ బిల్లు!

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:39 AM

‘వందేమాతరం’ గీతం ఎప్పుడు పాడినా మొత్తం పాడాల్సిందేనన్న నిబంధనను విధించే దిశగా ఈ వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్‌ టు నేషనల్ హానర్ యాక్ట్–1971’ను సవరించేందుకు...

వివాదమే లక్ష్యంగా ‘వందేమాతరం’ బిల్లు!

‘వందేమాతరం’ గీతం ఎప్పుడు పాడినా మొత్తం పాడాల్సిందేనన్న నిబంధనను విధించే దిశగా ఈ వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్‌ టు నేషనల్ హానర్ యాక్ట్–1971’ను సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ముందు ‘వందేమాతరం’ పాడి, ఆ తరువాతే ‘జనగణమన’ పాడాలని, ఒకవేళ వందేమాతరాన్ని పాడకపోతే వాళ్లకు జైలు శిక్ష కూడా ఉంటుందన్న హెచ్చరికనూ ప్రభుత్వం చేయబోతున్నది.

బిల్లులు పెట్టే స్వేచ్ఛ ప్రభుత్వాలకు ఉంది. కానీ అవి ‘పౌర స్వేచ్ఛ’లను హరించేవిగా ఉండకూడదు. అంతేగాక, ఆ బిల్లులు రాజ్యాంగ స్వభావానికి భిన్నంగా కూడా ఉండకూడదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) మనకు ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’ను ఇచ్చింది. ఆర్టికల్ 25 ‘మత స్వేచ్ఛ’ను ఇచ్చింది. ‘‘వందేమాతరం మొత్తం పాడకపోతే నేరం’’ అని చట్టం చేస్తే, అప్పుడు రాజ్యాంగానికి ఇచ్చిన విలువ ఏంటి?

‘ఒక గేయాన్ని గానీ, ఒక గీతాన్ని గానీ తప్పనిసరిగా అందరూ పాడాలి’ అనే చట్టాన్ని తెస్తే అది నిర్బంధమే అవుతుంది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమవుతుంది. ఈ మాటను ఇప్పుడు మనం చెప్పడం కాదు; రాజ్యాంగ సభ అధ్యక్షుడు డా. రాజేంద్రప్రసాద్ తొలినాళ్లలోనే- ‘‘వందేమాతరం పట్ల గౌరవం ఉండాలి. కానీ ఎవరి మనస్సాక్షికీ వ్యతిరేకంగా బలవంతం చేయకూడదు,’’ అని అన్నారు. ‘‘వందేమాతరం దేశభక్తి గీతం. మత భావనతో ఎవరికైనా ఇబ్బంది అయితే బలవంతం చేయరాదు. దేశభక్తి అనేది స్వచ్ఛందంగా ఉండాలి. బలవంతం చేస్తే అది హింసతో సమానం,’’ అని మహాత్మాగాంధీ అన్నారు. దీన్ని ‘రెండు శ్లోకాల’కు పరిమితం చేసింది కూడా ఆయనే.

‘వందేమాతరం’ బంకిమ్‌చంద్ర ఛటోపాధ్యాయ 1870లో రాసిన ‘ఆనంద మఠం’ నవలలోని ఒక గీతం. మాతృభూమిని దేవతగా భావిస్తూ మతపరమైన భాషతోను, రూపకాలతోను రాసిన గీతం అది. బ్రిటిష్ వ్యతిరేక జాతీయోద్యమంలో ఇది ఒక ‘స్వాతంత్ర్య పోరాట నినాదం’గా మారింది. మొత్తం ‘ఆరు పద్యాలు’గా ఉండే ఆ పాటలో మొదటి రెండు పద్యాలలో ప్రకృతి గురించి, భూమి గురించి, దేశభక్తి గురించిన వర్ణన ఉంటుంది. ఆ తరువాత వచ్చే మూడు పద్యాలలో భూమిని తల్లిగా భావిస్తూ– ఆ తల్లిని కాళికతోనూ, సరస్వతితోనూ, లక్ష్మితోనూ పోలుస్తూ ఉంటుంది. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్‌ను విభజించాక, ‘వందేమాతరం’ ఒక ఉద్యమ నినాదంగా మారింది. 1906–1910లలో బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ‘వందేమాతరం’ అనే నినాదాన్ని నిషేధించింది. నిషేధం కారణంగా ఇది మరింత ప్రజాదరణ పొందింది. రాను రాను స్వాతంత్ర్య ఉద్యమంలో ఇది భావోద్వేగ గీతంగా కూడా నిలిచింది. ప్రజల్లో ఇది ప్రతీకాత్మక జాతీయ గీతంగా మారిపోయింది.


1930లలో కాంగ్రెస్ వర్గాల్లో దీన్ని జాతీయ గీతంగా స్వీకరించాలన్న చర్చలు జరిగాయి. కానీ ముస్లిం నాయకులు మాత్రం దీనికి అభ్యంతరం తెలిపారు. వీరిలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రథములు (కాంగ్రెస్ అధ్యక్షుడు, తొలి విద్యాశాఖ మంత్రి): ‘‘వందేమాతరానికి స్వాతంత్ర్య ఉద్యమంలో చారిత్రక పాత్ర ఉంది. కానీ ‘ఆనంద మఠం’ నవలలోని హిందూ దేవతారాధన భావనలతో కూడిన వ్యాఖ్యలు ముస్లింలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మొదటి రెండు శ్లోకాలు మాత్రమే దేశభక్తిని సూచిస్తాయి’’ అని, ఆయన తన అభిప్రాయాన్ని ప్రకటించారు. మౌలానా మహ్మద్ అలీ జౌహర్ (ఖిలాఫత్ నాయకుడు) ‘‘వందేమాతరాన్ని నినాదంగా వాడటానికి నేను వ్యతిరేకం కాదు; కానీ దాన్ని మత సంబంధమైన ప్రతీకగా మార్చకూడదు’’ అన్నారు. మహ్మద్ అలీ జిన్నా, అలాగే ఇంకా కొందరు.. ఈ గీతంలోని హిందూ దేవతారాధన భావాల పట్ల తమ అభ్యంతరాలను చెప్పారు.

వందేమాతరం గేయం మీద ఇలాంటి చర్చ ఒకటి గతంలోనే జరిగిందని, ఆ చర్చలో భాగంగానే ఆరు శ్లోకాలను రెండుకు కుదించారని ప్రభుత్వానికి తెలియంది కాదు. ఇప్పుడు ‘‘మొత్తం పాడాలి’’ అని ఒక బిల్లును ప్రవేశపెట్టి, ఒక చట్టం చేసి, ప్రభుత్వం సాధించేది ఏమిటి, ఒక అలజడిని సృష్టించడం తప్ప?!

నన్నూరి వేణుగోపాల్

ఇవి కూడా చదవండి

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్

12వ అంతస్తు నుంచి కిందపడ్డ యువకుడు.. రోడ్డుపై వెళుతున్న మహిళపై పడటంతో..

Updated Date - Jul 22 , 2026 | 12:39 AM