Share News

వలస జీవితాలపై వాస్తవిక వీక్షణం

ABN , Publish Date - Apr 20 , 2026 | 05:41 AM

వలస వెళ్ళిన ఎన్నారైలు తమ పిల్లలని విదేశంలో సామాజిక రాజకీయ పరిస్థితులని గమనించుకుంటూ కాపాడుకోవాలి. వారికి అవసరమైన చేయూతనివ్వాలి. మారుతున్న సమాజం, టెక్నాలజీ పిల్లలపై...

వలస జీవితాలపై  వాస్తవిక వీక్షణం

వలస వెళ్ళిన ఎన్నారైలు తమ పిల్లలని విదేశంలో సామాజిక రాజకీయ పరిస్థితులని గమనించుకుంటూ కాపాడుకోవాలి. వారికి అవసరమైన చేయూతనివ్వాలి. మారుతున్న సమాజం, టెక్నాలజీ పిల్లలపై మానసికంగా మోపుతున్న బరువు ఎంతటిదో, వారిని కాచుకునే క్రమంలో తల్లిదండ్రుల మానసిక సంఘర్షణ అంతగా ఊహకందనిది, ఇప్పటి దాకా ఎవరూ ప్రస్తావించనిది. ఈ నేపథ్యంలో ఐదు తరాల అమెరికా వలస వాతావరణాన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తూ సుస్మిత రాసిన నవల ‘వలస’. ఈ నవల దేశీయ పాఠకుల్ని కూడా సమానంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా రచయిత్రి సుస్మితతో నవల గురించి రెండు ప్రశ్నలు:

వలస నవల రాయడానికి ప్రధాన ప్రేరణ ఏమిటి? ప్రధానంగా జెండర్ డిస్పోరియాను చర్చించటానికి ఈ నవల రాశారని అనుకోవచ్చా?

కోవిడ్ తరువాత జీవితాల్లో వచ్చిపడిన మార్పులకి మూలం ఏమిటనే ఆలోచనలోంచి ‘వలస’ నవల పుట్టింది. టెక్నాలజీ ఒళ్ళో కూర్చుని పాటలు వింటూ, తిండి తింటూ పెరుగుతున్న పిల్లల మానసిక శారీరక ఆరోగ్యం ఎలా ఉండబోతోందనే ఆలోచనే ఈ నవలకి ప్రేరణ. ‘నేనెవరు?’ అనే తాత్విక ప్రశ్నకి సమాధానాన్ని హిమాలయ యోగుల దగ్గరనుంచీ, ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అన్వేషిస్తారు. ఆ ఐడెంటిటీ క్వెస్ట్ - ‘గుర్తింపు కోసం అన్వేషణ’ జెండర్‌కి సంబంధించినదైనప్పుడు, నూటికి నూరుసార్లు డయాగ్నసిస్ సరైనదే అయుండాల్సిన అవకాశం లేనప్పుడు, జెండర్ ఐడియాలజీ స్కూళ్ళలో, సినిమాల్లో ప్రస్తావిస్తున్నప్పుడు, హార్మోన్ థెరపీలూ, ప్రొసీజర్స్ సామాన్యులకి అందుబాటులోకి వస్తున్న సమయంలో సగటు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలను చర్చకు పెట్టేందుకు ‘వలస’లో ప్రయత్నం చేసాను. స్కూళ్ళ నుంచి వచ్చే ఈమెయిల్స్ లో, కార్పొరేట్ ఆఫీసుల్లో సంబోధనలో వచ్చిన మార్పులు చూస్తున్నాం. ఇవి పిల్లల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, వాటిని తల్లిదండ్రులు ఎలా గమనించాలనేది తీసిపారేయదగిన విషయం కానేకాదు. వృత్తిరీత్యా ఆరోగ్య రంగానికి సంబంధించిన ఆర్థిక సమీకరణాల పట్ల నాకున్న అవగాహన కూడా ఈ నవలా రచనలో ఉపయోగపడింది.


ప్రవాస జీవిత అనుభవాల గురించి రాసిన ఈ నవలకు ప్రవాసుల స్పందన ఎలా ఉంది?

‘వలస’ని భారతదేశంలో ఉండే తెలుగు పాఠకులు ముందుగా అక్కునచేర్చుకుని ఆదరించారు. నవల భారత్‌లో అచ్చవడం, మార్కెట్‌లో ముందుగా అందుబాటులోకి రావడం వలన వెంటనే చదివి స్పందించినది వారే. ప్రవాస భారతీయులు ‘వలస’లోని పాత్రలలో తమని తాము చూసుకున్నామని, బయటకు చెప్పేందుకు తటపటాయించే విషయాలని ప్రస్తావించడం బావుందని సంతోషపడ్డారు. ఉదాహరణకి ఇందులోని కమల పాత్ర విజిటర్లుగా అమెరికా వచ్చిన తల్లిదండ్రులందరికీ ఇదొక జైలు జీవితమన్నట్టు రాసే కథల స్టీరియో టైప్‌ని బద్దలుగొడుతుంది. అమెరికా జీవితాన్ని చాలా ఆస్వాదించే తల్లిదండ్రులు కూడా ఉంటారు. అమెరికా జీవనమొక అద్భుతమన్నట్టు కానీ, కాదని కానీ నేనెక్కడా వకాల్తా తీసుకోలేదు. సాధకబాధకాల్ని ఉన్నదున్నట్టు చూపించాను. నవల చదివిన చాలామంది ఎన్నారైలకి అది నచ్చింది.

ఇంటర్వ్యూ కల్పనా రెంటాల

ఈ వార్తలు కూడా చదవండి

పల్నాడు జిల్లాలో దారుణం.. ఆరేళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించిన తండ్రి..

నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

Updated Date - Apr 20 , 2026 | 05:41 AM